శ్రీరామ్‌చినబాబు, డి.శ్రీనివాసులు
సాక్షి, మదనపల్లె: మదనపల్లె నియోజకవర్గానికి సంబంధించిన ఇద్దరు టీడీపీ నాయకుల మధ్య సెల్‌ఫోన్‌లో సాగిన బూతుపురాణం వాట్సప్‌ల్లో వైరల్ అవుతోంది. టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, మండల సీనియర్ నాయకులు డి.శ్రీనివాసులు ఫోన్‌లో బూతులు తిట్టుకున్న తీరు విన్నవారి చెవులు తుప్పు వదిలిపోయేలా ఉంది. మదనపల్లె తెలుగుదేశం పార్టీలో కొద్దిరోజులుగా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, శ్రీరామ్‌చినబాబు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నియోజకవర్గ తెలుగుయువత కమిటీ నియామకంకు సంబంధించి వీరిద్దరి మధ్య రాజుకున్న వివాదమే శుక్రవారం మండల సీనియర్ నాయకుడికి, శ్రీరామ్‌చినబాబు బూతులకు కారణమైంది.
శ్రీరామ్‌చినబాబు ప్రకటించిన కమిటీ చెల్లదని, తాను వేసిన కమిటీనే చెల్లుతుందని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఇటీవల ప్రకటించారు. దీంతో శ్రీరామ్‌చినబాబు రెండురోజులక్రితం తన కార్యాలయంలో ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసి తెలుగుయువతకు సంబంధించి తన నిర్ణయమే ఫైనల్ అని మదనపల్లెకు ఇన్‌చార్జ్‌లు లేరని ప్రకటించారు. దీంతో ఇన్‌చార్జ్‌గా ప్రచారం చేసుకుంటున్న దొమ్మలపాటి రమేష్ ప్రధాన అనుచరుడు శ్రీనివాసులు శ్రీరామ్‌చినబాబుతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ బూతుపురాణంగా మారింది. పత్రికల్లో రాయలేని విధంగా ఇద్దరు ఒకరిపై ఒకరు బూతులు మాట్లాడుకోవడమే కాకుండా మధ్యలో పార్టీ అధినేత చంద్రబాబును, తల్లిలాంటి పార్టీని దూషించారు. నీవు డబ్బులకు అమ్ముడుపోయావని ఒకరంటే.. నీవు జనసేనలో చేరుతున్నావని మరొకరు..ఎన్నిపార్టీలు మారుతావురా, సిగ్గులేదానీకు అంటూ ఒకరంటే.. నా....లో పార్టీ అంటూ బూతులు మాట్లాడుకున్నారు.
చదవండి: ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలకు.. టీడీపీ ద్రోహం
ప్రతిసారీ వేదికల మీద క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ అని చెప్పుకునే చంద్రబాబు తెలుగుతమ్ముళ్ల బూతుపురాణంపై ఏ విధంగా స్పందిస్తారని పట్టణంలో పలువురు చర్చించుకుంటున్నారు. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు బీసీ నాయకుడు కావడంతో ఎక్కడ తనకు పోటీఅవుతారోనని, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటిరమేష్ తన అనుచరుడితో రెచ్చగొట్టేలా మాట్లాడించి బూతులు తిట్టించారని ప్రచారం జరుగుతోంది. అధినేత తమ్ముళ్ల బూతుపురాణంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment