రాంచీ: మొన్నటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం హేమంత్ సోరెన్, అతని భార్య కల్పనా సోరెన్‌లను బంటీ- బబ్లీ పేర్లతో అభివర్ణిస్తూ బీజేపీ వారిపై పలు విమర్శలు గుప్పించింది. బాలీవుడ్ సినిమా ‘బంటీ ఔర్ బబ్లీ’లో బంటీ, బబ్లీలు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ అక్రమార్జన చేస్తుంటారు. ఈ పాత్రలను హేమంత్, కల్పనలకు ఆపాదిస్తూ బీజేపీ లబ్ధి పొందాలని ప్రయత్నించింది. అయితే ఇప్పుడు హేమంత్, కల్పనలు విజయం సాధించి, తామేమిటో బీజేపీకి చూపించారు.
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత, సీఎం హేమంత్ సోరెన్, అతని భార్య కల్పనా సోరెన్ ఇండియా అలయన్స్ మిత్రపక్షాలతో కలిసి జార్ఖండ్‌లో వరుసగా రెండవసారి అధికారాన్ని చేజిక్కించుకోవడంలో విజయం సాధించారు. దీంతో హేమంత్- కల్పన రాజకీయాల్లో శక్తివంతమైన జంటగా నిలిచారు. కల్పన తన భర్త హేమంత్ అరెస్ట్ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత సోరెన్ దంపతులు రాష్ట్రంలో 200 ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఎన్నికలకు ముందు పార్టీ ఎదుర్కొన్న సవాళ్లను పరిగణనలోకి తీసుకున్న హేమంత్- కల్పన దంపతులు మరింత శక్తిని కూడదీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికలకు ముందు జేఎంఎం సీనియర్ నేతలు చంపై సోరెన్, సీతా సోరెన్, లోబిన్ హెంబ్రోమ్ బీజేపీలో చేరారు. దీనికితోడు భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తర్వాత పార్టీ ఐక్యత దెబ్బతింది. ఇన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ కల్పన పార్టీని ఐక్యంగా ఉంచడంలో విజయం సాధించారు. ఈ ప్రభావం వల్ల ఆ పార్టీకి గతంలో కంటే అధికంగా సీట్లు వచ్చాయి.
గండేయ అసెంబ్లీ స్థానం నుంచి కల్పన విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో కల్పనను బయటి వ్యక్తిగా చిత్రీకరించడానికి ‘హెలికాప్టర్ మేడమ్’ అంటూ కల్పనా సోరెన్‌ను బీజేపీ విమర్శించింది. అయితే దీనివలన ప్రతిపక్షం ఏమీ ప్రయోజనం పొందకపోగా కల్పనకు జనం మద్దతు లభించింది. జేఎంఎం తిరిగి అధికారంలోకి రావడంలో గిరిజనులు కీలకపాత్ర పోషించారు. హేమంత్ సోరెన్ అరెస్టును భావోద్వేగ సమస్యగా మార్చి, గిరిజన సమాజాన్ని తనవైపు తిప్పుకోవడంలో జేఎంఎం విజయం సాధించింది.
హేమంత్-కల్పన నాయకత్వంలో సాగిన జేఎంఎం ఎన్నికల ప్రచారంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. అలాగే జెఎంఎం ప్రభుత్వ మయ్యా సమ్మాన్ యోజన ఓటర్లపై ప్రభావం చూపింది. ఈ పథకంలో 18-50 ఏళ్లలోపు మహిళలకు నెలనెలా రూ.1000 సాయం అందుతుందని, ఎన్నికల అనంతరం దీనిని రూ.2,500కు పెంచుతామని హేమంత్ హామీ ఇచ్చారు. 1.75 లక్షలకు పైగా రైతులకు రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేశారు. బకాయి ఉన్న విద్యుత్ బిల్లుల మాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు హేమంత్ సోరెన్‌కు వ్యతిరేకంగా ప్రచారం సాగించినా ఇది ఓటర్లపై గణనీయమైన ప్రభావం చూపలేదు.
ఇది కూడా చదవండి: ఒకే ఒక్కడు హేమంత్
Comments
Please login to add a commentAdd a comment