రాష్ట్రంలో రోజురోజుకి దిగజారుతున్న టిడిపిని పూర్తిగా దెబ్బతీసేందుకు బిజెపి వ్యూహం రచిస్తున్నట్టుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ పార్టీ ప్రతిపక్ష స్ధానంపై బిజెపి కన్నేసినట్టు కనబడుతోంది. ఇందుకోసమే ఎన్డిఎ సమావేశానికి పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందిందా అనే సందేహం కలుగుతోంది. ఎన్నికల వేళ బిజెపి హైకమాండ్ పవన్ కళ్యాణ్ కి ఎటువంటి రూట్ మ్యాప్ ఇవ్వబోతోందనేది ఆసక్తికరంగా మారింది. బిజెపి, జనసేన పార్టీలు ఇకపై కలిసికట్టుగా జనంలోకి వెళ్లబోతున్నాయా అనేది తేలాల్సి ఉంది.
ఎన్డిఎ సమావేశానికి జనసేనకి ఆహ్వానం అందడం ఎపి రాజకీయాలలో చర్చకి దారితీస్తోంది.. ఎపిలో సంవత్సరాలుగా మిత్రపక్షాలుగా ఉన్న బిజెపి, జనసేన పార్టీల మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎన్డిఎ సమావేశానికి ఏనాడూ హాజరుకాలేదు. బిజెపి అధిష్టానం కూడా ఆయనను ఏనాడూ పిలవలేదు. జనసేనకి పార్లమెంట్ లో స్ధానం లేకపోవడం వల్లే ఆహ్వానం పంపలేదని బిజెపి వైపు నుంచి వచ్చే సమాధానం.
(చదవండి: ఆ దమ్ము లేని పవన్‌కు రాజకీయాలు ఎందుకు?)
కానీ ఇపుడు ఎపిలో ఎన్నికలకి కొన్ని నెలలే సమయముండటంతో బిజెపి అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత నాలుగేళ్లగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిలపడిన పరిస్ధితి. వైఎస్సార్ సిపి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటూ జాతీయ స్ధాయి సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇటువంటి పరిస్ధితులలో ప్రజాపక్షం వహించడంలో విఫలమైన టిడిపి స్ధానాన్ని భర్తీ చేయాలని బిజెపి భావిస్తోంది.
గడిచిన కొన్ని నెలలుగా ఎపి బిజెపి సొంతంగానే ఆంద్రప్రదేశ్ లో ఎదగడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వంపై ఛార్జ్ షీట్, రాయలసీమ, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్ ల సందర్శన, ఉత్తరాంధ్ర జనంకోసం జల పోరు యాత్ర, ప్రజాపోరు పేరుతో స్ట్రీట్ కార్నర్ సమవేశాలు, రాయలసీమలో రణభేరి పేరుతో బహిరంగ సమావేశాలతో జనంలో ఉండేందుకు ప్రయత్నించారు.
ఈ నేపధ్యంలోనే బిజెపి మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపితో కలిసి వెళ్లటంపై బహిరంగంగానే పలు మార్లు మాట్లాడారు. బిజెపి మాత్రం గతంలో టిడిపితో కలిసి వెళ్లి భంగపడిన విషయాలని ఇంకా మరువలేదు. టిడిపితో కలిసి వెళ్లడం వల్ల ఎపిలో పార్టీ బలపడదని బిజెపి గట్టిగా విశ్వసిస్తోంది. గతంలో టిడిపితో పొత్తులవల్ల బిజెపి నష్టపోయిన విషయాలని గుర్తు చేసుకుంటున్నారు పార్టీ నాయకులు.
(చదవండి: ఎన్డీయే కూటమిలో చేరిన మరో కీలక పార్టీ..)
అందుకే ఈసారి ఎన్నికల పొత్తులపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పొత్తుల విషయాన్ని కేంద్ర పార్టీ నిర్ణయిస్తుందని. టిడిపితో కలిసి వెళ్లేందుకు సిద్దంగా లేమని ఎపి బిజెపి నేతలు నర్మగర్బంగానే చెబుతున్నారు. నిన్న బిజెపి రాష్ట్ర పధాదికారుల సమావేశంలోనూ ఇదే విషయం చర్చకి వచ్చింది. పొత్తులపై పార్టీ లైన్ దాటవద్దని నేతలకి పధాదికారుల సమావేశంలో పాల్గొన్న ఢిల్లీ పెద్దలు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతం, కమిటీల పున:నియామకాలపైనే చర్చించినట్లు తెలుస్తోంది.
ఎపి బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉన్నంత వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆయనకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్ధితి ఉండేది. ఎపి నేతలకంటే కేంద్ర నేతలతోనే తనకి పరిచయాలు ఎక్కువనీ పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పుకునేవారు. ఇపుడు అధిష్టానం సోము స్ధానంలో పురందేశ్వరిని తీసుకువచ్చింది. అలాగే గతంలో ఎన్నడూ ఎన్డిఎ సమావేశానికి పిలవని బిజెపి హైకమాండ్ ఇపుడు పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించింది.
మళ్లీ కేంద్రంలో ఎన్డిఎ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎపిలో బలపడటంపైనా దృష్డిపెట్టనున్నారు. ఇక టిడిపి జపం చేస్తున్న పవన్ కళ్యాణ్ కి సైతం బిజెపి హైకమాండ్ ఎపిలో బలపడటంపైనే ప్రత్యేక సూచనలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాబోయే ఆరేడు నెలలు పాటు జనసేన, బిజెపి ఉమ్మడి కార్యచరణ రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టిడిపితో కలిసి పోటీచేస్తే టిడిపికి బలం పెరుగుతుంది తప్ప జనసేన, బిజెపిలకి కాదనే విషయాన్ని స్పష్టం చేయనున్నట్లు సమాచారం. అందుకే పార్టీని బలోపేతం చేసుకోవడం ద్వారా అధికారానికి దగ్గర కావాలనే ఆలోచన చేయనున్నారు. అందులో భాగంగానే టిడిపి స్ధానాన్ని భర్తి చేయడంపై దృష్టిపెట్టనున్నారు. అలాగే హైకమాండ్ సూచనల మేరకు నెలాఖరులోపు ఎపి బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు భేటీ అయి ఉమ్మడి కార్యచరణకోసం చర్చించనున్నట్టు సమాచారం.
ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ కి బిజెపి హైకమాండ్ ఎటువంటి రూట్ మ్యాప్ ఇవ్వబోతోందని ఆసక్తికరంగా మారింది. మరి ఈ సమయంలో చంద్రబాబు దత్తపుత్రుడిగా ముద్రపడ్డ పవన్ కళ్యాణ్ పొత్తులపై పునరాలోచన చేస్తారా... బిజెపితో కలిసి ముందుకు వెళ్లేందుకే ప్రాధాన్యతనిస్తారా చూడాలి!
(చదవండి: ఏపీ పాలిటిక్స్‌పై పూనమ్ ట్వీట్.. ఆమెపై బూతులతో రెచ్చిపోతున్న ఆయన ఫ్యాన్స్)
Comments
Please login to add a commentAdd a comment