ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోంది: కేటీఆర్
ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో దురుద్దేశంతోనే కేసు
ఆధారాలుంటే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై చర్చించాలి..అవినీతిని బయట పెట్టాలి
ఇందులో అణా పైసా కూడా వృథా కాలేదని స్పష్టీకరణ
ఉద్యమకారులం..చిల్లర కుట్రలకు భయపడబోమని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి కుంభోణా లను బయట పెడుతున్నందునే రాష్ట్ర ప్రభుత్వం మాపై రాజకీయ వేధింపులకు దిగుతోంది. అవినీతి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకున్నా రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేసింది. ఫార్ములా–ఈ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగి నట్లు ఆధారాలు ఉంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించాలని సవాలు చేస్తున్నా. కానీ అసెంబ్లీలో మాట్లాడలేని సీఎం, దద్దమ్మ మంత్రులు లీకులతో దుష్ప్రచారం చేస్తు న్నారు.
సీఎం, మంత్రులకు ఈ అంశంపై అవగా హన ఉంటే అసెంబ్లీ సాక్షిగా అవినీతిని బయట పెట్టాలి. ఈ మొత్తం వ్యవహారంలో అణా పైసా వృథా కాలేదు అనేందుకు నా వద్ద ఆధారాలు ఉన్నా యి..’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే రేసులు రద్దయ్యాయి. దీంతో ఈవీ రంగంలో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, పేరు రాకపోవడంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బతింది.
రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు, మోసా లను ప్రజాస్వామ్య యుతంగా ప్రజల ముందు పెడతాం. నాపై నమోదైన కేసులపై చట్ట ప్రకారం ముందుకు వెళతాం. ఉద్యమ నాయకుడి బిడ్డలం.. ఉద్యమకారులం, అణిచివేతలు, చిల్లర కుట్రలకు భయపడకుండా కొట్లాడతాం..’ అని అన్నారు. ఫార్ములా–ఈ రేస్ అంశంలో తనపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్‌లో గురువారం రాత్రి ఆయన మాట్లాడారు.
‘ఈవీ’కి తెలంగాణను హబ్‌గా చేయాలనుకున్నాం..
‘కేసీఆర్ నాయకత్వంలో ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలని అనుకున్నాం. ఎలక్ట్రిక్ వాహన వాతావరణాన్ని అభివృద్ధి చేసేందుకు ‘ఫార్ములా–ఈ రేస్’ను నిర్వహించాలని భావించాం. నాలుగు సీజన్ల పాటు నిర్వహించేలా 2022 అక్టోబర్ 25న ఒప్పందం కుదిరింది.
2023 ఫిబ్రవరి 10న తొలి సీజన్ రేసింగ్ నిర్వహించాం. రేస్ నిర్వహణకు హెచ్‌ఎండీఏ రూ.35 కోట్లు, ప్రమోటర్ సంస్థ గ్రీన్ కో రూ.110 కోట్లు ఖర్చు చేసింది. దీనివల్ల అదనంగా రూ.700 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరిందని నీల్సేన్ సర్వే సంస్థ తెలిపింది.
అయితే నష్టాలను కారణంగా చూపుతూ రెండో సీజన్‌లో ప్రమోటర్ గ్రీన్ కో తప్పుకోవడంతో హెచ్‌ఎండీఏ నుంచి రెండు విడతల్లో రూ.55 కోట్లు చెల్లించాలని నాటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్‌ను ఆదేశించా. ఎలాన్ మస్క్‌ను రప్పించి ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ద్వారా ఈవీ రంగానికి తెలంగాణను హబ్‌గా ప్రమోట్ చేయాలని అనుకున్నాం..’ అని కేటీఆర్ తెలిపారు.
అవినీతే జరగనప్పుడు కేసు ఎలా?
‘ఈ నేపథ్యంలో తదుపరి చెల్లింపులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత ఏడాది డిసెంబర్ 7న ఫార్ములా–ఈ సంస్థ కోరింది. దీని సహ వ్యవస్థాపకుడు ఆల్బర్టో లొంగోతో అదే నెల 13న సీఎం రేవంత్, నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ సమావేశయ్యారు. తర్వాత రేస్ నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ, కాంట్రాక్టు నిబంధనలు ప్రస్తావిస్తూ డిసెంబర్ 21 లోగా నిర్ణయం తెలపాలని సంస్థ లేఖ రాసింది.
డిసెంబర్ 26 వరకు వేచి చూసి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రేస్ నిర్వహణ సాధ్యం కాదని చెప్తూ నిర్వాహక సంస్థ రూ.73 లక్షల రేస్ ఫీజును కూడా వెనక్కి పంపింది. ఎఫ్‌ఈఓ ఎన్నిమార్లు కోరినా తెలంగాణ ప్రభుత్వం ఈ ఫీజును వెనక్కి తీసుకోవడం లేదు. రూ.55 కోట్లు రెండు వాయిదాలలో తమకు ముట్టిన విషయాన్ని నిర్ధారిస్తూ మూడో వాయిదా చెల్లించడంపై ప్రభుత్వంతో పలుసార్లు లేఖల రూపంలో సంస్థ సంప్రదింపులు కొనసాగించింది.
అత్యంత చట్టబద్ధంగా పారదర్శకంగా హెచ్‌ఎండీఏ ఇండియన్ ఓవర్సీస్ ప్రభుత్వ బ్యాంకు నుంచి ఈ నిధులను ఆ సంస్థకు చెల్లించింది. అవినీతే జరగనప్పుడు కేసు నమోదు చేసే అంశం ఏసీబీ పరిధిలో లేదు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హరీశ్ సాల్వే అనే ప్రముఖ న్యాయవాదితో ఫార్ములా–ఈపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టింది..’ అని కేటీఆర్ చెప్పారు.
చంద్రబాబు హయాంలో ఫార్ములా వన్ యోచన
‘చంద్రబాబు హయాంలో 2001లో ‘ఫార్ములా వన్’ నిర్వహించాలనుకున్నారు. ట్రాక్ ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధించిన 15 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ విషయాన్ని 2013 ఎన్నికల అఫిడవిట్‌లోనూ రేవంత్ ప్రస్తావించారు.
ట్రాక్ ఏర్పాటు కోసం గోపన్‌పల్లిలో మొత్తం 580 ఎకరాల భూ సేకరణకు గతంలో రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో ట్రాక్ ఏర్పాటు ప్రతిపాదనలు వెనక్కి పోగా రైతులు తమ భూమి కోసం నేటికీ న్యాయ పోరాటం చేస్తున్నారు..’ అని కేటీఆర్ వివరించారు.
రేవంత్.. నా వెంట్రుక కూడా పీకలేవు
ఫార్ములా–ఈ రేసులో కేసు పెట్టాల్సింది సీఎం రేవంత్ రెడ్డిపైనే అని కేటీఆర్ అన్నారు. అంతటి ప్రఖ్యాత రేసింగ్ దేశానికి రాకపోవడానికి రేవంతే కారణమని చెప్పారు. ‘రేవంత్.. ఏం చేసుకుంటావో చేసుకో.. నా వెంట్రుక కూడా పీకలేవు. నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అదానీతో అనుబంధంపై మీ సీఎంను ప్రశ్నిస్తారా?
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
అదానీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉన్న అనుబంధంపై ప్రశ్నిస్తారా? లేక ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడేందుకు మౌనంగా ఉంటారా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీకి వ్యతిరేకంగా నిరసనల పేరిట కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామా చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం రాహుల్‌గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు.
జాతీయ స్థాయిలో అదానీపై వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్, తెలంగాణలో మాత్రం రేవంత్ నాయకత్వంలో అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూనే, తెలంగాణలో అదానీ గ్రూప్‌నకు రేవంత్ ఎర్ర తివాచీ పరచడం విడ్డూరంగా ఉందన్నారు. గౌతమ్ అదానీ సీఎం రేవంత్‌కు ఇచ్చిన రూ.100 కోట్ల విరాళం పరస్పర ప్రయోజనాలకు ఉదాహరణ అని స్పష్టం చేశారు.
ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు
‘ఫార్ములా–ఈ రేసు ఆరోపణల్లో విషయమే లేనప్పుడు ముందే నేను కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వెంటనే కేసు కొట్టేస్తారనే నమ్మకం ఉంది. కేబినెట్ అంటే గాసిప్ బ్యాచ్‌లాగా తయారైంది’ అని అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment