సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మలివిడత అభ్యర్థుల జాబితా ప్రకటన నేపథ్యంగా సాగిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం ముగిసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన శుక్రవారం ఉదయం గంటన్నర పాటు సమావేశమైన సీఈసీ 53 స్థానాల అభ్యర్థుల జాబితాకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే..
అభ్యర్థుల ప్రకటన విషయంలో కాంగ్రెస్ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. వామపక్షాలకు కేటాయించే స్థానాలతో పాటు మొత్తం 11 స్థానాలు పెండింగ్‌లో ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహన్‌కు కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన సూచనల మేరకే అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది.
అంతా సవ్యంగా ఉందనుకున్న సెగ్మెంట్లకు నేటి జాబితాలో చోటు దక్కినట్లు సమాచారం. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ మొత్తం అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ.. చౌహన్ కమిటీ సూచన మేరకు విడతల వారీగా ఈ నెల 31 లోపు పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఆలస్యమైనా ఆచితూచే అభ్యర్థుల ప్రకటన చేయాలనుకుంటున్న కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం ఆశావహుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment