తెలుగుదేశం నేత, మాజీ మంత్రి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ అట్టహాసంగా ఆరంభించిన పాదయాత్రలో స్పష్టంగా కనిపించిన విషయం ఏమిటంటే అందులో ఆశించిన జోష్ కనిపించకపోవడం. ఆయన స్పీచ్‌లో ఉండవలసిన వేగం కాని, ఉద్వేగం కాని లేవు. రొటీన్‌గా ఎప్పుడూ చేసే ప్రసంగాన్నే ఆయన చేశారు. ఆయన పార్టీ వారికి కొత్త ఆశలు కనిపించే ప్రయత్నం చేయడం కన్నా, ముఖ్యమంత్రి జగన్‌ను జాదూ రెడ్డి అనో, మరొకటనో విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారు. దానికి కారణం ఆయన ఒక నిర్దిష్టమైన ఎజెండాను రూపొందించుకోలేకపోవడం.
కాకపోతే తాము అధికారంలోకి వస్తే జాబ్ నోటిఫికేషన్‌లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని గొప్పలు చెప్పుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఐటి శాఖ మంత్రిగా చాలా చేశానని ఆయన వివరించుకునే యత్నం చేశారు. ఆయన మొత్తం రాష్ట్రాన్ని అంతటిని ప్రభావితం చేసే స్థాయిలో మంత్రిగా వ్యవహరించి ఉంటే ఆయనే ఎందుకు ఓడిపోయారో తెలియదు. ఆ ఐదు లక్షల ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయో, ఎవరికి వచ్చాయో వివరంగా చెప్పే పరిస్థితి లేదు. 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు, పెద్ద ఎత్తున పరిశ్రమలు వెల్లువెత్తినట్లు ప్రచారం చేసుకునేవారు.
చివరికి విశాఖలో కాదు కదా.. ఏపీలో ఎక్కడా చెప్పుకునే స్థాయిలో ఒక్క ఐటీ పరిశ్రమ రాలేదు. ఏదో అక్కడక్కడ చిన్న, చిన్న కంపెనీలు కొద్దిపాటి వచ్చాయి. అవి కూడా ప్రభుత్వం ఇచ్చే రాయితీల కోసమే అన్న సంగతి ఆ తర్వాత కాలంలో అర్ధం అయింది. అది వేరే విషయం. ఇప్పుడు విశాఖలో వస్తున్న ఆదాని డేటా సెంటర్ తమ ప్రభుత్వం తెచ్చిందని అసత్యం చెప్పేశారు.
అదానీ వచ్చి ముఖ్యమంత్రి జగన్‌ను కలిస్తే, ఆదానికి రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని టీడీపీ మీడియా ప్రచారం చేసిన విషయాన్ని ఆయన మర్చిపోయి ఉండవచ్చు. అంతకన్నా పెద్ద అబద్దం ఏమిటంటే చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీని కూడా తామే ఏర్పాటు చేశామని ఆయన అనడం. ఆ సిటీని ప్రతిపాదించినప్పుడు అధికారంలో ఉన్నది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన ప్రభుత్వం అక్కడ భూ సేకరణ చేస్తున్నప్పుడు, వివిధ రాయితీలు ప్రకటించినప్పుడు ఇదే టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. ఈనాడు పత్రిక అయితే సెజ్ కుంపట్లు అని సంపాదకీయమే రాసింది.
కాని ఇప్పుడు అది తమ ఘనతేనని చెప్పుకుంటున్నారు. మరో వైపు పరిశ్రమలు వెళ్లిపోయాయని, పొరుగు రాష్ట్రంలో పెట్టారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రతిపాదనను ఉద్దేశించి చెప్పారు. ఈ రకంగా అచ్చం చంద్రబాబు నాయుడు మాదిరి అసత్యాలు వల్లెవేశారే తప్ప, ఇంకా యువకుడే కనుక తనకంటూ ఒక ప్రత్యేక లక్ష్యం ఉందని చెప్పలేకపోయారు. ఇప్పటికీ వృద్దుడైన తన తండ్రి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేస్తామని చెబుతున్నారే కాని, తానే సీఎం అభ్యర్ధినని చెప్పలేని దైన్య స్థితి లోకేస్‌ది అనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ సీఎం కాండిడేట్ అని ప్రకటిస్తే ఎక్కడ తెలుగుదేశం ఇంకా దెబ్బతినిపోతుందేమోనన్న భయం తప్ప మరొకటి కాదు.
ఏపీలో ఒకేసారి లక్షా ముప్పైవేల మందికి ప్రభుత్వాలు ఇచ్చి రికార్డు సృష్టించిన జగన్‌తో ఆయన పోల్చుకోవడం, అసలు ఉద్యోగాలే ఇవ్వలేదని చెప్పడం ఎంత పెద్ద అబద్దమో ఊహించుకోవచ్చు. కుప్పం టీడీపీకి కంచుకోట అన్నారు. అది ఇంతవరకు వాస్తవమే. కాని కొద్ది నెలల క్రితం జరిగిన స్థానిక ఎన్నికలలో ఆ కంచుకోట కూలిపోయిన విషయాన్ని జనం మర్చిపోయారన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కుప్పంకు చేయలేని కార్యక్రమాలు ఇప్పుడు జగన్ చేయాలని, అందుకు 1300 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేయడం టీడీపీ వైఫల్యానికి మరో నిదర్శనంగా ఉంటుంది.
ఇంతకుముందు ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు నాయుడు లేఖ రాసి రెవెన్యూ డివిజన్ చేయాలని కోరితే అందుకు ఆయన అంగీకరించారు. మరి ఇప్పుడు ఎవరు గొప్ప? చంద్రబాబు గత టరమ్‌లో కుప్పంకు విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దాని సంగతేమిటో లోకేష్ చెప్పి ఉండవలసింది. గతంలో ఇజ్రాయిల్ టెక్నాలజీ అంటూ కోట్ల రూపాయలు వ్యయం చేశారు. కాని చివరికి రైతులకు దక్కింది శూన్యం. కుప్పంలో చంద్రబాబు ఏడుసార్లుగా గెలుస్తున్న మాట నిజమే. కాని ఈసారి గట్టి సవాల్ ఎదురు అవుతున్నమాట కూడా వాస్తవమే.
ప్రజలలో ఆ ఫీలింగ్ మరీ ఎక్కువగా వెళ్లడం కోసం చంద్రబాబు, లోకేష్‌లు తంటాలు పడుతున్నారు. మద్య నిషేధం గురించి అడుగుతున్న ఆయన తన తండ్రి హయాంలో మద్య నిషేధాన్ని ఎత్తివేసిన సంగతి ఆయనకు గుర్తు లేకపోవచ్చు. పైగా ఇప్పుడు మార్కెట్ లో ఉన్న బ్రాండ్లన్నీ టీడీపీ హయాంలో వచ్చినవే. జగన్‌ను జాదూరెడ్డి అని లోకేష్ అన్నారు. నిజంగానే టీడీపీ పాలిట జగన్ జాదూరెడ్డే అయ్యారు. ఆయన టీడీపీని చాపచుట్టినట్లు చుట్టి కేవలం 23 'సీట్లకే పరిమితం చేశారు. ఆయన స్పీచ్ ఎవరు రాసిచ్చారో కాని ఈ పాయింట్ మాత్రమే కరెక్టే అనిపిస్తుంది. తన యువగళానికి వైసీపీ వారి ప్యాంట్లు తడిసిపోతున్నాయని అనడం అతిశయోక్తి కాక ఇంకేమవుతుంది.
తల్లి, చెల్లిని తరిమేశాడంటూ మరో పిచ్చి ఆరోపణ చేశారు. గత పార్టీ ప్లీనరీకి తల్లి విజయమ్మ హాజరై ప్రకటన చేసిన సంగతి మర్చిపోయారు. అలాగే తెలంగాణ రాజకీయాలలో ఉండాలనుకుని షర్మిల వెళ్లారు. వారిద్దరూ ఎక్కడా జగన్‌ను ఒక్క మాట అనలేదు. మరి కుటుంబ విషయాలను ప్రస్తావించదలిస్తే, హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌ను ఎంత అవమానకరంగా పార్టీలోకి కూడా రాకుండా అడ్డుకున్నారో లోకేష్‌కు తెలియదా? టీడీపీ క్యాడర్‌కు తెలియదా! కుప్పంలో చంద్రబాబు రోడ్ షో లోనే జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలోకి తీసుకురావాలని బానర్‌లు పెట్టారు కదా! చంద్రబాబు తన సోదరుడు రామ్మూర్తి నాయుడుకు టిక్కెట్ ఇవ్వని వైనం, ఆ తర్వాత ఆయన చేసిన విమర్శలు బహుశా లోకేష్‌కు తెలియకపోవచ్చు.
చదవండి: కుప్పం పోలీస్‌స్టేషన్‌లో అచ్చెన్నాయుడిపై కేసు నమోదు
ఎందుకంటే అప్పటికి ఆయన చంటిపిల్లాడే. రాజకీయాలు తెలియని వ్యక్తే. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఇకపై కూడా యువతకు అధికారం అప్పగించడానికి సిద్దంగా లేదన్న విషయాన్ని లోకేష్ ఉపన్యాసం ద్వారా తెలియచేసినట్లయింది. మరి అలాంటప్పుడు యువగళం పేరెందుకో తెలియదు. చివరిగా ఒక మాట. పవన్ కల్యాణ్ వారాహి గురించి కూడా లోకేష్ ప్రస్తావించి ఒంటరిగా పోటీ చేయలేమని మరోసారి చెప్పారు. ఇక పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు బహిరంగ సభలో పచ్చిబూతులు మాట్లాడుతూ పోలీసులను దూషించడం ఏమాత్రం పద్దతిగా లేదు. అదే హైలైట్ అనుకుంటే మనం ఏమి చేయగలం. ఆ పార్టీ సంస్కృతి అని సరిపెట్టుకోవడం తప్ప.
::హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment