‘‘కడప లోక్ సభ సభ్యుడు అవినాశ్ రెడ్డిని మరో గంటలో అరెస్టు చేస్తున్నారు.. ఆయనను హైదరాబాద్ తరలించడానికి హెలికాఫ్టర్ పెడుతున్నారు. కేంద్ర బలగాలను రప్పించి అవినాశ్ ను పట్టుకువెళతారు..’’ ఇవి తెలుగుదేశం చానళ్లు తమ ఇష్టానుసారంగా ప్రసారం చేసిన కొన్ని వార్తలు. ఆ దురదృష్టవశాత్తు ఆ చానళ్లను చూసినవారికి ఏదో జరిగిపోతోందేమోనన్న అభిప్రాయం కలుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే గోలతో హోరెత్తించారు. అవినాశ్ ను అరెస్టు చేయకపోతే.. ఇంకా అరెస్టు చేయరా?.. అంటూ చర్చలు!.
నిజానికి ఇంతవరకు అవినాష్‌ను సీబీఐ నిందితుడిగా పేర్కొనలేదు. కేవలం సాక్షిగానే విచారణ చేస్తూ వస్తున్నారు. తర్వాత రోజులలోసీబీఐ ఏమి చేస్తుందన్నది వేరే విషయం. కాని టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లు కసితో , కక్షతో ,దుర్మార్గపు ఆలోచనలతో ఉన్నవి,లేనివి కలిపి అబద్దపు ప్రచారాలు చేశాయి. సోమవారం అంతా ఇదే గోల.
దీనికి కారణం ఏమిటంటే 22 వ తేదీన సీబీఐ విచారణకు అవినాశ్ వెళ్లవలసి ఉంది. కాని తన తల్లి అనారోగ్యం కారణంగా వారం రోజులు టైమ్ ఇవ్వాలని కోరారు.సీబీఐ అక్రమంగా తనపై కేసు పెట్టేలా ఉందన్నది ఆయన అనుమానం. అందుకే ముందస్తు బెయిల్ కోసం సుప్రింకోర్టుకు కూడా వెళ్లారు. ఈ పరిణామాలను ఏ మీడియా అయినా వార్తలుగా ఇవ్వడం తప్పు కాదు. కాని టీడీపీ మీడియా చేసిన అల్లరి , అరాచకం చూస్తే జర్నలిజం ఇంత నీచంగా మారిందా?..
జర్నలిస్టుల ముసుగులో కొందరు ఇంత నగ్నంగా తమ రాక్షసత్వాన్ని బయటపెట్టుకుంటారా? అన్న ఆవేదన కలుగుతుంది. టీడీపీ మీడియాకు మాత్రమే స్వేచ్చ ఉంటుందని, గౌరవ ఎమ్.పికి మాత్రం స్వేచ్చ ఉండదని, ఆయనకు ప్రైవసీ ఉండదని వీరు భావిస్తున్నారు. ఆయన తన తల్లి లక్ష్మమ్మ ఉన్న కర్నూలు ఆస్పత్రికి వెళుతుంటే, ఆయనేదో విదేశాలకు పారిపోతున్నట్లుగా ఈ మీడియా దుర్మార్గంగా వ్యవహరించింది. ఆయన వెంటబడింది. వేటాడింది. అవినాశ్ అనుచరులు అడ్డుకోపోతే దౌర్జన్యం అని ప్రచారం చేసింది.
👉 నిజానికి టీడీపీ మీడియానే సిగ్గు వదలి పచ్చి అసత్యాలను ప్రచారం చేస్తూ అవినాశ్ పై మాటల దాడి చేస్తూ దౌర్జన్యంగా ప్రవర్తించింది. ఒకప్పుడు బ్రిటన్ లో ఆ దేశ యువరాణి డయానా ఒక కారులో ప్రయాణిస్తుండగా, కొందరు పాపరాజీలు అంటే జర్నలిస్టు ముసుగులో ఉన్న వ్యక్తులు ఆమెను వెంబడించారు. వారి బారినుంచి బయటపడేందుకు డయానా కారు డ్రైవర్ వేగంగా వాహనం ప్రమాదానికి గురి కావడం , డయానా మరణించడం జరిగిపోయాయి. అప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మీడియాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జర్నలిస్టులు అతిగా వ్యవహరిస్తున్నారని అంతా వ్యాఖ్యానించారు. సరిగ్గా ఇప్పుడు అవినాశ్ పై కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. పోనీ ఇలానే ఇతర కేసులలో కూడా ఈ మీడియా స్పందిస్తోందా? అంటే అదేమీ లేదు.టీడీపీకి చెందినవారు అయితే అంతా గుప్ చుప్ గా ఉంటున్నారు.
👉 మార్గదర్శి స్కామ్ లో రామోజీని సీఐడీవిచారిస్తే ఈ మీడియా ఎందుకు ఆయన ఇంటి ముందు గుమి కూడలేదు?హడావుడి చేయలేదు. సీఐడీ సైతం ఆయనను చాలా గౌరవంగా విచారించిందే. రామోజీ సీఐడీవిచారణకు ముందుగా నడుంకు పట్టి పెట్టించుకున్నవైనం, సహాయకులతో పడుకున్నట్లు నటించిన వైనంపై ఎందుకు కధనాలు ఇవ్వలేదు? రామోజీ వందల కోట్ల బ్లాక్ మనీని సర్కులేట్ చేశారన్నది అభియోగం. అది నేరమా? కాదా? మరికొన్ని ఇతర కేసులు చూద్దాం.
గతంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు భవంతిలో నాటుబాంబులు పేలి నలుగురు మరణించారు.అయినా ఆయనకు ఏమీ కాలేదు. అప్పుడు ఈ మీడియా అసలు ఏమీ జరగనట్లు వ్యవహరించింది. ఆ రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన డిల్లీ వచ్చినప్పుడల్లా కోడెల కూడా వచ్చి కేంద్రంలోని పెద్దలను కలిసి తనపైసీబీఐ విచారణ రాకుండా చూసుకునేవారు. చివరికి ఆనాటి కేంద్ర హోం మంత్రి అద్వానీని మేనేజ్ చేసి ,అసలుసీబీఐ కి అనుమతి ఇవ్వకుండా చేయగలిగారు.
👉 ప్రముఖ సినీ నటుడు, చంద్రబాబు బావమరిది బాలకృష్ణ తన ఇంటిలో కాల్పులు జరిపితే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయినా ఏమీ కాలేదు.పైగా ఎన్.టి.ఆర్.కుమారుడిని అరెస్టు చేస్తారా అంటూ అదేదో తప్పు అన్నట్లు కధనాలు ఇచ్చారు. బాలకృష్ణకు ఆనాటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు సాయం చేసి మెంటల్ అని ఒక సర్టిఫికెట్ ఇచ్చి కేసు నుంచి రక్షించారు. ఆ రోజుల్లోనే బాలకృష్ణ ఇంటి వద్ద ఒక సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద స్థితిలో మరణించారు.
అయినా ఈ మీడియా దానిని సీరియస్ గా భావించలేదు. చంద్రబాబు అధికారంలో ఉండగా తిరుమల శేషాచలం అడవులలో ఇరవై మందిని ఎన్ కౌంటర్ చేస్తే కూడా ఎవరిపైన కేసు రాలేదు. పైగా ఎర్రచందనం స్మగ్లర్లను చూస్తూ ఊరుకుంటామా అని ఎదురు ఇదే మీడియా ప్రశ్నించింది. అప్పుడు మానవహక్కుల గురించి మర్చిపోవాలన్నమాట.
👉 అదే టీడీపీకి మద్దతు ఇస్తున్న ఒక ఎమ్.పి ఎపిలో కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఉపన్యాసాలు ఇస్తే కేసు పెట్టారు. కాని ఆయనను కొట్టారన్న ఒక ఎలిబి సృష్టించి కేసును పక్కదారి పట్టించారు. సుప్రింకోర్టు సైతం అప్పట్లో సరైన నిర్ణయం చేయలేదేమోననిపిస్తుంది. ఆ ఎంపీని ని ఆర్మి ఆస్పత్రికి పంపి నివేదిక కోరారు. కాని ఆ విషయం ఏమైందో కాని చెప్పాపెట్టుకుండా ఆయన ఆర్మి ఆస్పత్రి నుంచి వెళ్లిపోతే ఎవరూ ఏమీ చేయలేకపోయారు. చంద్రబాబు పాల్గొన్న సభలలో తొక్కిసలాటలు జరిగి పదకుండు మంది మరణిస్తే, కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేస్తే న్యాయ వ్యవస్థ వారికి రిమాండ్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
వివేకానందరెడ్డి హత్య కేసును పరిశీలిస్తే తానే చంపానని, నరికానని సగర్వంగా చెప్పుకున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వడానికి వివేకా కుమార్తె సునీత,సీబీఐ సహకరించడం బహుశా దేశంలో మరెక్కడా జరగదేమో! మరో వైపు కుట్రదారులు అన్న అనుమానంతో వైఎస్ భాస్కరరెడ్డిని అరెస్టు చేయడం, తదుపరి అవసరమైతే అవినాష్‌ను అరెస్టు చేస్తామని సీబీఐ అధికారులు చెప్పడం కూడా చర్చనీయాంశం అయింది.
👉 నిజంగా వారికి ఏదైనా సంబందం ఉందని తేలితే చర్య తీసుకోవచ్చు. కాని అసలు హత్య చేసినవారిని వదలివేసిన తీరు కచ్చితంగా సందేహాలను లేవనెత్తుతుంది. వివేకా రెండో భార్య, వారికి కలిగిన సంతానం, ఆస్తిలో వారసత్వం, కూతురు, అల్లుడుతో తగాదా మొదలైన కోణాలనుసీబీఐ ఎంతవరకు విచారించిందన్నదానిపై ఇంకా క్లారిటీ రావల్సి ఉంది. ఈ విషయాలు ఎలా ఉన్నా, తల్లికి చికిత్స జరుగుతున్నప్పుడు కొడుకుగా అవినాశ్ అక్కడ ఉండవలసిన అవసరం లేదా? వారం రోజుల తర్వాత విచారణకు వస్తానని అవినాశ్ చెబితే, అలా కుదరదని,సీబీఐకన్నా ముందుగా ఎల్లో మీడియా గొడవ చేయడం ఏమిటో అర్దం కాదు. కర్నూలు ఆస్పత్రి వద్ద ఈ మీడియా దొంగ ఐడి కార్డులతో లోపలికి వెళ్లి వీడియోలు తీసే యత్నంచేయడం సహజంగానే వైసిపి కార్యకర్తలకు ఆవేశం తెప్పిస్తుంది.
సరిగ్గా అదే తెలుగుదేశం కు కావాలి. వైసిపి కార్యకర్తలను రెచ్చగొట్టి , ఆ తర్వాత వారిపై ఆరోపణలు చేస్తూ శాంతిభద్రతల సమస్య సృష్టించడమే ఇందులో లక్ష్యం అన్నది తెలుస్తూనే ఉంది. ఒకవేళ అవినాశ్ ను అరెస్టు చేయదలిస్తేసీబీఐకి ఎవరైనా చెప్పాలా? సుప్రింకోర్టులో ఏమి జరుగుతుందో తెలియదు. కాని ఈలోగానే టీడీపీ మీడియా ట్రయల్ చేసేస్తోంది. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. మచిలీపట్నంలో ఓడరేవు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు. అది బ్రహ్మాండమైన కార్యక్రమం .దానికి అసలు కవరేజీ ఇవ్వకుండా, అవినాశ్ అరెస్టు అంటూ జరగని దానిని విస్తారంగా ఈ మీడియా ప్రచారం చేయడం దుర్మార్గంగా ఉంటుంది. అవినాశ్ ను అరెస్టు చేస్తే దాని ప్రభావం వైసిపి పై పడుతుందన్నది వారి ఆశ కావచ్చు. వచ్చే ఎన్నికలలో ఈ అంశాన్ని వాడుకోవాలన్నది వారి ఉద్దేశం. కాని అది సాధ్యం కాదు. ఇద్దరిపై స్వయంగా కాల్పులు జరిపిన బాలకృష్ణ రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన వివిధ స్కీమ్ ల గురించి కాకుండా ఇలాంటి కేసులపైన ఆధారపడి ప్రజలు నిర్ణయం తీసుకుంటారని టీడీపీ నేతలుకాని, టీడీపీ మీడియా కాని ఆశలు పెడితే అవి అడియాశలు అవుతాయని నిర్దద్వంగా చెప్పవచ్చు.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment