సాక్షి, సిరిసిల్ల: ‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఉన్నాయా? నేను ఆ పార్టీలకు చాలెంజ్ చేస్తున్నా.. ఎక్కడికైనా వెళ్లి చూద్దామా?’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారక రామారావు సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లో శనివారం పలు అభివృద్ధి పథకాలను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటలపాటు విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, గ్రామాల్లో నర్సరీలు, వైకుంఠధామాలు, శ్మశానవాటికలు, పల్లెప్రకృతి వనాలు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు, నెలనెలా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నామని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మండే ఎండాకాలంలో గోదావరి జలాలతో వాగులు పారుతున్నాయని, చెరువులు మత్తళ్లు దూకుతున్నాయని, ఇది సీఎం కేసీఆర్ ఘనత అని అన్నారు. సీఎం కేసీఆర్‌ను ఇప్పుడు ఎవరు పడితే వాళ్లు సోషల్ మీడియాలో తిడుతున్నారని, మేం అలా పిచ్చిమాటలు మాట్లాడమని స్పష్టం చేశారు.
కేంద్రం అవార్డులు ఇస్తుంది.. పైసలు ఇస్తలేదు
‘కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సర్వేలు చేసి తెలంగాణ పల్లెలు బాగున్నాయంటూ అవార్డులు ఇస్తోంది. కానీ, పైసలు మాత్రం ఇస్తలేద’ని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఏటా పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లిస్తుంటే.. కేంద్రం వివిధ రూపాల్లో ఏటా రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే ఇస్తోందని అన్నారు. మిష¯Œ కాకతీయ ద్వారా చెరువులు బాగయ్యాయని నీతి ఆయోగ్ పేర్కొంటూ.. తెలంగాణకు రూ.24 వేలు కోట్ల సాయం అందించాలని సిఫారసు చేస్తే, 24 పైసలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కరోనా పేరుతో కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో కోత విధిస్తోందని అన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్లు ఆత్మగౌరవ ప్రతీక
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీక అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో 2.82 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రూ.18 వేల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నామని చెప్పారు. ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లు ఏడు ఇందిరమ్మ ఇళ్లతో సమానమని పేర్కొన్నారు. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని తెలంగాణలో అంటారని, ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తోందని, పెళ్లికి కల్యాణలక్ష్మి రూపంలో సాయం చేస్తోందని పేర్కొన్నారు. అప్పులు తెచ్చి రైతుబంధు ఇస్తున్నామని, ఆసరా పింఛన్లు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. వరి సాగులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉందన్నారు. రాష్ట్రం రాక ముందు... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలా ఉందో ప్రజలు ఒకసారి ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మ¯Œ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్స¯Œ న్యాలకొండ అరుణ, కలెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment