![Nitish Kumar Snubs Prashant Kishor: Someone Opinion Not Important - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/6/Prashant_Kishor_Nitish_Kuma.jpg.webp?itok=qL_ga5fU)
పట్నా: తన పరిపాలనపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. ప్రశాంత్ కిశోర్ అభిప్రాయం తమకు అవసరం లేదని, తమ పాలన గురించి ప్రజలకు పూర్తిగా అవగాహన ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బిహార్‌లో మేం మేలు చేశామా, లేదా అనేది ప్రజలకు తెలుసు. ఇక్కడ ఎవరి అభిప్రాయం ముఖ్యం కాదు. వాస్తవం ఒక్కటే ముఖ్యం. మా పని ప్రజలకు తెలుసు. మా పని తీరు ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. మీకు తెలుసు కాబట్టి, మీరే సమాధానం ఇవ్వమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు, మేము వ్యాఖ్యలకు ప్రతిస్పందించాలి. అయితే ఈ సందర్భంలో వాస్తవికత ఏమిటో మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని స్పందించమని అడుగుతున్నాన’ని నితీశ్ కుమార్ అన్నారు.
బిహార్‌లో మార్పుతీసుకువచ్చేందుకు ‘జన్ సురాజ్’ వేదికను ప్రారంభిస్తున్నట్టు ప్రశాంత్ కిశోర్ గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లాలూ ప్రసాద్, నితీశ్ కుమార్ పాలనలో బిహార్ అంతగా అభివృద్ధి సాధించలేదని అన్నారు. బిహార్‌లో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. (క్లిక్: ‘జన సురాజ్’ ప్రకటించిన ప్రశాంత్ కిశోర్)
నితీశ్ కుమార్‌ను కలవకుండా తప్పించుకోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నితీశ్ కుమార్‌తో వ్యక్తిగతంగా నాకు ఎలాంటి విభేదాలు లేవు. మా మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగత సంబంధాలు వేరు. కలిసి పనిచేయడం వేరు. ఒక వేళ నితీష్ కుమార్ నన్ను సమావేశానికి పిలిస్తే తప్పకుండా వెళ్తాను. దీని అర్థం అన్ని విషయాల్లో ఆయనతో ఏకీభవిస్తానని కాదు. నితీష్ జీ నాకు తండ్రి లాంటి వారు. ఆయనతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నంత మాత్రాన నాకు ప్రత్యేక రాజకీయ పంథా ఉండకూడదని ఏమీ లేదు కదా’ అని ప్రశాంత్ కిశోర్ సమాధానిమచ్చారు. (క్లిక్: బగ్గా అరెస్ట్.. మూడు రాష్ట్రాల పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’)
Comments
Please login to add a commentAdd a comment