అధిర్ రంజన్ చౌదరి.. పక్కన సోనియా(పాత చిత్రం)
సాక్షి, ఢిల్లీ: కేంద్రం వైఖరి పట్ల నిరసనల్లో భాగంగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశిస్తూ ‘రాష్ట్రపత్ని’ అని పేర్కొనడం ద్వారా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ కామెంట్లపై భగ్గుమంటున్న బీజేపీ నేతలు.. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా..
అధిర్ రంజన్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. అధిర్ రంజన్ చౌదరికి నోటీసులు జారీ చేసింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని, వ్యాఖ్యల పట్ల లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఆగస్టు 3వ తేదీ ఉదయం 11.30 గంటలకు విచారణ ఉంటుందని తెలిపింది.
అంతేకాదు, జాతీయ మహిళా కమిషన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా లేఖ రాసింది. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన అధిర్ రంజన్ చౌదరిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
‘అధిర్ రంజన్‌వి దిగజారిన వ్యాఖ్యలే. ఆయన చేసినవి ముమ్మాటికీ సెక్సీయెస్ట్ కామెంట్లే. అవి ఆయన మైండ్‌సెట్‌ను ప్రతిబింబిస్తున్నాయని జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ చెప్తున్నారు. అధిర్ రంజన్.. రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలి. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనపై చర్యలు తీసుకోవాలి’ రేఖా శర్మ కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment