లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది. మరోవైపు మొదటి దశ పోలీంగ్ సైతం సమీపిస్తోంది. 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రెండు స్థానాల్లో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కూటమిలోని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా ఇంకా జాప్యం చేస్తోంది. యూపీలో కీలకమైన ఈ రెండు స్థానాలు.. వాయువ్య ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్, రాయ్‌బరేలీ. ఈ రెండు స్థానాలకు మే 20 పోలింగ్ జరగనుంది. ఇక.. నామినేషన్‌కు చివరి తేదీ మే 3.
కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ..
మోదీ హవా కొనసాగిన 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత సోనియా గాంధీ విజయం సాధించారు. అయితే ఆమె ప్రస్తుతం రాజాస్తాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ‘కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయంలో తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఇక పార్టీ ఎన్నికల ప్రక్రియకు సిద్ధమవుతోంది’ అని కాంగ్రెస్ నేత మనీష్ హిందవి తెలిపారు.
బీజేపీ నిర్ణయంపై మిగతా పార్టీలు..
కైసర్‌గంజ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళ రెజ్లర్ల చేసిన లైగింక వేధింపుల ఆరోపణలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో రెజ్లర్ల సమాఖ్యకు కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే 2019లో ఇక్కడ ఆయన సుమారు 2,60,000 మెజార్టీతో విజయం సాధించారు. కైసర్‌గంజ్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో బీజేపీ పార్టీ కాకుండా ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సైతం తమ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం. అయితే బీజేపీ నిలబెట్టే అభ్యర్థి నిర్ణయంపై మిగతా పార్టీలు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన బ్రిజ్‌భూషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. 2008లో అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు బ్రిజ్‌భూషన్ బీజేపీ బహిష్కరించింది. అనంతరం ఆయన ఎస్పీలో చేరారు. తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ బీజేపీలో చేరారు.
ఎస్పీలో సందిగ్ధం..
‘కైసర్‌గంజ్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై పార్టీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నాం. ఇక్కడ ఎవరిని నిలబెట్టినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తాం. ఈ విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది’ అని బహ్రైచ్ జిల్లా ఎస్పీ అధ్యక్షుడు రామ్ వర్ష యాదవ్ తెలిపారు. మరోవైపు.. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఎస్పీ కూడా సందిగ్ధంలో ఉందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
కైసర్‌గంజ్ టికెట్ బ్రిజ్ భూషణ్‌కు దక్కేనా..?
బీజేపీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని బహ్రైచ్ జిల్లా అధ్యక్షుడు బ్రిజేష్ పాండే స్పష్టం చేశారు. బీజేపీ బ్రిజ్‌భూషన్‌కు టికెట్ నిరాకరిస్తే మళ్లీ ఆయన ఎస్పీలోకి పార్టీ మారుతారని బీజేపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. హర్యానా, పశ్చిమ యూపీలో కీలకమైన జాట్ సాజికవర్గంలో రెజ్లర్లపై వేధింపుల విషయంలో బ్రిజ్‌భూషన్‌పై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది అక్టోబర్‌లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఉన్న మొత్తం ఓటర్లలో జాట్‌లు నాలుగింట ఒక వంతు ఉన్నారని ఓ బీజేపీ నేత తెలిపారు. ఇక.. ఏప్రిల్ 19, 26 తేదీల్లో లోక్‌సభకు పోలింగ్ జరగనున్న పశ్చిమ యూపీలోని పలు జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో జాట్‌లు ఉన్నారు. అయితే వారిని దూరం చేసుకోడాన్ని బీజేపీ కోరుకోవడం లేదని అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ బ్రిజ్‌భూషన్‌కు టికెట్ నిరాకరించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు ఉందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment