వాలంటీర్లపై నిమ్మగడ్డ ఫిర్యాదు
సీఈవోకు లేఖ రాసిన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్
సాక్షి, విజయవాడ: ప్రజలతో నిత్యం మమేకమై సేవలందిస్తూ.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న వలంటీర్ వ్యవస్థను దెబ్బకొట్టడమే లక్ష్యంగా పచ్చ బ్యాచ్ ప్రయత్నాలు సాగుతున్నాయి. వృద్ధులు, వికలాంగుల పట్ల కనికరం కూడా లేకుండా, ప్రజలకు జరుగుతున్న మంచిని చూడకుండా వలంటీర్లపై విషం కక్కుతున్నారు.
డబ్బులు చేతికి ఇవ్వొద్దు, అకౌంట్లలో వేయాలంటూ సీఈవోకు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ‘‘అకౌంట్ ఉన్న వాళ్లు తీసుకుంటారు. అకౌంట్ లేదంటే.. పెన్షనర్లే వెళ్లి డబ్బులు తెచ్చుకుంటారు. పెన్షనర్ల దగ్గరకు వెళ్లి వాలంటీర్లు డబ్బులు అందించడం వద్దు. పింఛన్ పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలి’’ అంటూ వలంటీర్లపై నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటనల రూటులోనే నిమ్మగడ్డ వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
శభాష్ వలంటీర్..
కరోనా వైరస్ భయపెడుతున్నా... వరద వణికిస్తున్నా... ప్రతిపక్షాలు వెక్కిరిస్తున్నా.. వలంటీర్లు వెన్నుచూపలేదు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కరోనా కష్టకాలంలో అందరూ ఉన్నా ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నవారి వద్దకు వెళ్లి భరోసా కల్పించారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. వాన వచ్చినా... వరద వచ్చినా ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారకముందే అవ్వతాతల ఇంటి తలుపుతట్టి పింఛను అందిస్తున్నారు.
అర్హత గల తల్లికి అమ్మఒడి... అక్కచెల్లెమ్మలకు ఆసరా... చేయూత... నిరుపేదలకు నివేశన స్థలం.. పక్కా ఇళ్లు... విద్యార్థులకు విద్యాదీవెన... ఇలా ఒకటేమిటీ సమస్త సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే చేరుస్తూ శభాష్ వలంటీర్ అని అందరి మన్ననలు పొందుతున్నారు. వలంటీర్ల వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలిపారు.
ఈసీ పేరుతో తప్పుడు ప్రచారం..
కాగా, వలంటీర్లపై ఫిర్యాదులు చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ సీఈవో కార్యాలయం ఖండించింది. రాజకీయ ప్రచారంలో పాల్గొనే వలంటీర్లను ఎవరైనా మీ కంట కనబడితే వారి ఫోటోలు,వీడియోలతో పాటు వలంటీర్ల పేరు, ఊరు పేర్లు తెలియజేస్తూ ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, లోకేషన్‌ను 9676692888కు వాట్సాప్‌కు షేర్ చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వలంటీర్లపై ఫిర్యాదులు చేయాలంటూ తామెలాంటి సర్క్యూలర్ జారీ చేయలేదని, ఇదీ ఫేక్ న్యూస్ అంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఏపీ సీఈవో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment