మనీష్ తివారి
న్యూఢిల్లీ: తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టబోనని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మనీష్ తివారి స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీని వీడుతున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. వీటిపై ఆయన స్పందిస్తూ.. ‘నేను కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లాలని అనుకోవడం లేదు. పార్టీ నుంచి నన్ను గెంటేయాలని ఎవరైనా అనుకుంటే అది వేరే విషయం. నా జీవితంలో 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాన’ని అన్నారు.
పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పంజాబ్‌లో అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్.. మనీష్ తివారి సేవలను వినియోగించుకోవడం లేదు. దీంతో ఆయన తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. (క్లిక్: సీఎం ఛన్నీ, ప్రియాంక గాంధీపై మోదీ ఆగ్రహం)
గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై మనీష్ తివారి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దీంతో హైకమాండ్ ఆయనను పక్కన పెట్టింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలోనూ ఆయన చోటు దక్కలేదు. గాంధీల నాయకత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయనకు అధిష్టానం విధించిన 'శిక్ష'గా ఈ పరిణామాన్ని పరిగణించారు. అయితే పార్టీలో ప్రజాస్వామ్య సంస్కరణలను తాను కోరుకుంటున్నానని తివారి చెప్పారు. (క్లిక్: పంజాబ్‌లోని ఈ ఎన్నారై బెల్ట్‌లో హోరాహోరీ పోరు)
ఆయన రాజీనామా ఆందోళన కలిగిస్తోంది
ఒక చిన్న పార్టీ కార్యకర్త కాంగ్రెస్‌ను వీడినా కాంగ్రెస్‌కే నష్టమని మనీష్ తివారి అన్నారు. సీనియర్ నేతలు పార్టీని వీడితే పెద్ద నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు అశ్వనీ కుమార్ మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 46 ఏళ్ల పాటు కాంగ్రెస్ కొనసాగిన అశ్వనీ కుమార్.. పార్టీని వీడటం పట్ల తివారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన రాజీనామా దురదృష్టకరమని, కాంగ్రెస్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని అన్నారు. కాగా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 25న ఒకే విడతలో జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.
Comments
Please login to add a commentAdd a comment