ఉనికే లేని ఓఆర్‌ఆర్‌కు ఉరా? | Minister Perni Nani Comments On Yellow Media | Sakshi
Sakshi News home page

ఉనికే లేని ఓఆర్‌ఆర్‌కు ఉరా?

Published Fri, Dec 17 2021 3:51 PM | Last Updated on Sat, Dec 18 2021 8:03 AM

Minister Perni Nani Comments On Yellow Media - Sakshi

సాక్షి, అమరావతి:గూగుల్‌ మ్యాప్‌లో విజయవాడ – గుంటూరు చుట్టూ ఓ గీత గీసి అవుటర్‌ రింగు రోడ్డు పేరుతో భ్రమలు కల్పించిన మాజీ సీఎం చంద్రబాబును నిలదీయాల్సిన ఈనాడు దినపత్రిక రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మండిపడ్డారు. ‘ఓఆర్‌ఆర్‌కు ఉరి’ శీర్షికన ఈనాడు దినపత్రిక ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండించారు. అసలు ఉనికే లేని అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు ఉరేయడం ఎలా సాధ్యమని ‘ఈనాడు’ చైర్మన్‌ రామోజీరావును ప్రశ్నించారు. అవుటర్‌ రింగు రోడ్డు నిర్మాణానికి అవసరమైన 8,213 ఎకరాలను సేకరించకుండా చంద్రబాబు సర్కారు చేతులెత్తేయడంతో కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారీని పక్కనపెట్టేసిందని గుర్తు చేశారు. తాటికాయంత అక్షరాలతో విషపు రాతలను అచ్చోసి చంద్రబాబును అధికారంలోకి తేవాలన్న ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. 

చదవండి: దుష్ప్రచారం తిప్పికొట్టాలి

ఓ వంతెన కట్టలేని చంద్రబాబు దార్శనికుడా?
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని మాట దేవుడెరుగు కనీసం రహదారిని కూడా చంద్రబాబు నిర్మించలేదు. ట్రాఫిక్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద సింగిల్‌ లేన్‌ ప్లైఓవర్‌ బ్రిడ్జి, కనకదుర్గ ప్‌లైవర్‌ను చంద్రబాబు ఐదేళ్లలో పూర్తి చేయలేకపోయారు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టగానే వీటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. బెంజ్‌ సర్కిల్‌ వద్ద రెండో ప్‌లైవర్‌ బ్రిడ్జిని కేంద్రంతో మంజూరు చేయించడమే కాకుండా రికార్డు సమయంలో పూర్తి చేసి ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించారు. అమరావతికి కరకట్ట మీదుగా నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. మచిలీపట్నం, కోల్‌కతా జాతీయ రహదారుల నుంచి వచ్చే వాహనాలను విజయవాడ మీదుగా కాకుండా బైపాస్‌లో మళ్లించేలా చినఅవుటపల్లి నుంచి కాజ వరకు బైపాస్‌ రహదారిని కేంద్రంతో మంజూరు చేయించారు. భూ సేకరణ వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రం చెరిసగం భరించేలా ఒప్పించారు. బైపాస్‌ శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో ఓఆర్‌ఆర్‌ మంజూరు చేయాలని కేంద్రాన్ని పదే పదే కోరారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రగతికి విఘాతం కలిగించే వ్యక్తిలా రామోజీరావుకు కనిపిస్తున్నారా? భ్రమల్లో బతికి మోసగించిన చంద్రబాబు దార్శనికుడా? చంద్రబాబు, లోకేష్‌పై ధృతరాష్ట్ర ప్రేమతో సీఎం వైఎస్‌ జగన్‌పై విషం చిమ్మొద్దు. ఆయన ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి.

అమరావతిని అనుసంధానిస్తూ కొత్త జాతీయ రహదారి
అమరావతిని రాజధానిగా సీఎం వైఎస్‌ జగన్‌ వద్దన్నారంటూ ఆంధ్రజ్యోతిని మించిపోయేలా ఈనాడు మరో తప్పుడు రాతలు రాసింది. రాజధానిగా అమరావతిని ప్రభుత్వం వద్దని అనలేదు. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధిని ఆపేసి కేవలం అమరావతి కోసమే మొత్తం నిధులను వెచ్చించడం సమ్మతం కాదు. అన్ని ప్రాంతాలను సమతుల్యంగా అభివృద్ధి చేస్తూనే శాసన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. జాతీయ రహదారులను అమరావతితో అనుసంధానం చేస్తూ సీఎం జగన్‌ కొత్తగా జాతీయ రహదారిని మంజూరు చేయించారు. మందడం తదితర గ్రామాలను జాతీయ రహదారితో అనుసంధానిస్తూ రహదారుల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. అమరావతి పాదయాత్రకు చేసిన ఖర్చును చంద్రబాబు రాజధానిలో వ్యయం చేసి ఉంటే కనీసం రహదారి సౌకర్యమైనా కలిగేది.

ఓఆర్‌ఆర్‌ సృష్టికర్త వైఎస్సార్‌
హైదరాబాద్‌ అభివృద్ధికి దిక్సూచిలా నిలుస్తున్న ఓఆర్‌ఆర్‌ ప్రణాళికను రూపొందించి రికార్డు సమయంలో పూర్తి చేసింది దివంగత వైఎస్సార్‌. ఓఆర్‌ఆర్‌ నిర్మిస్తున్న సమయంలో వైఎస్‌పై కూడా ఈనాడు విషం చిమ్మింది. ఇప్పుడు ఆ రహదారి హైదరాబాద్‌ ప్రగతికి బాటలు వేస్తోందని కథనంలో పేర్కొంది. తెలంగాణలో ఆర్‌ఆర్‌ఆర్‌ (రీజినల్‌ రింగ్‌ రోడ్డు) ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌తో హైదరాబాద్‌ అభివృద్ధిలో పరుగులు తీస్తుంటే అమరావతిలో ఉనికే లేని ఓఆర్‌ఆర్‌కు ఉరి వేయడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రగతికి విఘాతం కలుగుతోందంటూ తప్పుడు రాతలతో మరోసారి వక్ర బుద్ధి బయట పెట్టుకుంది.

చేనేతపై జీఎస్టీ పెంపు ఉపసంహరించుకోవాల్సిందే
చేనేత వస్త్రాలు, నూలుపై జీఎస్టీని కేంద్రం ఐదు నుంచి 12 శాతానికి పెంచడం అన్యాయం. తక్షణమే జీఎస్టీ పెంపును ఉపసంహరించుకోవాలి. చేనేత కార్మికుల సంక్షేమం కోసం సీఎం జగన్‌ పలు సంక్షేమ పథకాలు చేపట్టారు. చేనేతపై జీఎస్టీ పెంపును ఉపసంహరించుకోవాలని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో డిమాండ్‌ చేస్తాం. చేనేత కార్మికుల ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌.. ఓ కామెడి సినిమా..
పవన్‌ కళ్యాణ్‌ ఓ కామెడీ సినిమా లాంటి వ్యక్తి. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు రాజీనామా చేస్తే తానూ ఢిల్లీ వచ్చి ఉద్యమంలో పాల్గొంటానని గతంలో చెప్పారు.  హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే ఆయన ఆచూకీ లేదు. విశాఖ ఉక్కుపైనా పవన్‌ కళ్యాణ్‌ అదే కామెడీ చేస్తున్నారు. మొన్న పరిశ్రమ వద్ద.. నిన్న మంగళగిరిలో సినిమా చూపించారు. తాను ఈల వేస్తే ప్రధాని మోదీ, అమిత్‌ షా పనులు చేస్తారని చెప్పే పవన్‌ కళ్యాణ్‌ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని వారిని ఎందుకు అడగడం లేదు? ఆయన నటించిన సినిమాలను రాష్ట్రంలో ఉచితంగా ప్రదర్శించడం కాదు.. బ్లాక్‌లో టికెట్‌లు అమ్మకుండా చూస్తే చాలు. సినిమా టికెట్ల విషయంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement