సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులు వరి వేస్తే ఉరి అన్నది బీఆర్‌ఎస్ నేతలు కాదా అని ప్రశ్నించారు మంత్రి సీతక్క. అలాగే, రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి అని కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. తాజాగా సభలో మంత్రి సీతక్క.. బీఆర్‌ఎస్ నేతలకు కౌంటరిచ్చారు. సభలో సీతక్క మాట్లాడుతూ.. కౌలు రైతుల గురించి మీకు మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు ఉందా?. కౌలు రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలని అన్నది మీరు కాదా. అద్దె ఇంట్లో ఉన్నవాళ్లు ఓనర్ అవుతారా? అని అన్నది ఎవరు?. ఈ రాష్ట్రంలో భూముల పై సమగ్ర సర్వే జరగాలి.
వందల ఎకరాల్లో ఫాంహౌస్‌లు ఉన్నాయి. 5,6 లక్షల జీతాలు తీసుకునేవారు కూడా రైతుల ముసుగులో రైతుబంధు తీసుకున్నారు. గుట్టలు, రోడ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చింది. నిజంగా వ్యవసాయం చేసే కౌలు రైతులకు రైతుబంధు రాలేదు. బీఆర్ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదు.. పట్టా పెట్టుబడి. పట్టాలేని ఎంతో మంది రైతులకు రైతుబంధు రాలేదు. బీఆర్ఎస్ చేసింది రుణమాఫీ కాదు.. వడ్డీ మాఫీ. బీఆర్ఎస్ అందరికీ రుణమాఫీ చేస్తే.. ఇప్పుడు 30వేల కోట్ల రుణ భారం ఎందుకు ఉంది.
భూమి లేని పేదలకు మీరు ఏమిచ్చారు?. ఉచిత బస్సు సౌకర్యం ఇస్తే.. బీఆర్ఎస్ ఓర్వలేకపోతుంది. వందల ఎకరాల ఫౌంహౌస్‌లకు రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ అడుగుతుందా?. రైతు భరోసా ఎవరికి ఎంత పోతుంది అనేది అన్ని గ్రామాల్లో స్పష్టంగా వివరాలు ఉంచాలి అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment