ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 3 సీట్లే వచ్చినా ప్రధాన విపక్షంగానే గుర్తింపు
జగన్ లేఖపై స్పీకర్ కంటే ముందే పయ్యావుల స్పందించడంపై రాజ్యాంగ నిపుణుల విస్మయం
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుమానించిందే జరుగుతోంది! శాసనసభలో ప్రజల గొంతుకను వినిపించనివ్వకుండా, రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ప్రభుత్వ కుట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలతో బయటపడింది. పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష నేత హోదా దక్కుతుందని మంత్రి పయ్యావుల బుధవారం వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశమే లేదని, ఆయన వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష నేతగా ఉంటారని పేర్కొన్నారు. మంత్రి పయ్యావుల వ్యాఖ్యలను రాజ్యాంగ నిపుణులు తప్పుబడుతున్నారు.
పది శాతం సీట్లు ఉంటేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలన్న నిబంధన దేశంలో ఏ చట్టంలోనూ లేదని పేర్కొంటున్నారు. లోక్‌సభకు 1984లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకోగా సభలో 10 శాతం సీట్లు సాధించనప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించటాన్ని ఉదహరిస్తున్నారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగానూ కాంగ్రెస్ 26 మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు దక్కనప్పటికీ పి.జనార్థనరెడ్డిని నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగానూ బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు.
కేంద్ర, రాష్ట్ర చట్టాలు ఏం చెబుతున్నాయంటే..
విపక్షంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఉంటే ఆ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి.. ఆ పార్టీకి చెందిన లోక్‌సభ / రాజ్యసభ / శాసనసభ / శాసనమండలి పక్ష నేతను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ యాక్ట్–1977లో సెక్షన్–1 స్పష్టంగా చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్, డిస్‌క్వాలిఫికేషన్ యాక్ట్–1953 సెక్షన్–12బీ కూడా అదే అంశాన్ని స్పష్టం చేస్తోంది.
రాజ్యాంగంలోని 208వ అధికరణ కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో ఫలానా సంఖ్యలో సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే నిబంధనను ఎక్కడా పొందుపరచలేదు. ఏ పార్టీకైనా పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్షంగా గుర్తించాలనే నిబంధన దేశంలో ఏ చట్టంలోనూ లేదని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా సుదీర్ఘ కాలం సేవలు అందించిన పీడీటీ ఆచారి తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర శాసనసభలో ఉన్న ఒకే ఒక విపక్షం వైఎస్సార్‌సీపీ మాత్రమే. ఈ నేపథ్యంలోచట్ట ప్రకారం ఆ పార్టీ పక్ష నేత వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సభాపతి స్పందించక ముందే..
‘‘శాసనసభలో ఈనెల 21న జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా నాకు ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంటులోగానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నా పట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. నన్ను ఉద్దేశించి.. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో మేం గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదు.
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా గుర్తింపుతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. తగినంత సమయం లభిస్తుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి’ అని కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్ జగన్ మంగళవారం లేఖ రాయడం తెలిసిందే. ఈ లేఖపై స్పీకర్ ఇంకా స్పందించలేదు. స్పీకర్ పరిధిలోని ఈ అంశంపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల తక్షణమే స్పందించడం.. జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశమే లేదంటూ తేల్చేయడాన్ని రాజ్యాంగ నిపుణులు తప్పుబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment