లోకేష్‌కు కొత్త టెన్షన్‌.. చంద్రబాబు ప్లాన్‌ అదేనా? | Nara Lokesh Will Absent From TDP And Janasena Alliance Meetings | Sakshi
Sakshi News home page

లోకేష్‌కు కొత్త టెన్షన్‌.. చంద్రబాబు ప్లాన్‌ అదేనా?

Published Sun, Mar 3 2024 9:18 AM | Last Updated on Sun, Mar 3 2024 9:18 AM

Nara Lokesh Will Absent From TDP And Janasena Alliance Meetings - Sakshi

టీడీపీ-జనసేన కూటమి మొదటి ఉమ్మడి సభకు నారా లోకేష్ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏదైనా నిగూఢమైన పని కోసం లోకేష్‌ను ఎక్కడికైనా పంపడం వల్ల  రాలేదా? లేక  లోకేష్‌ సభకు వస్తే జనసైనికులు మండిపడతారని వద్దన్నారా అనే చర్చ సాగుతోంది.

రెండు పార్టీలు కలిసి నిర్వహించిన తొలి సభకు ప్రజా స్పందన పేలవంగా ఉండడంతో టీడీపీ, జనసేన శ్రేణుల్లో  నైరాశ్యం అలుముకుంది. ఒక పక్క వైఎస్సార్‌సీపీ నాయకత్వం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేసేందుకు  ఏర్పాటు చేసిన సిద్ధం సభలకు జనసునామీ పోటెత్తుతున్నారు. తాడేపల్లిగూడెం సభ టీడీపీ, జనసేన పార్టీలకు ఇస్తున్న సంకేతాలేంటి?..

తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత మొట్ట మొదటి సారి రెండు పార్టీలూ కలిసి ఉమ్మడిగా నిర్వహించిన బహిరంగ సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు, ఆయన రాజకీయ వారసుడైన నారా లోకేష్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో  చర్చకు దారి తీస్తోంది. చంద్రబాబు టీడీపీకి జాతీయ అధ్యక్షుడు కాగా నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. అంత కీలక పదవిలో ఉన్న లోకేష్ ఎన్నికల ముందు పార్టీ నిర్వహించిన కీలక సభలో లేకపోవడం వెనుక ఏదో ఒక ఆంతర్యం ఉందన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అసలు పుత్రుణ్ని పక్కన పెట్టి దత్త పుత్రుణ్ని వేదిక ఎక్కించారంటూ రాజకీయ ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తున్నారు.

నారా లోకేష్ గైర్హాజరీకి కారణాలేంటన్న అంశంపై అటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ చర్చ జరుగుతోందంటున్నారు. టీడీపీ వర్గాల వాదన బట్టి నారా లోకేష్ ఈ సభకు హాజరైతే జనసైనికుల నుండి తీవ్ర స్థాయిలో నిరసన ఎదుర్కోవలసి వస్తుందని చంద్రబాబు భయపడ్డారని అంటున్నారు. అందుకే ఈ సభకు లోకేష్‌ను రావద్దని బాబే చెప్పారని అంటున్నారు. టీడీపీ సభలకు మాత్రమే లోకేష్‌ను పరిమితం చేసి టీడీపీ-జనసేనల ఉమ్మడి సభలకు చంద్రబాబు, పవన్ మాత్రమే హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వారు చెబుతున్నారు. ఎన్నికల నగారా మోగిన తర్వాత రెండు పార్టీల ఉమ్మడి సభలు మరికొన్ని జరుగుతాయి. వాటిలోనూ లోకేష్ కనిపించరని అంటున్నారు.

ఒకటి మాత్రం వాస్తవం. నారా లోకేష్‌పై మెజారిటీ జనసైనికులు పీకలదాకా కోపంగా ఉన్నారు. అందులో అనుమానమే లేదు. దానికి కారణం కూడా ఉంది. టీడీపీ-జనసేన పొత్తు ఖరారు అయిన తర్వాత ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాలోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు? అని యాంకర్ ప్రశ్నించగా.. అందులో రెండో ఆలోచనకు ఆస్కారమే లేదన్నారు లోకేష్. మా కూటమిలో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అభ్యర్ధి అన్నారు. పోనీ.. పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం అభ్యర్ధిగా భావించ వచ్చా? అని ప్రశ్నించారు. దానికి కూడా లోకేష్ తడుముకోకుండా డిప్యూటీ సీఎం ఎవరనేది పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించి చంద్రబాబు నాయుడే ప్రకటిస్తారని అన్నారు. 

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవికే కాదు డిప్యూటీ సీఎం పదవికి కూడా పనికిరారన్నట్లు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు జనసేన నేతల్లో మంట పుట్టించాయి. దీంతో, లోకేష్‌పై వారు నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలోనూ దీనిపై  విమర్శలు వెల్లువెత్తాయి. సరిగ్గా ఈ సమయంలోనే జనసేన మద్దతుదారు అయిన చేగొండి హరిరామ జోగయ్య ఓ లేఖ రాశారు. పవన్‌ను ముఖ్యమంత్రిని చేస్తామని చంద్రబాబు చేత ప్రకటన చేయించాలని అందులో కోరారు. మరోవైపు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని జనసేనలోకి ఆహ్వానించిన జనసైనికులను ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ అధికారంలో జనసేనకు వాటా ఇస్తామన్న గ్యారంటీ ఏమన్నా చంద్రబాబు ఇచ్చారా? అని ప్రశ్నించారు. మాకు తెలీదని వారనగానే అది తేల్చుకుని రండి అప్పుడే నేను పార్టీలో చేరతానన్నారు.

ఈ పరిణామాల తర్వాత నారా లోకేష్‌పై జనసైనికులు కోపంగా ఉన్నారు. ఇది కాకుండా చంద్రబాబకు చెందిన స్కిల్ స్కాం కేసు విచారణ ఇంకా జరుగుతోంది. దాని విషయంలో న్యాయవాదులను మానిటర్ చేయడానికి లోకేష్‌ను పంపి ఉండవచ్చని అందుకే ఆయన ఉమ్మడి సభకు రాలేదని మరో ప్రచారం జరుగుతోంది. ఇక నిన్న కాక మొన్న జనసేనకు 24 స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించిన తర్వాత టీడీపీ వైఖరిపైనా వారు  ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 

ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా నిర్వహించిన మొదటి సభలో లోకేష్ ఉంటే జనసైనికులు, పవన్ అభిమానులు రాద్ధాంతం సృష్టించి నిరసనలు వ్యక్తం చేసే అవకాశాలున్నాయని చంద్రబాబు భయపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటికి తోడు తాడేపల్లిగూడెం సభకు ఆరు లక్షల మంది వస్తారని టీడీపీ-జనసేన నేతలు ప్రకటించగా అరవై వేల మంది కూడా రాకపోవడంతో చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ కూడా కుతకుత లాడిపోతున్నారని అంటున్నారు. లోకేష్‌ను రానున్న ఉమ్మడి సభలకూ దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement