తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆదివాసీలతో మమేకమై వారి కోసమే శ్రమిస్తారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ తిరుగులేని నేతగా ఎదిగారు. ఇప్పుడామె తన వారసుడి కోసం నియోజకవర్గాన్ని రెడీ చేస్తున్నారు. పార్టీ పెద్దల మద్దతుతో పక్క జిల్లా నుంచి కొడుకుని ఎన్నికల బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్క అంటే తెలియని వారు ఉండరు. రాజకీయాల్లో సీతక్క చెరగని ముద్ర వేసుకున్న ఆమె మావోయిస్టు ఉద్యమం నుంచి తెలుగుదేశం ద్వారా బహిరంగ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో ములుగు నుంచి గెలిచాక ఒక వెనుదిరిగి చూడలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రజల తలలో నాలుకలా వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే సీతక్క కాంగ్రెస్ అగ్ర నేతలతో కూడా సాన్నిహిత్యం పెంచుకున్నారు. తన రాజకీయ జీవితం సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న దశలోనే తన కుమారుడు సూర్యను కూడా ఎమ్మెల్యే చేయాలని అనుకుంటున్నారు. ఇందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాకను ఎంచుకున్నారు. అక్కడి నుంచి కుమారుడిని పోటీ చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు.
పినపాక నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన రేగా కాంతారావు గులాబీ గూటికి చేరడంతో అతనికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఈ దశలో సీతక్క కొడుకు సూర్య గత రెండేళ్లుగా పినపాక నియోజకవర్గంలోనే మకాం పెట్టారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులతో సీతక్కకు ఉన్న సత్సంబధాలతో ఎమ్మెల్యే పార్టీ మారినా కేడర్ దూరం కాకుండా కాపాడుకుంటు వచ్చారు.
ఈ నేపథ్యంలో సూర్య పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌కు దగ్గరయ్యారు. సీతక్క సైతం తరచుగా పినపాకకు వెళ్లి వస్తున్నారు. ఒకదశలో సీతక్క పినపాక నుంచి పోటి చేస్తుందనే ప్రచారం జరిగింది. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావుకు చెక్ పట్టేందుకు రేవంత్ రెడ్డి వ్యూహత్మకంగా సూర్యను బరిలో దించే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినబడుతోంది. రేగా కాంతారావు బీఆర్ఎస్ లోకి రావటంతో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గులాబీ గూటిలో ఇమడలేక పోతున్నారు. ఆయననే కాంగ్రెస్ నుంచి బరిలో దించుతారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి సూర్యకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించే బాధ్యత కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తోంది.
ములుగు ఎమ్మెల్యే సీతక్క దూకుడుకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల్లో సీతక్క ప్రభావం పెరుగుతుండటంతో గులాబీ పార్టీలో గుబులు రేపుతుంది. కనీసం పది, పదిహేను స్థానాల్లో సీతక్క ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో వ్యూహాత్మకంగా ములుగుకే సీతక్కను పరిమితం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
చదవండి: గులాబీ ఎమ్మెల్యే ఎందుకు టెన్షన్‌లో ఉన్నారు?.. అక్కడ ఇదే హాట్ టాపిక్
అయితే ములుగులో సీతక్కను ఢీ కొట్టగల సరైన అభ్యర్థి బీఆర్ఎస్‌కు కానరావడం లేదు. దీంతో ములుగు నుంచి రెండు సార్లు గెలిచి ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్న పోదెం వీరయ్యకు గులాబీ పార్టీ గాలం వేసింది. పలుమార్లు చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.
అయితే కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడితో వీరయ్య వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ వీరయ్య బీఆర్ఎస్‌లోకి రాకపోతే మంత్రి సత్యవతి రాథోడ్‌ను ములుగు బరిలో దించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. అంతేకాకుండా మావోయిస్టు కుటుంబ నేపథ్యం ఉన్న ములుగు జడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పేరు కూడా వినిపిస్తోంది. ఏజెన్సీ ఏరియాలో సీతక్క ప్రభావం పెరుగుతుండటం.. ఆమె వారసుడు రాజకీయ అరంగేట్రం చేస్తుండటంతో ఏజెన్సీ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
చదవండి: సిద్దిపేట: టీఆర్‌ఎస్ పేరుతో మరో కొత్త పార్టీ..
Comments
Please login to add a commentAdd a comment