బీఆర్‌ఎస్ సర్కారు నిర్వాకం వల్లనే పంచాయతీలకు ఇక్కట్లు
హరీశ్‌రావు వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఖండన
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. గత పదేళ్లలో గ్రామ పంచాయతీలకు నాటి ప్రభుత్వం రూ.10,170 కోట్లను కేటాయించినా కేవలం రూ.5,988 కోట్లనే విడుదల చేసిందని, చివరికి ఆ 44 శాతం నిధులను కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా తన సొంత అవసరాలకు వాడుకుందని ఆమె ఆరోపించారు. అలాంటి బీఆర్‌ఎస్ నేతలకు ఇప్పుడు మాట్లాడే హ క్కు ఎక్కడిదని సీతక్క నిలదీశారు.
స్వచ్ఛదనం– పచ్చదనం కార్యక్రమంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర సొంత ఆదాయంలో స్థానిక ప్రభుత్వాలకు 11 శాతం నిధులు కేటాయించాలని..అందులో నుంచి 61 శాతం నిధులను గ్రామ పంచాయతీలకు కేటాయించాలని ఆరి్ధక సంఘం సిఫార్సు చేస్తే...గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి గుర్తు చేశారు.
అప్పుడే వాటా ప్రకారం పంచాయతీలకు నిధులు ఇస్తే ఇప్పుడు సమస్యలు ఉండకపోయేవని పేర్కొన్నారు. ఇలా ఎన్నో రకాలుగా పంచాయతీలను గత ప్రభుత్వం పాడు చేయగా, ఇప్పుడు వాటిని సరిదిద్దే ప్రయత్నం తమ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని సీతక్క వివరించారు. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమంలో కనీసం పాల్గొనకుండా ఫక్తు రాజకీయాలు చేయడం హరీశ్‌రావు మానుకోవాలని సూచించారు.
3 రోజుల్లో...25 లక్షల మొక్కలు
రాష్ట్రంలో గత మూడురోజులుగా ’స్వచ్ఛదనం–పచ్చదనం’కొనసాగుతోంది. మంత్రులు మొదలుకుని ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ వర్గాల ప్రజలు, కలెక్టర్ల నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకు అధికారులు ఉత్సాహంగా స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొంటున్నారు. సోమవారం స్వచ్ఛదనం – పచ్చదనం ప్రారంభం కాగా... బుధవారం సాయంత్రం వరకు 25.55 లక్షల మొక్కలను నాటారు. 29,102 కిలోమీటర్ల మేర రహదారులను శుభ్రపరిచారు. 18,599 కిలోమీటర్ల మేర డ్రైనేజీలను శుద్ధి చేశారు. 50 వేల ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టారు. నీళ్లు నిలవకుండా 11,876 లోతట్టు ప్రాంతాలను గుర్తించి చదును చేశారు. బుధవారం ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment