జనవరి కరెంట్‌ బిల్లులు కట్టకండి: కేటీఆర్‌ | KTR Counter To CM Revanth Reddy Bonda Pettudu Comments | Sakshi
Sakshi News home page

జనవరి కరెంట్‌ బిల్లులు కట్టకండి: తెలంగాణ ప్రజలకు కేటీఆర్‌ పిలుపు

Published Sat, Jan 20 2024 1:37 PM | Last Updated on Sat, Jan 20 2024 5:42 PM

KTR Counter To CM Revanth Reddy Bonda Pettudu Comments - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: బీఆర్‌ఎస్‌ను బొందపెట్టి తీరతానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ పడింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు, రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  రేవంత్‌ లాంటోళ్లను చాలామందిని చూశామని వ్యాఖ్యానించిన ఆయన.. ఈ క్రమంలో తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పించారు. అలాగే జనవరి నెల కరెంట్‌బిల్లులు ఎవరూ కట్టవద్దంటూ తెలంగాణ ప్రజలకు కేటీఆర్‌ పిలుపు ఇచ్చారు. 

బీఆర్‌ఎస్‌ను వంద మీటర్ల లోతున బొందపెట్టే సంగతి తర్వాత చూసుకుందాం. ముందు 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయండి అని కేటీఆర్‌ సీఎం రేవంత్‌కు చురకలు అంటించారు. అహంకారంతో మాట్లాడిన రవేంత్‌రెడ్డి లాంటి నాయకుల్ని బీఆర్‌ఎస్‌ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందని.. రెండున్నర దశాబ్దాలు నిలబడి రేవంత్‌ లాంటోళ్లను మట్టి కరిపించిందని అన్నారాయన. ‘‘తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్? తెలంగాణ తెచ్చినందుకా?.. తెలంగాణను అభివృద్ధి చేసినందుకా? లేకుంటే మిమ్మల్ని.. మీ దొంగ హమీల్ని ప్రశ్నిస్తునందుకా?’’ కేటీఆర్‌ నిలదీశారు. 

ఇదీ చదవండి: లండన్‌లో సీఎం రేవంత్‌ ఏమన్నారంటే.. 

బీజేపీతో బీఆర్ఎస్ కు ఏరోజు పొత్తు లేదని.. భవిష్యత్తులోనూ ఉండబోదని శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీ ఆర్ ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. ‘‘రేవంత్ రక్తం అంతా బీజెపీదే. అందుకే ఇక్కడ చోటా మోదీగా రేవంత్ రెడ్డి మారిండు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిండు. రేవంత్‌ కాంగ్రెస్‌ ఏక్‌నాథ్‌ షిండేగా మారతాడు’’ అంటూ కేటీఆర్‌ పంచ్‌లు వేశారు.

కరెంట్‌ బిల్లుల్ని సోనియాకు పంపించండి
అలాగే.. ఈ జనవరి నెల  కరెంట్‌ బిల్లులు ఎవరూ కట్టవద్దని.. ఆ బిల్లులను ఢిల్లీలోని కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటికి పంపించాలంటూ తెలంగాణ ప్రజలకు పిలుపు ఇచ్చారాయన. ‘‘ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టొద్దు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దు. స్వయంగా ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలి. 

కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు ముఖ్యమంత్రి మాటలను చూపించాలి. సోనియా గాంధీ బిల్లు కడుతుందని ముఖ్యమంత్రి ఎన్నికలప్పుడు చెప్పిండు. అందుకే కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి, 10జన్ పత్ కు పంపించాలి’’ అని కేటీఆర్‌ అన్నారు. అలాగే.. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్క మీటర్ కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందించాలని.. గృహ జ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలి.. ఇందులో కిరాయి ఇండ్లలో ఉండే వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement