సాక్షి, అమరావతి: వినాయక చవితి పండగను సైతం రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ, టీడీపీలు దుష్ట ఆలోచన చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి మండపాలు, పందిళ్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకపోయినా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం విష్ణు మీడియాతో మాట్లాడారు.
టీడీపీ–బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడిని తొలగించడానికి ప్రయత్నిస్తే.. తాము ఉద్యమించామని.. దాంతో వెనక్కి తగ్గిన మాట వాస్తవం కాదా? అని విష్ణు ప్రశ్నించారు. వినాయకుడి గుడిని తొలగించడానికి ప్రయత్నించిన మీకు వినాయక చవితి గురించి మాట్లాడే నైతిక హక్కులేదని ఆ ఇద్దరు నేతలకు ఆయన స్పష్టంచేశారు. మళ్లీ వీరే ఇప్పుడు వినాయకుడిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేయడం సిగ్గుచేటన్నారు.
ఇక 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ–బీజేపీ ప్రభుత్వం రూపొందించిన నియమ, నిబంధనల ప్రకారమే వినాయక మండపాలు, పందిళ్లకు అనుమతులిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. అప్పట్లో వినాయక మండపాలకు రూ.వెయ్యి విద్యుత్ ఛార్జీగా నిర్ణయిస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దాన్ని తగ్గించిందని ఆయన గుర్తుచేశారు. అలాగే, కాణిపాకంలో వరసిద్ధి వినాయకస్వామికి రూ.6 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బంగారు రథాన్ని తయారుచేయిస్తోందని ఆయన గుర్తుచేశారు.
మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి..
హిందువులను పండగలు చేసుకోనివ్వడంలేదని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అందులో నిజం ఉందని మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పగలరా అని చంద్రబాబు, సోము వీర్రాజులను మల్లాది విష్ణు సవాల్ చేశారు. వీళ్లు హిందువులే కాదు.. అసలు భారతీయులే కాదన్నారు. వీరికి మరో పనిలేకే ఇలాంటి దుష్ఫ్రచారం చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.
ప్రతీ విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని.. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై వారిద్దరికీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే కేంద్రాన్ని అడిగి పోలవరానికి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తావా అని సోము వీర్రాజుకు విష్ణు సవాల్ విసిరారు.
‘చవితి’పైనా రాజకీయమా?
Published Mon, Aug 29 2022 3:08 AM | Last Updated on Mon, Aug 29 2022 7:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment