సాక్షి, వరంగల్: సంక్రాంతికి గంగిరెద్దుల వారి మాదిరిగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు వస్తున్నారంటూ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. ఆ రెండు పార్టీలు చెప్పే మాటలు, ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని కోరారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో పశ్చిమ, తూర్పు రెండు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్.. సుమారు 900 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు.
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి ఆర్‌అండ్‌బి అతిథి గృహం, పోలీస్ భరోసా కేంద్రం, బస్తీ దవాఖానా, నీటి శుద్ధి కేంద్రం, సాప్ట్ వేర్ కంపెనీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. మోడర్న్ బస్ స్టేషన్, భద్రకాళి బండ్ పై సస్పెన్షన్ బ్రిడ్జి, మ్యూజికల్ ఫౌంటెన్, ఐటి టవర్, లాండ్రీ మార్ట్, స్మార్ట్ లైబ్రరీకి శంకుస్థాపనలు చేశారు.
హన్మకొండ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ తీరు, బీజేపీ వైఖరిపై విమర్శలు గుప్పించారు. గతంలో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ అయితే వారికీ సహకరించింది బీజేపీ అంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణపై చిత్తశుద్ధితో ఆ రెండు పార్టీలు లేవని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ తెలంగాణపై విషం కక్కుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మాయమాటలతో మోసం చేస్తుందని ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టం ఎంత ఉండేదో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఆ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాం.. బస్సులు పెడుతాం భోజన సౌకర్యం కల్పిస్తాం. ఎక్కడికైనా వెళ్లి కరెంట్ వైర్లు పట్టుకోవాలని సూచించారు. కరెంట్ కనిపించదు..కేసిఆర్ లెక్క సన్నగా ఉంటుంది... షాక్‌తో జాడిచ్చి తంతే అడ్రస్ లేకుండా పోతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఒకటా రెండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అద్బుతంగా కేసీఆర్ అమలు చేస్తున్నారని, కాంగ్రెస్ బీజేపీ నేతలకు అవి కన్పించడం లేదన్నారు. రంగస్థలం సినిమా పాటలా ఆ గట్టున ఉంటావా? ఈ గట్టున ఉంటావా తేల్చుకోవాలని సూచించారు. ఈ గట్టున స్కీమ్‌లు ఉన్నాయి.. ఆ గట్టున స్కామ్ లు ఉన్నాయి... ఈ గట్టున ప్రజాసంక్షేమం ఉంది.. ఆ గట్టున 60 ఏళ్లు జనాన్ని పీక్కు తిన్నవారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమానికి మూల కేంద్రమైన ఓరుగల్లు గడ్డ కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచిందని అదే స్పూర్తితో బీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.
చదవండి: బీఆర్‌ఎస్‌కు రేఖా నాయక్ రాజీనామా.. కేటీఆర్‌పై షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment