సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేయగానే టీడీపీ, రామోజీరావు అక్కసు వెళ్లగక్కారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రామోజీరావు కడుపుమంటను బయట పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. 12 వేల ఎకరాలు భూసేకరణ చేయాలని ఆనాడు చంద్రబాబు చెప్ప లేదా?. మీ పత్రికల్లో వార్తలు రాయలేదా? అంటూ మంత్రి దుయ్యబట్టారు.
‘‘అంత అవసరం లేదని ఆరోజు జగన్ చెప్పారు.. కాబట్టే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక భూసేకరణను భారీగా తగ్గించేశాం. రైతులను సంతృప్తి చేశాకనే శంకుస్థాపన చేశాం. విభజన చట్టంలోనే భోగాపురం ఎయిర్ పోర్టు గురించి ఉంది. ఆ నిజాన్ని రామోజీరావు ఎందుకు చెప్పటం లేదు?. బాధిత రైతులతో చర్చించాకనే ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుంటే ఎందుకు అంత బాధ?. రాష్ట్ర ప్రయోజనాల కోసం భోగాపురం ఎయిర్ పోర్టు మూలస్తంభంలాగ పని చేస్తోంది. నిన్న జరిగిన శంకుస్థాపన పండుగని చూసి జనం సంతోష పడుతున్నారు. కోర్టులలో రకరకాల కేసులు వేస్తుంటే అన్నిటినీ ఎదుర్కొని ఆటంకాలు లేకుండా చేస్తున్నాం’’ అని మంత్రి బొత్స పేర్కొన్నారు.
‘‘తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు, రామోజీరావు అడ్డుకుంటున్నారు. 12 వేల ఎకరాలు తీసుకోకుండా మేము అడ్డుకున్నాం. 2,300 ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నాం. ఒకరిద్దరికి కోర్టు వివాదాల కారణంగా పరిహారం అందలేదు. వారికి కూడా మేము న్యాయం చేస్తున్నాం. చంద్రబాబు చేసినవన్నీ రాజకీయ శంకుస్థాపనలే. జగన్ చేస్తున్న శంకుస్థాపనలు రాష్ట్ర ప్రయోజనాలకే. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ కేసులు వేశారని చంద్రబాబు అంటున్నారు. మరి అప్పుడు చంద్రబాబు గడ్డి పీకుతున్నారా?. ఆరోపణలు చేయగానే సరికాదు. అసలు ఒక మండలం అంతా లేపేయాలని చంద్రబాబు చూశారు. దాంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎయిర్ పోర్టు రావాలని ఇప్పుడు జనం కోరుతున్నారు’’ అని మంత్రి అన్నారు.
చదవండి: CM Jagan: ‘జగన్ పట్టుదలకు శెభాష్ అనాల్సిందే!’
‘‘చంద్రబాబు నోరు, రామోజీరావు రాత ఒకటే. రాజధాని కేసులపై సిట్ విచారణ చేస్తుంది. తప్పు జరిగతే జరిగిందని తెలుస్తుంది, లేకపోతే లేదని తెలుస్తుంది. చంద్రబాబు మీద ఆరోపణలు వస్తే ఎందుకు నిజాయతీని నిరూపించుకోలేదు?. కోర్టులకు వెళ్లి ఎందుకు స్టేలు తెచ్చుకున్నారు?. మేము సిట్ ద్వారా చేసే విచారణ ఏదీ అరెస్టుల కోసం కాదు. జరిగిన తప్పులను ప్రజలకు వివరించటానికే. రాజధాని అక్రమాలపై సిట్ విచారణ చేస్తుంది. చంద్రబాబు తప్పు చేశారా? నారాయణ చేశారా? ఇంకెవరు చేశారో తేలుతుంది. భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో చంద్రబాబు గబ్బు నోటితో మాట్లాడవద్దు. ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. అనవసరంగా న్యూసెన్స్ చేసుకోవద్దు. రామోజీరావు రాతలన్నిటికీ నేను సమాధానం చెప్తాను’’ అని మంత్రి స్పష్టం చేశారు.
చదవండి: హోంశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
అందరికీ న్యాయం చేయటానికే మేమున్నాం. ఏ పార్టీ అయినా, ప్రజలైనా సమస్య చెప్తే అది విని, పరిష్కరిస్తున్నాం. ఎవరూ బాధ పడకూడదని, అందరూ చల్లగా ఉండాలని మా ప్రభుత్వం కోరుకుంటుంది. అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. పంటనష్టం అంచనాలను రూపొందిస్తున్నాం. సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. రాత్రి వర్షం పడగానే పొద్దున్నే పరిహారం ఇవ్వాలంటే ఎలా?. చంద్రబాబు చేసే రాజకీయాలను పట్టించుకోవాల్సిన పనిలేదు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment