
రాజ్‌నాథ్, అమిత్ షాలతో కలిసి సమావేశానికి వస్తున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాల వ్యవహార శైలిపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులను ఆమోదిస్తున్నప్పుడు సభలో కాగితాలు చించిపారేయడం, ప్రభుత్వాన్ని కించపర్చేలా మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. ప్రతిపక్షాలు శాసన వ్యవస్థను, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయని ఆరోపించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని, అర్థవంతమైన చర్చలు జరగడం విపక్ష సభ్యులకు ఇష్టం లేదని దుయ్యబట్టారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పని చేస్తున్నామని, జనం బాగు కోసమే బిల్లులను తీసుకొస్తున్నామని తెలిపారు. పెగసస్ అంశంతోపాటు కొత్త సాగు చట్టాలపై విపక్ష సభ్యులు పార్లమెంట్ ఉభయ సభను స్తంభింపజేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, వి.మురళీధరన్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌లో అనుచిత ప్రవర్తన పట్ల ప్రతిపక్షాలు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయకపోవడం విచారకరమని ప్రధాని అన్నారని తెలిపారు. విపక్షాలు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాయని, కొందరు ప్రతిపక్ష నేతలు పార్లమెంటరీ ప్రక్రియకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. విపక్ష సభ్యులు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలంటూ తమకు ప్రధాని సూచించారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment