అందుకే సీఎం జగన్‌ విక్టరీ వ్యాఖ్యలు! | Kommineni Srinivasa Rao Comments On Andhra Pradesh Election Results 2024, More Details Inside | Sakshi
Sakshi News home page

అందుకే సీఎం జగన్‌ విక్టరీ వ్యాఖ్యలు!

Published Sat, May 18 2024 12:16 PM | Last Updated on Sat, May 18 2024 1:50 PM

Ksr Comments On Andhra Pradesh Election Results

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య సంచలనం సృష్టించింది. శాసనసభ ఎన్నికలలో పోలింగ్ పూర్తి అయిన రెండు రోజులకు ఆయన ఐ-ప్యాక్ సంస్థలో పనిచేసేవారితో సమావేశమై ఫలితాలపై తనదైన శైలిలో జోస్యం చెప్పారు. 2019లో వైఎస్సార్‌సీపీకు వచ్చిన 151 సీట్లను మించే ఈసారి కూడా సీట్లు వస్తాయని ప్రకటించారు. ఇంత ధైర్యంగా జగన్ ఎలా చెప్పారు? ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటి? ఇంతవరకు జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా సాహసోపేతమైన రీతిలో ఆయన తన అంచనాలు వెల్లడించడంలో ఉద్దేశం ఏమిటి అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి.

జగన్ చెప్పినట్లు ఆ స్థాయిలో విజయం సాధ్యమేనా అన్న సంశయం పలువురిలో ఉంది. అయినా గత అనుభవాల రీత్యా ఏమోలే వస్తే రావచ్చు అని అనుకున్నవారూ ఉన్నారు. జగన్ ధైర్యానికి ఒకటే కారణం స్పష్టంగా కనిపిస్తుంది. తాను ఇచ్చిన పేదలు vs పెత్తందార్లు అన్న నినాదం ఫలించిందని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు.. మీ ఇంట్లో తన ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని అనుకుంటేనే ఓటు వేయండని పిలుపు ఇచ్చారు. అది కూడా బాగా పని చేసి ఉండవచ్చు. ఎందుకంటే జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల కనీసం మూడు కోట్ల మందికి పైగా లబ్ది పొందారు. వారిలో ఏభై, అరవై శాతం ఓట్లు వేసినా, తాను అనుకున్న సీట్లు రావడం కష్టం కాదు.

గత ఎన్నికల సమయంలో కూడా వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని అత్యధికులు నమ్మారు. 120-130 సీట్లు రావచ్చని ఎక్కువ మంది భావించారు. ఆ టైమ్‌లో కూడా జగన్ 150 సీట్లు ఎందుకు రాకూడదని ప్రశ్నించేవారు. నిజంగానే ఆయన ఊహించినట్లుగానే 151 సీట్లు వచ్చాయి. అది ఒక రికార్డు. గతంలో విభజిత ఏపీలో ఆ స్థాయిలో ఏ పార్టీకి సీట్లు దక్కలేదు. ఎన్‌.టీ.రామారావు సాధించలేని రికార్డును జగన్ సాధించగలిగారు. అంతేకాక ఇరవైరెండు లోక్ సభ సీట్లు వైఎస్సార్‌సీపీ వచ్చాయి. ఇప్పుడు కూడా అదే సంఖ్యలో లోక్ సభ సీట్లు వస్తాయని జగన్ అంటున్నారు. మామూలుగా అయితే పార్టీ క్యాడర్‌లో విశ్వాసం పెంచడానికి జగన్ ఇలా అని ఉండవచ్చులే అనుకుంటారు. కాని జగన్ ఎప్పుడు ఏమి చేసినా ఒక రివల్యూషన్‌లా ఉంటోంది.

ప్రభుత్వాన్ని సైతం అలాగే నడిపారు. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలను నెలకొల్పి పాలనలో కొత్త విప్లవాన్ని తెచ్చారు. ప్రజలకు వారి ఇళ్ల వద్దే సేవలు అందించారు. ఇది కొత్త అనుభూతే. దేశంలో ఏ రాష్ట్రంలోను ఇలాంటి సదుపాయం ప్రజలకు లేదు. జగన్ తీసుకువచ్చిన ఈ వ్యవస్థలను ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవడానికి సిద్దం అవుతున్నాయి. ముఖ్యంగా వలంటీర్ల ద్వారా వృద్దులకు పెన్షన్లు ఇచ్చి వారిని గౌరవించే ప్రభుత్వం ఏపీలో మాత్రమే ఉందని ఆయన రుజువు చేశారు. అలాగే రాజకీయంగా బలహీనవర్గాలకు, మహిళలకు ఏభై శాతం పదవులు వచ్చేలా చేయడం, పథకాలు కాని, ఇళ్ల స్థలాలు కాని మహిళల పేరుతోనే ఇవ్వడం తదితర చర్యల ద్వారా సామాజిక విప్లవం తెచ్చారు. వీటన్నిటి ఫలితంగానే పోలింగ్ రోజున బలహీనవర్గాలవారు వెల్లువలా ఓట్లు వేయడానికి తరలివచ్చారన్న అభిప్రాయం ఏర్పడింది. వీటన్నిటిని బెరీజు వేసుకునే ముఖ్యమంత్రి జగన్ 151 సీట్లు మించే వైఎస్సార్‌సీపీ వస్తాయని చెప్పి ఉండవచ్చు.

ఇంకో సంగతి చెప్పాలి. కూటమి నేతలు హైదరాబాద్, తదితర చోట్ల ఉన్న తమ మద్దతుదారులను రప్పించిన తీరు కూడా ఆయా గ్రామాలలోని బలహీనవర్గాలు గుర్తించాయట. పెత్తందార్లకు మద్దతు ఇవ్వడానికి అంత దూరం నుంచి వచ్చినవారికి పోటీగా స్థానికంగా ఉండే గ్రామాలలోని పేదలంతా ఓటింగ​్‌లో పాల్గొన్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్ల ప్రభుత్వం నడిచిన తర్వాత తిరిగి అదే అధికార పార్టీకి గతంలో కన్నా అధికంగా సీట్లు రావడం అరుదుగా జరుగుతుంటుంది. అయితే అదేమి అసాధ్యం కాదు. ఉదాహరణకు 2014లో టీఆర్‌ఎస్‌కు 63 సీట్లు వస్తే, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు 88 సీట్లు వచ్చాయి. అంటే ఏకంగా ఇరవైఐదు సీట్లు పెరిగాయన్నమాట. అలాగే గుజరాత్‌లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 99 సీట్లు వస్తే, 2022 ఎన్నికలలో 160 వరకు వచ్చాయి.

గుజరాత్ మూడున్నర దశాబ్దాలుగా బీజేపీ తిరుగులేని ఆధిక్యతతో పాలన చేస్తోంది. ఒడిషా లో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా పాతికేళ్లు పూర్తి చేశారు. బెంగాల్‌లో గతంలో సీపీఎం నేత జ్యోతిబసు వరసగా ఇరవైమూడేళ్లు పాలన చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడో టర్మ్ కూడా ఎన్నికై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. ప్రత్యర్ధి పార్టీలకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నా డిఎమ్.కె అధికారంలోకి వచ్చిన ఒక సందర్భంలో డిఎమ్.కెకి కేవలం రెండు స్థానాలే వచ్చాయి. ఉమ్మడి ఏపీలో 1994లో ఎన్‌.టీ.ఆర్‌ నాయకత్వంలోని తెలుగుదేశంకు 213 సీట్లు, మిత్రపక్షాలకు 34 సీట్లు వచ్చాయి.

అప్పటి ఎన్నికలలో కాంగ్రెస్ కేవలం 26 సీట్లే గెలుచుకుని ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఒక్కోసారి కొన్ని పరిణామాలను బట్టి, ప్రభుత్వాల పనితీరును బట్టి, ఎన్నికలలో ప్రకటించే మానిఫెస్టోలలోని అంశాలను బట్టి కూడా ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు. 2024 ఎన్నికలలో జగన్‌కు ఉన్న క్రెడిబిలిటిని జనం విశ్వసించారు. అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏది అవసరమైతే అది మాట్లాడి, అబద్దాలు చెప్పి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయారు. చంద్రబాబు నాయుడు లక్షన్నర కోట్లకుపైగా ఎన్నికల హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితి లేదు. జగన్ కొత్తగా పెద్దగా హామీలు ఇవ్వకుండా ఉన్న పరిస్థితిని చెప్పడం ఆయన నిజాయితీ తెలియచేస్తుంది. 2019లో ఇచ్చిన హామీలను జగన్ 99 శాతం నెరవేర్చడమే కాకుండా మానిఫెస్టోలను చూపించి మంచి జరిగితేనే తనకు ఓటు వేయండని ప్రజలకే పరీక్ష పెట్టారు. ఇవన్ని ఆయనకు పాజిటివ్ ఫ్యాక్టర్స్‌గా కనిపిస్తాయి.

ఈ నేపధ్యంలోనే ఆయన అంత ధీమాగా 151 సీట్లను మించి వస్తాయని చెప్పి ఉండవచ్చు. ఈసారి పలు సర్వే సంస్థలు పోలింగ్ పూర్తి అయిన తర్వాత చేసిన పరిశీలనలో వైఎస్సార్‌సీపీ దే అధికారం అని చెబుతున్నాయి. టీడీపీకి అనుకూలంగా పోలింగ్‌కు ముందు మాట్లాడిన సంస్థలు సైతం పోలింగ్ అయిన తర్వాత వైఎస్సార్‌సీపీవై పే మొగ్గు చూపుతున్నాయి. అయినా టీడీపీ కూటమిలో ఆశలు పూర్తిగా పోయాయని చెప్పలేం. వారి సోషల్ మీడియా ద్వారా తామే గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఐ-ప్యాక్ పూర్వ వ్యవస్థాపకుడు ప్రశాంత కిషోర్ ఈ మధ్య టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్‌సీపీ అధికారం దక్కదని ప్రచారం చేశారు. ఆ తరుణంలో టీడీపీతో పాటు, ఇలాంటివారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బకొట్టేలా జగన్ ఈ ప్రకటన చేసినట్లు అనిపిస్తుంది. చాలామంది ఈసారి తీవ్రమైన పోటీ ఉంటుందని, అందువల్ల వైఎస్సార్‌సీపీ వంద నుంచి 110 సీట్ల వరకు రావచ్చని అంచనా వేశారు.

ఒకవేళ జగన్‌కు అనుకూలంగా వేవ్‌ వస్తే మాత్రం ఆ సీట్ల సంఖ్య 140-150 వరకు వెళ్లవచ్చని లెక్కగడుతున్నారు. కాగా ఇండియా టుడ్-ఎక్సిస్ అనే సంస్థ వైఎస్సార్‌సీపీ 142-157 వరకు సీట్లు రావచ్చని అంచనావేసింది. అలాగే టుడేస్ చాణక్య అనే సంస్థ 144-158 సీట్లు దక్కుతాయని లెక్కగట్టింది. న్యూస్ ఎక్స్-నేత అనే సంస్థ 139-152 సీట్లు రావచ్చని చెబుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సీఎన్‌ఎన్‌ న్యూస్ 18 సంస్థ 132 lనుంచి 145 సీట్లు వస్తాయని భావిస్తోంది. టైమ్‌స్ నౌ జోస్యం ప్రకారం 128-133 సీట్లు రావచ్చు. ఇలా కొన్ని సర్వే సంస్థలు సైతం వైఎస్సార్‌సీపీకు 151 మించి సీట్లు వస్తాయని చెబుతున్నాయి. వీటిని గమనిస్తే జగన్ చెప్పినట్లు వైఎస్సార్‌సీపీకు ఈ స్థాయిలో విజయం లభిస్తుందన్న భావన కలుగుతుంది. ఇదే జరిగితే నిజంగానే దేశ మంతా జగన్ వైపు చూస్తుంది. ఏపీలో జరుగుతున్న పాలన వైపు, వ్యవస్థల వైపు చూస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆల్ ద బెస్ట్ చెబుదాం.

– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement