శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో గత ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటున్నారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కశ్మీర్ పర్యటనలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మనోజ్ ఇలా స్పందించారు.
‘జమ్ము కశ్మీర్‌లో ప్రజల వద్ద రాహుల్ గాంధీ అభిప్రాయాలను సేకరించాలి. అప్పుడే రాహుల్‌కు మరింత అవగాహన వస్తుంది. కావాలంటే రహస్య బాలెట్ విధానంలో ప్రజాభిప్రాయాన్ని చేపట్టండి. ఇక్కడి 75 శాతం మంది ప్రజలు అభివృద్ధి జరగలేదని చెబితే నా పదవికి రాజీనామా చేస్తా’ అని అన్నారు.
అలాగే.. జమ్ము కశ్మీర్‌లో ఎవరి ప్రభుత్వం కొలువుదీరినా వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతాలకు ఉండే లెఫ్టినెంట్ గవర్నర్‌కు కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇటీవల రాహుల్ గాంధీ జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎల్జీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ జమ్ము కశ్మీర్‌లో ఒక రాజు ఉన్నారు. ఆయనే లెఫ్టినెంట్ గవర్నర్. ఆయన జమ్ము కశ్మీర్ ప్రజల సంపదను బయటి వ్యక్తులకు తరలిస్తున్నారు’ అని అన్నారు. ఇక.. జమ్ము కశ్మీర్‌లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment