లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య విభేధాలు రోజురోజకీ తారా స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మధ్య మాటలు తూటలు పేలుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తాము(టీఎంసీ) ఇప్పటికీ ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, సీపీఎంతో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బయట నుంచి తమ మద్దతు ఉంటుందని వెల్లడించిన మరుసటి రోజే మమతా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం
హల్దియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో గురువారం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఓటర్లను విభజించడానికి కాంగ్రెస్, సీపీఎం ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ (బెంగాల్‌లో) వారికి ఓటు వేయకండి. రాష్ట్రంలో పొత్తు లేదు. కేవలం కేంద్రంలో మాత్రమే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేస్తున్నాను. అలాగే కొనసాగుతాం. మేము ఇండియాలో భాగమే. దానికి మద్దతునిస్తూనే ఉంటాను. ఇందులో ఎలాంటి అపార్థం ఉండకూడదు’’ అని పేర్కొన్నారు.
తాజాగా మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. టీఎంసీ ఇండియా కూటమిలో భాగం కాదని, ఆమె మాటలను నమ్మవద్దని తెలిపారు. టీఎంసీ కూటమి నుంచి వెళ్లిపోయిందని, మమతా బెనర్జీ ఎప్పుడైనా బీజేపీ వైపు వెళ్లవచ్చని ఆరోపించారు.
‘ఆమె కూటమికి బయట నుంచి, లోపల నుంచి నాకు చేస్తుందో తెలియదు. మీరే ఆమెను అడగాలి. కానీ నాకు ఆమెపై నమ్మకం లేదు.ఆమె కూటమిని విడిచిపెట్టింది. త్వరలో బీజేపీ వైపు ఆకర్షితులైన ఆశ్యర్యపోనవసరం లేదు.’ అని పేర్కొన్నారు. ఇండియా కూటమి బెంగాల్ కాంగ్రెస్‌ను లెక్క చేయదని అన్నారు. కూటమి గురించి ఆమెకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఏర్పాటు సమయంలోనే లేవనెత్తాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment