
సాక్షి, విజయవాడ: తెలంగాణ మంత్రి హరీష్ రావు.. ఏపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఏపీ కోసం మాట్లాడటానికి హరీష్ రావు ఎవరని.. ముందు ఆయన వాళ్ల రాష్ట్రం కోసం చూసుకోవాలని బొత్స హితవు పలికారు.
రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తున్నామో మా ప్రజలకు తెలుసని.. అయినా ఇన్నాళ్లు లేనిది హరీష్ రావు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడో ఆయన్నే అడగాలంటూ ధ్వజమెత్తారు. రాజకీయం కోసమే హరీష్ అలా మాట్లాడి ఉంటాడని బొత్స అభిప్రాయపడ్డారు.
ఇక.. చంద్రబాబు రాజకీయ ఉనికి కోసం విమర్శలు చేస్తున్నాడని, ముందుగా ఆయన ఏం ఉద్ధరించాడో చెప్పాలని మండిపడ్డారు. చంద్రబాబు జీవితంలో ఇది పేటెంట్ అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. వైఎస్సార్, వైఎస్ జగన్ పేటెంట్ పథకాలు చాలా ఉన్నాయని, రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించడంతో పాటు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేస్తూ నడుపుతున్నామని వెల్లడించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.