వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్ పలు పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు వచ్చింది. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఓకే చేయడం, దానికి అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించడం జరిగింది. డేటా సెంటర్ కు శంకుస్థాపన కూడా చేశారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో జగన్ ప్రభుత్వ విధానాల ప్రకారం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించింది. అందుకోసం ప్రభుత్వం భూముల కేటాయింపు చేసింది. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న ఎనిమిది శాతం వాటాను అదాని గ్రూప్ కొనుగోలు చేసింది. అలాగే ప్రైవేటు రంగంలో ఉన్న కృష్ణపట్నం పోర్టు కూడా అదానీ గ్రూప్ పరిధిలోకి వచ్చింది. ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడు టీడీపీ అనుకూల మీడియా ఏమని ప్రచారం చేసిందో గుర్తుందా?
జగన్ ఏపీని అదానీకి రాసిచ్చేస్తున్నారని.. అదానీకి జగన్ రెడ్ కార్పెట్ వేస్తున్నారని.. ఏపీ అంతా దోపిడీ జరిగిపోతోందని వదంతులు సృష్టించారు. అదానీ పెట్టుబడులను జగన్ స్వాగతిస్తే దారుణమైన వ్యతిరేక కథనాలు ఇచ్చిన ఎల్లో మీడియా.. ఏదో రకంగా విమర్శలు చేసిన తెలుగుదేశం ఇప్పుడు మొత్తం ప్లేట్ మార్చేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంంతోనే అదానీ ఇప్పుడు మంచి పెట్టుబడిదారుడు అయిపోయారు. అదానీ పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవ్వగానే మొత్తం ఏపీ ముఖచిత్రం మారిపోయినట్లు తెలుగుదేశం మీడియా డాన్స్ చేస్తోంది.
ఇక తెలుగుదేశం పరిశ్రమలు పెట్టేసినంతగా ఊదరగొడుతుంది. అదానీ అప్పుడైనా, ఎప్పుడైనా పరిశ్రమలు పెట్టి ఏపీకి ఉపయోగపడితే మంచిదే. కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలు రాకుండా, వచ్చిన వాటిని భయపెట్టేలా అటు తెలుగుదేశం ప్రచారం చేసింది. ఇటు ఎల్లో మీడియా అడ్డంగా దుష్ప్రచారం చేసింది.
అప్పుడు పరిశ్రమల స్థాపనకు భూములిచ్చినా, నీళ్లిచ్చినా, రాయితీలిచ్చినా దోచుకోవడమన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం విధానం తయారు చేస్తేనే వరాల వర్షం కురుస్తోందని , స్వర్ణాంధ్ర సాకారం అవుతోందని బాకా వూదుతున్నారు. జగన్ టైంలో షిరిడీ సాయి సంస్థ కొత్త ప్రాజెక్టును చేపట్టడానికి వీలుగా ప్రభుత్వంనుంచి భూమిని తీసుకుంది. అలాగే నెల్లూరు జిల్లాలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు భూమి తీసుకుంది. రామాయపట్నంవద్ద ఇండోసోల్ అనే సంస్థ సోలార్ ప్యానెల్స్ తయారీకి పూనుకుంటే.. ఈనాడు మీడియా ఎంత విష ప్రచారం చేసిందో చెప్పలేం.
కొద్ది రోజుల క్రితం అదానీతో భేటీ సందర్భంగా వచ్చిన కథనాలను గమనిస్తే నిజంగానే ఆంధ్రప్రదేశ్ ను రాసిచ్చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతోందా? అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో పోర్టులు, మైనింగ్, ఐటీ, పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా ఒకటేమిటి !అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదనలు చేస్తోందని ఈనాడు మీడియా బాజా వాయించింది.
ఇవేగాదు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డును కూడా అదానీ కంపెనీయే నిర్మిస్తుందట. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏపీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలు ప్రాజెక్టులు పెడుతుంటే.. పచ్చి అబద్ధాలను వండివార్చిన ఎల్లో మీడియా ఇప్పుడు మొత్తం ఏపీలో అన్నిరకాల పెట్టుబడులను గుజరాత్ కు చెందిన అదానీ తెస్తే బాగుందన్నట్టుగా రాస్తున్నారు. వారు అడిగినంత మేర వేల ఎకరాల భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందట. టెండర్లు లేకుండా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం అదానీకి ఎలా అప్పగిస్తారో తెలియదు. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి నీచమైన రాజకీయం జరుగుతున్నదో ప్రజలు ఆలోచించుకోవచ్చు.
తమకు నచ్చని పారిశ్రామికవేత్తలపై బురద చల్లడం, తమకు ఇష్టం లేని పార్టీ అధికారంలో ఉంటే వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడం పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని అసత్య ప్రచారాలను చేయడం ఇవ్వన్నీ చూస్తే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద మాఫియా గుప్పిట్లో చిక్కుకున్నదనే అభిప్రాయం కలుగుతోంది.
జగన్ ప్రభుత్వం రామాయపట్నం , మచిలీపట్నం, మూలపేట పోర్టులతోపాటు పది ఫిషింగ్ హార్బర్లను ప్రభుత్వపరంగా నిర్మాణం సాగించింది. ఆ పోర్టులను కూడా అదానీకే అప్పజెప్పాలన్న ఆలోచన జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు కృష్ణపట్నం, గంగవరం పోర్టులలో అదానీ పెట్టుబడులను పెడితేనే ఏదో ఘోరం జరిగిపోయినట్టు ప్రచారం చేసిన వీళ్లు.. ప్రస్తుతం ఆ పోర్టుల విస్తరణకు అవసరమైన వందల వేల ఎకరాల భూములను కట్టబెట్టి ఆ కంపెనీపోర్టుల విస్తరణకు ప్రతిపాదించింది అని ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు.
ఇక మంత్రి లోకేష్ అమెరికాలో ఆయా కంపెనీల సీఈవోలను కలవడాన్ని హైలైట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. టెస్లా కార్ల కంపెనీకి లోకేష్ ఆహ్వానం పలికారని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో భాగస్వాములు కావాలని కోరారని రాశారు. వీటిలో నిజంగా ఏదైనా జరిగితే మంచిదే. కానీ ఇదే లోకేష్ కొద్ది సంవత్సరాల క్రితం టెస్లా కంపెనీ ఏపీకి వచ్చేస్తున్నదన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు నిజంగానే దాన్ని సాధించగలిగితే స్వాగతించవచ్చు. అలా కాకుండా ప్రచార ఆర్భాటానికి సూపర్ సిక్స్ హామీల అమలు వైఫల్యాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి యాత్రలు చేస్తుంటే అది ప్రజల్ని మోసం చేయడమే అవుతుంది.
ఎల్లో మీడియాలో మరో మోసపూరిత కథనం ఇచ్చింది. స్కిల్ హబ్ గా ఏపీ మారుతోందని నైపుణ్య శిక్షణతో ఏడాదికి 1.24 లక్షల ఉద్యోగాలు వస్తాయని 92వేల మందికి స్వయం ఉపాధి కలుగుతుంది సిడాప్ వార్షిక ప్రణాళిక తెలిపిందంటూ ఆహా,ఓహో అంటూ భజనం చేసింది. ఒక వైపు ఉన్న ఉద్యోగాలను ఊడగొడతూ ఇంకోవైపు లక్షల ఉద్యోగాలు వస్తాయని నివేదికలు తయారు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు గమనించలేరా!.
::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment