సాక్షి, అమరావతి: ‘వంక లేక డొంక పట్టుకొని ఏడుస్తున్నట్లు’గా ఉంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం టీడీపీని ఇరకాటంలోకి నెట్టాయి. అత్యంత సమర్ధవంతంగా చేపట్టిన ఈ ప్రక్రియలో విపక్ష పార్టీకి విమర్శించడానికి, రచ్చ చేయడానికి ఏ కారణమూ దొరకడంలేదు.
పైగా, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను గౌరవిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టడం మరీ కంటగింపుగా మారింది. మింగలేక.. కక్కలేక అన్నట్లుగా.. జిల్లాల పునర్వ్యవస్థీకరణను స్వాగతించలేక, రచ్చ చేయలేక ఏవోవో కారణాలు చెబుతున్నారు. జనాభా గణనకు లింకు పెడుతూ అసలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియే ఆగిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు.
ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీ పగ్గాలు లాక్కుని, అనేక సంవత్సరాలు సీఎంగా పనిచేసినా చంద్రబాబు ఏనాడూ ఆయనకు గౌరవం ఇవ్వలేదనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ ఉంది. కృష్ణా జిల్లాలో పుట్టి సినీ రంగంలో నట సార్వభౌముడిగా, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన గొప్ప నేతగా ఎదిగిన ఎన్టీఆర్‌కు సముచిత గౌరవం కల్పించాలనే డిమాండ్ ఎంతో కాలం నుంచి ఉంది. కానీ సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదు.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులూ బాబును ప్రశ్నించలేదు. ఎన్టీఆర్ వారి అరాధ్య దైవమని చెప్పుకోవడానికే చంద్రబాబు, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు పరిమితమయ్యారు. ప్రతి ఏటా టీడీపీ మహానాడులో మాత్రం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసేవారు. అందుకోసం ఏనాడూ కేంద్రాన్ని సంప్రదించలేదు. కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పినట్లు చెప్పుకునే రోజుల్లోనూ ఆ ప్రయత్నం చేయలేదు.
ఎన్టీఆర్‌కు భారతరత్న రావడం బాబుకు ఇష్టం లేనందునే ప్రయత్నం చేయలేదనే వాదన పార్టీలో ఉంది. ఎన్టీఆర్ పట్ల గౌరవం ఉన్నట్లు నటించి కార్యకర్తలు, అభిమానుల్ని నమ్మించే ప్రయత్నం చేయడం తప్ప నిజంగా చంద్రబాబుకు ఎన్టీఆర్ పట్ల ప్రేమ లేదని దేవినేని నెహ్రూ లాంటి నాయకులు గతంలో బహిరంగంగానే చెప్పారు.
ఎలా స్పందించాలో తెలియక వక్రీకరణలు
ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్ విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంతో చంద్రబాబు సహా టీడీపీ నేతలందరి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ప్రత్యర్థి పార్టీ ఇచ్చిన గౌరవాన్ని ఎన్టీఆర్‌కు సొంత పార్టీ ఇవ్వలేదని ఆయన అభిమానులు, పార్టీలోని సీనియర్లు అంటున్నారు. చంద్రబాబు సైతం దీనిపై స్పందించలేక మిన్నకుండిపోయారు.
రెండు రోజుల తర్వాత ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు పార్టీ సమావేశంలో అన్నట్లుగా మీడియాకు లీకు ఇవ్వడం తప్ప నేరుగా స్పందించలేదు. పార్టీలోని ఇతర నాయకులు స్వాగతిస్తున్నట్లు చెబుతూనే ఈ నిర్ణయాన్ని వక్రీకరించేలా రకరకాల ప్రకటనలు చేస్తున్నారు.
అసలు జిల్లాల పునర్వ్యవస్థీకరణే జరగదని, జనాభా గణన జరక్కుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవద్దని కేంద్రం చెప్పినట్లు దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో కొత్త జిల్లాల ప్రక్రియ ఆగిపోతుందంటూ విష ప్రచారం చేస్తున్నారు. దీన్నిబట్టి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతున్నట్లు అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment