టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు తమ భవిష్యత్తు, తమ పార్టీల పరిస్థితిపై బాగానే ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నది. మరోవైపు నటుడు, జనసేన నేత నాగబాబు తమ బలం బాగా పెరిగిందని చెబుతున్న తీరు ఆసక్తికరంగానే ఉంది. చంద్రబాబు మాట్లాడిన ఒక వీడియోని గమనించండి. ఈసారి తెలుగుదేశం గెలవకపోతే ప్రత్యామ్నాయం ఉండదు. రాష్ట్రానికే తాము రాలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆయన అన్నారు.
✍️నిజానికి చంద్రబాబు ఇప్పటికీ ఎక్కువ కాలం హైదరాబాద్‌లోనే నివసిస్తుంటారు. పవన్ కల్యాణ్ కూడా అంతే. అయినా ఏపీ రాజకీయాలు చేస్తున్నారు కనుక ఇక్కడ అధికారంలోకి రావాలని విశ్వయత్నం చేస్తున్నారు. సర్వేల ప్రకారం కానీ, ఇతరత్రా కానీ తమ గెలుపు అవకాశాలు తగ్గుతున్నాయని భయపడుతున్నారో ఏమో కానీ, చంద్రబాబు నేరుగా రాష్ట్రానికే రాలేమని అంటున్నారు. అంటే ఏమిటి దీని అర్ధం. తాము గెలిస్తేనే ఏపీకి వస్తామని, లేకుంటే రాబోమని చెప్పడమే కదా!. రాజకీయాలలో గెలుపు ఓటములు ఉంటాయి. ఏం జరిగినా ప్రజలలోనే ఉంటామని చెబుతారు. కానీ, చంద్రబాబు మాత్రం అందుకు విరుద్దంగా మాట్లాడుతున్నారు. ఈయనకు ఏపీ ప్రజలపై అభిమానం ఉన్నట్లా? లేక పదవీ వ్యామోహమా!. మాట్లాడితే రాష్ట్రం భవిష్యత్తు కోసం అని డైలాగులు చెబుతుంటారు. అప్పుడప్పుడూ ఇలా కొన్ని వాస్తవాలు బయటపెట్టేస్తుంటగారు. దీని ద్వారా తనలో ఉన్న భయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది.
✍️రాష్ట్రం భవిష్యత్తు కోసం అని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కూడబలుక్కుని మాట్లాడుతుంటారు. దానిని ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా మహాప్రసాదంగా ప్రచారం చేస్తుంటాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన స్కీములన్నిటిని విమర్శిస్తారు. దాని వల్ల రాష్ట్రం నాశనమైందని అంటారు. మళ్లీ తాము అవే స్కీములను ఇంకా ఎక్కువ ఇస్తామని చెబుతుంటారు. తాజాగా వచ్చిన పవన్ వీడియో ఒకటి గమనిస్తే ఈ సంగతి మరింత స్పష్టంగా తెలుస్తుంది. తాను సోషలిస్టునని సీఎం జగన్ కంటే ఒక పది రూపాయలు ఎక్కువే ప్రజలకు ఇస్తానని అన్నారు. అంతకు ముందు ఒక సందర్భంలో ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి జగన్ స్కీములను ఎద్దేవా చేస్తూ అమ్మ ఒడి అంటా! చేయూత అంటా! విమర్శించారు. వీటిలో దేనికి పవన్ కట్టుబడి ఉంటారో తెలియదు. అందుకే సోషల్ మీడియాలో పవన్ పరస్పరం విరుద్దంగా మాట్లాడే వీడియోలు బాగా చక్కర్లు కొడుతుంటాయి.
✍️ఈ విషయంలో చంద్రబాబు కూడా తక్కువ తినలేదు. సీఎం జగన్ స్కీములన్నింటిని పలుమార్లు తప్పు పట్టారు. అమ్మ ఒడి.. నాన్న బుడ్డి అంటూ అవహేళనగా మాట్లాడారు. కానీ, ఇప్పుడు అదే చంద్రబాబు తాను అమ్మ ఒడి స్కీమ్‌ను మరో పేరుతో మరింత మంది పిల్లలకు అమలు చేస్తానని చెబుతున్నారు. అప్పుడు రాష్ట్రం భవిష్యత్తు నాశనం కాదా అన్నదానికి వీరు బదులు ఇవ్వరు. నిజానికి సీఎం జగన్ చేసిన అనేక సంస్కరణలను వీరు వ్యతిరేకించారు. ప్రజల ఇళ్ల వద్దకే పాలనను అందించడాన్ని చంద్రబాబు, పవన్‌లు వ్యతిరేకించారు. వలంటీర్ల వ్యవస్థను నానా రకాలుగా దూషించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థవల్ల ఎంతో నష్టం జరిగిపోయిందని చెప్పారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే వీటన్నిటిని కొనసాగిస్తామని అంటారు. వీరు చెప్పేది అబద్దమని అన్న సంగతి కనిపించడం లేదా?. కేవలం తమకు రాజకీయ భవిష్యత్తు లేదన్న భయంతోనే వీరు మాట మార్చుతున్నారు.
✍️చంద్రబాబు ప్రకటించిన ఆరు గ్యారంటీలు చూస్తే ఏపీని ఎంతగా పాడు చేసేది అర్ధం అవుతుంది. విజ్ఞత ఉన్న పౌరులెవ్వరూ చంద్రబాబు ఇస్తున్న గ్యారంటీలను నమ్మరు. అది కేవలం తన కుమారుడు లోకేష్ భవిష్యత్తు కోసం చేస్తున్న జిమ్మిక్కు తప్ప ఇంకొకటి కాదు. మరో సంగతి చూద్దాం. పదేళ్లపాటు తెలుగుదేశంతో పొత్తు ఉంటుందని పవన్ ప్రకటించారు. దానిపై కూడా సోషల్ మీడియాలో కూడా రకరకాల వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇందులో ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా ముడిపెట్టి చమత్కరిస్తున్నారు. ఆయన తన సంసార జీవితంలో పదేళ్లు ఏ ఒక్కరితో ఉండలేదని, కానీ టీడీపీతో మాత్రం పదేళ్లు ఉంటానంటున్నారని జోకులు వేస్తున్నారు. వీటన్నిటికి ఆయన సమాధానం చెప్పకపోవచ్చు. 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ 2019లో విడాకులు ఇచ్చేశారు. తిరిగి 2024లో కలిసి కాపురం అంటున్నారు. మరోవైపు ఇప్పటికే కాపురంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఏం చేశారో తెలియదు.
✍️తెలంగాణలో అయితే బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తాము వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఎవరితో పొత్తు లేకుండానే పోటీచేస్తామని ప్రకటించడం ద్వారా జనసేనకు రామ్ రామ్ చెప్పేశారు. దానికి కారణం పవన్ సొంత పార్టీ వారికే వెన్నుపోటు పొడవడం, జనసేనకు ఎక్కడా డిపాజిట్లు రాకపోవడం వంటి కారణాలని వేరే చెప్పనవసరం లేదు. తెలంగాణలో ఇలా ఉంటే, ఏపీలో మాత్రం తమ పొత్తు జనసేనతో కొనసాగుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అంటున్నారు. మరి ఇప్పటికే పవన్ టీడీపీతో కలిసి చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నా, ఆ విషయం ఆమె మాట్లాడరు. ఇలాంటి చిత్రాలన్నీ ఏపీ రాజకీయాలలోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో పవన్ పదేళ్లపాటు టీడీపీతో పొత్తు అంటే, వచ్చే రెండు ఎన్నికలలోనూ టీడీపీని మోయడానికే ఆయన సిద్దపడుతున్నారని జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాంటప్పుడు తమ సంగతేమిటని ఆయా నియోజకవర్గాలలో ఉన్న జనసేన ఇన్‌ఛార్జీలు ప్రశ్నిస్తున్నారు.
✍️ఉదాహరణకు వినుకొండ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జీ ఒక వీడియో చేసి పదేళ్లు టీడీపీకి పనిచేసేదానికి తమ పార్టీ ఎందుకని ప్రశ్నించారు. తమకు పదేళ్లపాటు రాజకీయ భవిష్యత్తు లేదని పవన్ చెప్పేశారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీతో పొత్తును విమర్శిస్తే వైఎస్సార్‌సీపీకి అమ్ముడు పోయినట్లేనని జనసైనికులను అవమానించిన పవన్‌పై వారికి కోపంగా ఉంటే, ఇప్పుడు తాజా పదేళ్ల పొత్తు ప్రకటనతో వారు మండిపడుతున్నారు. ఈ పరిస్థితిలో టీడీపీతో పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు అడుగుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. టీడీపీవారేమో పదో, పరకో జనసేనకు ఇస్తే సరిపోతుందని ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య టీడీపీ మీడియా వారు కొందరు ఒక ప్రచారం పెట్టారట. పవన్ పొత్తు ప్రకటన చేసినా, ఆశించిన విధంగా టీడీపీకి మేలు కలగడం లేదని వారు చెబుతున్నారట. అంటే ఏమిటి దీని అర్ధం. జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వనవసరం లేదనే కదా!ఎలాగూ ఇప్పుడు పవన్ టీడీపీ వెనుక నడవక తప్పదని, ఎక్కువ సీట్లు అడగకుండా ఇలా ఆయన పరువు తీయాలన్నది వారి ఉద్దేశం.
✍️ఈ వాస్తవాలు పవన్ సోదరుడు నాగబాబుకు తెలియవేమో కానీ, ఆయన మాత్రం జనసేన బలం బాగా పెరిగిందని సభలలో చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తూ జనసేన బలం ముప్పైరెండు నుంచి ముప్పైఐదు శాతం వరకు పెరిగిందని, ఉభయ గోదావరి జిల్లాలలో అయితే అది నలభై శాతంపైనే అని అన్నారు. దానిని ఆయన కానీ, ఆయన సోదరుడు కానీ నమ్ముతుంటే టీడీపీతో పొత్తులో భాగంగా కనీసం అరవై నుంచి డెబ్బై సీట్లు అడగాలి. అలాకానీ పక్షంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఏమి ప్రయోజనం అన్నది వారు చెప్పగలుగుతారా?. టీడీపీ, జనసేన అధినాయకత్వంలోనే గందరగోళం, భయం ఏర్పడిందనడానికి ఇవన్నీ ఉదాహరణలే కదా!.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment