కేసీఆర్ జబర్దస్త్‌గా ఉన్నాడు.. రేపు మాపో పులి బయటికి వస్తుంది: మంత్రి కేటీఆర్‌ | Telangana IT Minister KTR Slams Revanth Reddy At Jayashankar Bhupalpally Meeting - Sakshi
Sakshi News home page

రేవంత్ రెడ్డి కాదు రేటెంత రెడ్డిగా మారాడు: మంత్రి కేటీఆర్‌

Published Mon, Oct 9 2023 3:43 PM | Last Updated on Mon, Oct 9 2023 4:08 PM

Minister KTR Slams Revanth Reddy At Bhupalpally Meeting - Sakshi

సాక్షి, భూపాలపల్లి: తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత డబుల్‌ బెడ్రూం ఇండ్లతోపాటు గృహలక్ష్మి, దళితబంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం తొలి బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. భూపాలపల్లిలోని సుభాష్‌ కాలనీ ప్రాంతంలో గల మినీ స్టేడియంలో నిర్వహించిన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జబర్దస్త్‌గా ఉన్నాడని పేర్కొన్నారు. ఇంట్లో కూర్చోని కూడా ప్రజల కోసం అన్ని చేస్తున్నాడని తెలిపారు. త్వరలో బయటికి వచ్చి అన్ని ప్రకటనలు చేస్తారని చెప్పారు.

సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ళలో చేసిన పనులు మీ కళ్ళ ముందున్నాయని ప్రజలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారని, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ అధికారం వస్తే మళ్లీ కష్టాలు వస్తాయని.. రైతుబంధుకు రామ్ రామ్.. దళిత బందుకు జై భీమ్ అంటారని ఎద్దేవా చేశారు.
చదవండి: రేపు తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్‌ షా.. పర్యటన షెడ్యూల్‌ ఇదే

గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్న దరిద్రం మళ్లీ తెలంగాణకు వస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేను మాత్రమే ఎన్నుకునేటివి కాదని.. కేసీఆర్‌ను సీఎంగా ఎన్నుకునే ఎన్నికలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఉన్నాడా?, కేసీఆర్‌తో పోటుపడేవారు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల్లో ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడని కేసీఆర్‌ను కొనియాడారు. 

కాంగెస్‌ వాళ్ళకు దిక్కు లేక డబ్బు సంచులతో నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన సన్నాసిని పట్టుకొని పీసీసీ పదవి ఇచ్చారు. ఆ మొగోడు చెబితే మనం ఓట్లేయాలట.  సోనియమ్మని బలి దేవత అన్నాడు. 1200 మందిని బలి తీసుకున్నవారు దేవత కాదు బలిదేవత అన్నాడు. రాహుల్ గాంధీ ముద్దపప్పు అన్నాడు. ఇప్పుడు ముద్దపప్పు కాదు.. సుద్ద పప్పు అంటున్నాడు. ఆయన మాటలు నమ్ముదామా?. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన థర్డ్ రేట్ దొంగ. క్రిమినల్ అలాంటి వారి చేతిలో రాష్ట్రాన్ని పెడదామా? 

మొన్న ఓటుకు నోటు ఈరోజు సీటుకో రేటు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు రేటెంత రెడ్డిగా మారారు. అలాంటి వాళ్ళ చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఆదానికో, అంబానికి అమ్మేస్తాడు. కాంగ్రెస్ హామీలను చూసి మా కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకుంటే పులి అవుతుందా?. రేపు మా పో పులి బయటికి వస్తుంది. కేసీఆర్ బయటికి వచ్చి ఏం చేయాలో స్వయంగా ఆయనే  చెబుతాడు.  ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలో తెలుసు. 

కేసీఆర్ క్రెడిబిలిటీ ఉన్న హిస్టరీ. ప్రజల మీద విశ్వాసం ఉన్న నాయకుడు. కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మద్దు. ఆగం కాకండి. ఆలోచించి కారు గుర్తుకే ఓటు వేయండి. మోసాన్ని మోసాన్ని జయించాలి. కాంగ్రెస్ వాళ్ళకు కర్నాటక నుంచి బీజేపీ వాళ్ళకు గుజరాత్ నుంచి డబ్బులు వస్తున్నాయి. డబ్బులు ఇస్తే తీసుకొండి. ప్రమాణం చేయిస్తే తుపాల్ తుపాల్ అని నీకే వేస్తామని చెప్పండి. కళ్ళ ముందు అభివృద్ధి ఉంది. గుండె నిండా సంక్షేమం ఉంది. ఆరు దశాబ్దాలుగా మోసం చేసి చావగొట్టినోడు మళ్ళీ వచ్చి ఏదో చెబుతే నమ్మి మోసపోకండి’ అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement