Munugode By Election 2022 Polling Live Updates - Sakshi
Sakshi News home page

Munugode Bypoll 2022: మునుగోడులో ముగిసిన పోలింగ్‌... 90 శాతానికిపైగా ఓటింగ్‌

Published Thu, Nov 3 2022 5:13 AM | Last Updated on Fri, Nov 4 2022 1:00 AM

Munugode Assembly By Election 2022 Live Updates - Sakshi

90శాతానికిపైగా..

  • మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో 92 శాతం ఓటింగ్ నమోదైంది.

Time: 6: 01PM

   • మునుగోడులో పోలింగ్‌ ముగిసింది. ఇంకా చాలాచోట్ల ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. 

Time: 5:26PM

  • సాయంత్రం ఐదు గంటల వరకూ 77.55 శాతం పోలింగ్‌

Time: 4:00PM

  • నల్లగొండ జిల్లా కొరిటికల్‌లో ఉద్రిక్తత
  • టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ
  • నాన్‌ లోకల్స్‌ తిరుగుతున్నారని బీజేపీ ఆరోపణ
  • పోలీసులతో బీజేపీ కార్యకర్తల వాగ్వాదం, లాఠీచార్జ్‌
     

Time: 3:20PM
మధ్యాహ్నం మూడు గంటల వరకు 59.92 శాతం పోలింగ్‌

Time: 01:20 PM
మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.3 శాతం పోలింగ్‌ నమోదైంది.

Time: 12:05 PM
ఫేక్‌ న్యూస్‌ను నమ్మొద్దు: రాజగోపాల్‌రెడ్డి
తనపై ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తున్నారని.. సోషల్‌ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధర్మం వైపే మునుగోడు ప్రజలు నిలుస్తారన్నారు.

Time: 11:45 AM
ఈసీకి ఫిర్యాదు చేశా.. పాల్వాయి స్రవంతి
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. ఫేక్‌ న్యూస్‌పై ఈసీకి ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు. మార్ఫింగ్‌ ఫొటోతో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసున్నారని తెలిపారు. దుష్ప్రచారం చేసిన వారికి నోటీసులు పంపిస్తానని స్రవంతి తెలిపారు.

Time: 11:19 AM
ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్‌ నమోదైంది. మునుగోడులో జోరుగా పోలింగ్‌ సాగుతుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

Time: 10:32 AM
పోలింగ్‌ బూత్‌ వద్ద అపశ్రుతి
చండూరు పోలింగ్‌ బూత్‌ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. పోలింగ్‌ సెంటర్‌ గేట్‌ వద్ద పైపుల్లో మహిళ కాలు ఇరుక్కుపోయింది. స్థానికులు మహిళను రక్షించారు.

Time: 9:42 AM
చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత
చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికేతర టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారని బీజేపీ ఆందోళనకు దిగింది. మర్రిగూడలో టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాన్‌ లోకల్స్‌ ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

Time: 9:40 AM
11.2 శాతం పోలింగ్‌..
ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్‌ నమోదైంది. సంస్థాన్‌ నారాయణపురం మండలం గుజ్జలో ఈవీఎం మొరాయించింది. ఓటేసేందుకు ఓటర్లు నిరీక్షిస్తున్నారు.

Time: 9:23 AM
కాంగ్రెస్‌ కార్యకర్తల ఆందోళన
మునుగోడు పోలింగ్‌ బూత్‌ వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంస్థాన్‌ నారాయణపురంలో పోలింగ్‌ను సీపీ మహేష్‌ భగవత్‌ పరిశీలించారు.

Time: 9:19 AM
టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం
మర్రిగూడలో టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాన్‌ లోకల్స్‌ ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.

Time: 9:08 AM
కొంపల్లిలో ఈవీఎంల మొరాయింపు
మునుగోడు మండలం కొంపల్లిలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు నిరీక్షిస్తున్నారు. రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించాయని ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించామన్నారు. చెకింగ్‌  పాయింట్స్‌ వద్ద లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు.

Time: 9:03 AM
ఈవీఎంల వద్ద ఒకరి కంటే ఎక్కువ ఓటర్లు..
వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ను ఈసీ పరిశీలిస్తున్నారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంల వద్ద ఒకరి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు ఈసీ గమనించారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ఈవీఎంల వద్ద ఒక్క ఓటరు మాత్రమే ఉండాలని ఆదేశించారు.

Time: 8:57 AM
ఓటు హక్కు వినియోగించుకున్న పాల్వాయి స్రవంతి
చండూరు మండలం ఇడికూడలో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, చౌటుప్పల్‌ మున్సిపల్‌​ పరిధిలో పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది.

Time: 8:27 AM
పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన రాజగోపాల్‌రెడ్డి
మునుగోడులో పోలింగ్‌ కేంద్రాలను బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. అనంతరం నాంపల్లి మండలంలో పోలింగ్ కేంద్రాలని పరిశీలించనున్నారు.

Time: 8:19 AM
ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి
సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారి గూడెంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Time: 8:12 AM
మునుగోడు శివాలయంలో రాజగోపాల్‌రెడ్డి పూజలు
మునుగోడు శివాలయంలో బీజేపీ అభ్యర్థి  రాజగోపాల్‌రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం మునుగోడులోని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని  పరిశీలించనున్నారు. అనంతరం నాంపల్లి మండలంలో పోలింగ్ కేంద్రాలని పరిశీలించనున్నారు.

Time: 8:05 AM
స్థానికేతరులు గుర్తింపు
యాదాద్రి: పుట్టపాకలో స్థానికేతరులను అబ్జర్వర్‌ గుర్తించారు. నగదు ఇతర సామాగ్రీ స్వాధీనం చేసుకున్నారు.

Time: 7:39 AM
బారులు తీరిన ఓటర్లు
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతుంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

Time: 7:21 AM
​కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్‌
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతుంది. పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నారు. మనుగోడులో మొత్తం ఓటర్లు 2,41,805 కాగా, పురుషులు 1,21,672.. మహిళలు 1,20,126.. అన్ని బూత్‌లలో వెబ్‌ క్యాస్టింగ్‌ ఏర్పాటు చేశారు.

Time: 7:00 AM
పోలింగ్‌ ప్రారంభం
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఉప ఎన్నిక  బరిలో  47 మంది అభ్యర్థులు ఉన్నారు.మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఆర్‌ఏఎఫ్‌ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్‌ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్‌ మండలాల పరిధిలో 82 పోలింగ్‌ కేంద్రాలలో 122 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. మొబైల్‌ స్ట్రయికింగ్‌ ఫోర్స్, స్పెషల్‌ స్ట్రయికింగ్‌ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు కూడా విధులలో పాల్గొంటున్నాయి.

Time: 6:30 AM
మాక్‌ పోలింగ్‌ ప్రారంభం
కాసేపట్లో మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఉప ఎన్నిక  బరిలో  47 మంది అభ్యర్థులు ఉన్నారు.మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాంపల్లి మండలం పోలింగ్‌ బూత్‌ 294లో ఈవీఎం మొరాయించింది. మిగతా బూత్‌లలో మాక్‌ పోలింగ్‌ ప్రారంభమైంది.

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు ముందురోజైన బుధవారం ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. ఇదే చివరి అవకాశమంటూ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు ఇతర అభ్యర్థులు వీలైనంత మేర ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా మద్యం, డబ్బు పంపిణీ అయిందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారం నేపథ్యంలో తమకు ఇస్తానని చెప్పినంత నగదు ఇవ్వలేదంటూ, ఆ మేర ఇప్పించాలంటూ పలుచోట్ల ఓటర్లు ఆందోళనకు దిగడం కూడా కనిపించింది.

ఉప ఎన్నిక ప్రక్రియ ఊపందుకున్న నాటి నుంచీ ప్రలోభాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలను రుజువు చేస్తూ చాలాచోట్ల నగదు, మద్యం పట్టుబడటం గమనార్హం. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారమే నియోజకవర్గంలో మొత్తం 20 కోట్ల విలువైన నగదు, మద్యం పట్టుబడ్డాయి. 

రోజంతా అదే ‘రచ్చ’.. 
మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నెలరోజులుగా నియోజకవర్గంలో హడావుడి నెలకొంది. ఎన్నికల ప్రచారంతోపాటు సభలు, సమావేశాల పేరిట రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి. ప్రచారానికి వచ్చేందుకు ఒకరికి ఇంత అంటూ డబ్బులు ముట్టజెప్పడం ఓవైపు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలు ఎరవేయడం మరోవైపు కొనసాగాయి. చికెన్, మటన్‌తోపాటు ఇంటింటికీ మద్యం బాటిళ్లు, కూల్‌డ్రింకులు, నగదు, పార్టీలు చేసుకునే వారికి అదనంగా లిక్కర్‌ సరఫరా జరిగాయి.

పెద్ద నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు, భారీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేశారని క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఫలానా పార్టీ ఓటుకు ఇంత ఇస్తుందనే ప్రచారం ముందు నుంచే విపరీతంగా జరిగింది. దీనితో చాలామంది ఓటర్లు ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూడటం కనిపించింది. అయితే పోలింగ్‌కు ముందు రోజు రాజకీయ పార్టీలు తమ టార్గెట్‌ మేరకు నగదు పంపిణీ చేసినట్టు తెలిసింది. ఓటుకు రూ.1,000 నుంచి రూ.6వేల వరకు ముట్టజెప్పారనే ప్రచారం జరుగుతోంది. 

బయట వారికోసం భారీ ఏర్పాట్లు 
నియోజకవర్గానికి బయట, ముఖ్యంగా హైదరాబాద్‌లో నివాసమున్న ఓటర్ల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. కొందరు ఓటర్లకు కలిపి ఓ వాహనం ఏర్పాటు చేయడం, దారిఖర్చులతోపాటు ఓటు వేసేందుకు నగదు ఇవ్వడం ద్వారా ఓట్లు సమీకరించుకునేందుకు ఏర్పాట్లు జరిగాయి. స్థానిక నాయకులతోపాటు హైదరాబాద్‌లో నివాసం ఉండే నేతలు ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతలు తీసుకున్నారు. రాజకీయ పార్టీలు నగదు, మద్యం, దారి ఖర్చులు, వాహనాల ఖర్చులను అందుకున్న ఓటర్లు పోలింగ్‌ బూత్‌కు వచ్చి ఓటేసే బాధ్యతను కొందరు నాయకులకు అప్పగించాయి. 

స్థానిక నేతలపై ఒత్తిళ్లు 
ప్రచారం గడువు ముగిసిన తర్వాత బయటి నుంచి వచ్చిన నాయకులు వెళ్లిపోవడంతో స్థానికంగా ఉన్న నేతలపై ఒత్తిడి పెరిగింది. ఇన్నాళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు, బడా నేతలు ఉన్నందున తాము అడగలేకపోయామని, ఇప్పుడు ఓటుకింత ఇస్తేనే ఓటేస్తామని కొందరు స్థానిక నేతలపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. స్థానిక నేతలు ఈ విషయాన్ని పైకి చేరవేసి.. వారి సూచనల మేరకు వివిధ స్థాయిల్లో నగదు పంచినట్టు సమాచారం. కొన్నిచోట్ల అనుకున్న సమయానికి నగదు రాకపోవడం, ఓటర్ల నుంచి ఒత్తిడి పెరగడం తమకు తలనొప్పిగా మారిందని.. ఎలాగోలా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చిందని కొందరు స్థానిక నేతలు వాపోవడం గమనార్హం.

మొత్తమ్మీద ధూంధాంగా సాగిన ఉప ఎన్నికల ప్రచారం ముగియడం, పోలింగ్‌కు సమయం ఆసన్నమవడంతో అంతటా ఆసక్తి నెలకొంది. గురువారం ఉదయం నుంచి మొదలయ్యే ఓటింగ్‌ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాజకీయ పార్టీలు, నేతల ప్రలోభాలు ఏ మేరకు ఓటర్లపై ప్రభావం చూపుతాయి, ఎవరిని విజయం వరిస్తుందన్నది ఈ నెల 6న తేలనుంది.

ఏర్పాట్లు పూర్తి..
గురువారం జరిగే పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిక జరిగేలా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తును, పోలింగ్‌ సరళిని పర్యవేక్షించడానికి రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌, అన్ని పోలింగ్‌ కేంద్రాలలో ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను  ఏర్పాటు చేశారు.

బందోబస్తులో 2 వేల మంది..
పోలింగ్‌ కేంద్రాల వద్ద మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఆర్‌ఏఎఫ్‌ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్‌ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్‌ మండలాల పరిధిలో 82 పోలింగ్‌ కేంద్రాలలో 122 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. మొబైల్‌ స్ట్రయికింగ్‌ ఫోర్స్, స్పెషల్‌ స్ట్రయికింగ్‌ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు కూడా విధులలో పాల్గొంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement