తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో చంద్రబాబుది చెదిరిన చరిత్ర అని, రానున్న రోజుల్లో ఆయన పేరు ఉండదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వంచన, మోసం, మాయ మాటలతోనే 40 ఏళ్ల పాటు ఆయన రాజకీయాలు చేశారని చెప్పారు. తిరుపతిలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుప్పం పర్యటన సందర్భంగా చంద్రబాబునాయుడు చేసిన విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ఆయన మాట్లాడిన మాటలు, భాషా ప్రయోగం, విమర్శలు చూస్తుంటే జాలేస్తుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం ఓర్వలేక ఫ్రస్ట్రేషన్‌తో ఆయన విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా మేనిఫెస్టో చూపించి, బహిరంగ సభల్లో చర్చించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదే అన్నారు. ఏనాడైనా చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను నెరవేర్చారా అని ప్రశ్నించారు. ప్రజలు తమ సంతృప్తిని వరుస ఎన్నికల్లో తెలిపారని ఆయన స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానుల బిల్లులను త్వరలోనే సమగ్రంగా చట్టసభల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు.
చదవండి: ‘కుప్పం ప్రజల దెబ్బకు చంద్రబాబు కళ్లు నేలకు దిగాయి’
ఓటీఎస్‌ను టీడీపీ ఒప్పుకుంటుంది
పేదల ఇంటిపై రిజిస్ట్రేషన్‌తో కూడిన హక్కును కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకాన్ని టీడీపీ సైతం సమర్థిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. ఓటీఎస్ పథకాన్ని ప్రకటించినప్పుడు ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయంతోనే టీడీపీ మొదట్లో ఆరోపణలు చేసిందన్నారు. ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి ప్రస్తుతం మాట మారుస్తు ఓటీఎస్‌ను సమర్థించక తప్పని పరిస్థితి ఎదురైందన్నారు.
సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేస్తామని, లేనిపోని అపోహలతో కొందరు వారిలో భయాందోళనలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. స్వచ్ఛ అవార్డుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నగరాలు పలు అవార్డులు కైవసం చేసుకోవడం అభినందనీయమన్నారు. 3,200కుపైగా నగరాలు జాతీయస్థాయిలో పోటీపడినా, తిరుపతి మూడోర్యాంక్ సాధించడం అభినందనీయమన్నారు. మంత్రివర్గ విస్తరణ సీఎం అభీష్టమని, తమకు ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment