సాక్షి, అమరావతి: రమ్య హత్యకేసులో నిందితుణ్ని 24 గంటల్లోనే అరెస్టు చేశామని, ఆ ఉన్మాదికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. రమ్య కుటుంబానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సçహాయం అందించి, అండగా నిలిచారని తెలిపారు. దీన్ని మానవత్వమంటారేగానీ చేతులు దులుపుకోవడం అనరని టీడీపీ నేతలకు చురకలు అంటించారు. మానవత్వమే సీఎం వైఎస్ జగన్ మతం అని పునరుద్ఘాటించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దిశ చట్టం ఎక్కడుందని ప్రతిపక్షాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా మహిళా భద్రతకు పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్ దిశ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు.
ఈ బిల్లు ఆమోదం పొందాక రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్‌లు, మూడు ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దర్యాప్తు వేగం పెరిగిందన్నారు. కేసు దర్యాప్తునకు 2019 నాటికి 100 రోజులు పట్టేదని, 2020లో 86 రోజులు పట్టిందని, 2021లో 42 రోజుల్లోనే పూర్తిచేస్తున్నామని తెలిపారు. కేసు నమోదైన ఏడు రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేయాలని దిశ బిల్లులో ఉన్నట్లు చెప్పారు. దిశ చట్టం ఇంకా అమల్లోకి రాకపోయినా.. బిల్లు ఆమోదం పొందిన తరువాత మహిళ భద్రతతో పాటు, శిక్షలు అమలు చేయడంలోనూ రాష్ట్ర పోలీస్‌శాఖ ఎంతో వేగంగా పనిచేస్తోందని చెప్పారు. దాన్లో పేర్కొన్న మేరకు రోజుల్లోనే విచారణ పూర్తిచేసి శిక్షలు పడేలా చేస్తున్నామన్నారు.
ఈ బిల్లు ఆమోదం పొందాక 1,645 కేసులకు సంబంధించి ఏడు రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేశామన్నారు. వీటిలో దాదాపు 60 అత్యాచార కేసులు, 92 అత్యాచార, పోస్కో కేసులు, 130 పోస్కో యాక్ట్ కేసులు, 718 వేధింపులు ఉన్నాయని వివరించారు. 1,531 సైబర్ బెదిరింపులు, 2,017 లైంగిక వేధింపుల కేసుల్లో చార్జ్‌షీట్‌లు దాఖలు చేశామని చెప్పారు. దాదాపు 2,114 కేసులలో 15 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేశామన్నారు. ఇవన్నీ ‘దిశ’ ద్వారానే జరిగాయని గుర్తుచేశారు. దిశ బిల్లు ఆమోదం పొందిన తరువాత నేరాలు నాలుగు శాతం తగ్గాయని తెలిపారు.
2.11 లక్షలమంది లైంగిక నేరస్తుల వివరాలు జియో ట్యాగింగ్
మొత్తం 2.11 లక్షల మంది లైంగిక నేరస్తుల వివరాలు సేకరించి జియో ట్యాగింగ్ చేసినట్లు చెప్పారు. మహిళలపై దాడిచేసిన 148 మందికి ‘దిశ’ ప్రకారం శిక్షలు పడ్డాయని, వారిలో ముగ్గురికి ఉరిశిక్ష, 17 మందికి జీవితఖైదు, ముగ్గురికి 20 ఏళ్ల జైలుశిక్ష, 10 మందికి పదేళ్ల జైలుశిక్ష పడేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. దిశ యాప్‌ను దాదాపు 39 లక్షలమంది డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. 3.10 లక్షలమంది దిశ యాప్‌ను ఉపయోగించుకున్నారని, దానిద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 2,988 కాల్స్‌పై చర్యలు తీసుకుని, 436 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని చెప్పారు.
చాలా కేసుల్లో నిందితులు మద్యంతో పాటు, మాదక ద్రవ్యాలు వినియోగించినట్లు కనిపిస్తోందన్నారు. రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణ విషయంలో కూడా మాదకద్రవ్యాల వినియోగం దిశగా విచారణ జరుగుతోందని చెప్పారు. తాడేపల్లి ఘటనలో నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. లోకేష్ పరామర్శల పేరుతో శవరాజకీయాలు చేస్తూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, çస్పృహ కల్పించే విధంగా నూతన విద్యావిధానానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు నైతిక విలువలు నేర్పించేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.
అప్పుడేం చేశావ్ చంద్రబాబూ?
దిశ యాప్ ప్రచారం కోసమే అని మాట్లాడుతున్న ప్రతిపక్షం.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళల భద్రతకు ఏం చేసిందో చెప్పాలని సుచరిత నిలదీశారు. ఏనాడూ బాధితులకు పైసా సాయం చేయని చంద్రబాబు ఇప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వో వనజాక్షిపై చేయిచేసుకున్న టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వారిమధ్య రాజీచేశారని గుర్తుచేశారు. ర్యాగింగ్ భూతానికి బలైన రిషితేశ్వరి కుటుంబానికి ఏం న్యాయం చేశారని, కాల్‌మనీకి సంబంధించి మహిళలపై అత్యాచారాలు జరిగిన కేసులో ఎవరిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు, ఆయన కేబినెట్‌లో మంత్రి ఆదినారాయణరెడ్డి దళితుల్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనా విధానంతో సీఎం వైఎస్ జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రివర్గంలో గౌరవనీయమైన స్థానం కల్పించారని, ముగ్గురు దళిత, గిరిజన మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారని వివరించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారన్నారు. ఇలాంటి ప్రభుత్వంపై కులం పేరుతో ఆరోపణలు చేయడం చంద్రబాబుకు తగదని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment