సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లిని ఆవమానిస్తోందని ధ్వజమెత్తారు .తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన, స్వార్థ రాజకీయాలకు తెరతీస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఎ క్స్ వేదికగా స్పందిస్తూ..
‘తెలంగాణ తల్లిని అవమానిస్తారా ?
తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా ?
తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా ?
తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా ?
తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా ?
తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా ?
తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా ?
నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన..
“తెలంగాణ తల్లి” విగ్రహం పెట్టాల్సిన చోట..
“రాహుల్ గాంధీ తండ్రి” విగ్రహం పెడతారా.. ??
తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించదు..!
జై తెలంగాణ’ అంటూ పేర్కొన్నారు. కాగా సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని మొదటి నుంచి బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తుంది.తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఎవరి విగ్రహాలు పెట్టినా ఊరుకునేది లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే తేల్చిచెప్పారు.
సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మృతి చిహ్నం పక్కన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని.. ఆ స్మృతి చిహ్నం ప్రారంభోత్సవ సభలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. అందుకోసం సచివాలయం ముందున్న సిగ్నల్ పాయింట్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం మార్చి రోడ్డును వెడల్పు వేసిందని పేర్కొన్నారు. ప్రజలు పండుగ సంబురాల్లో ఉండగా విగ్రహావిష్కరణకు పూనుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment