అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు ‘పల్లె’ మెడకు ఒక్కొక్కటిగా చుట్టుముడుతున్నాయి. అనంతపురంలో అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టడం, విద్యా సంస్థల్లో భారీఎత్తున స్కాలర్‌షిప్‌లు స్వాహా చేయడం, సొసైటీ పేర్లతో అందిన కాడికి డబ్బు వసూలు చేయడం వంటివి పల్లె ప్రతిష్టను దిగజార్చాయి. దీనికితోడు ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి పక్కలో బల్లెంలా తయారయ్యారు. పోటాపోటీ విమర్శలతో ఇద్దరూ బజారుకెక్కారు. ఇవన్నీ గమనిస్తున్న పార్టీ అధిష్టానం పొమ్మన లేక ‘పల్లె’కు పొగ బెడుతోందని టీడీపీ కేడర్‌లోనే చర్చ సాగుతోంది.
సాక్షి, పుట్టపర్తి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి సొంత పార్టీలోనే అసమ్మతి సెగ గట్టిగా తగులుతోంది. ఆయన తీరుపై ఒకవైపు పుట్టపర్తి నియోజకవర్గంలోని కొందరు పార్టీ నాయకులు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా... మరోవైపు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారం నెత్తుటి పుండుపై కారం చల్లిన చందంగా తయారైంది. పల్లెకు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టపర్తి టీడీపీ టికెట్ వచ్చే ప్రసక్తే లేదని జేసీ మీడియా సాక్షిగా కుండబద్దలు కొడుతున్నారు. విజయవాడ నుంచి అనంతపురం దాకా పల్లె చేసిన అక్రమాలు, అన్యాయాలన్నింటినీ బయటపెడతానని పేర్కొంటుండడంతో మాజీ మంత్రి అయోమయంలో పడ్డారు. పుట్టపర్తి టీడీపీ టికెట్ తన మద్దతుదారుడైన సైకం శ్రీనివాస రెడ్డికి ఇప్పిస్తానని జేసీ బాహాటంగానే చెబుతున్నారు. దీంతో పల్లెకు టికెట్ రాకపోతే మన పరిస్థితి ఏంటని అనుచరులు నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు.
2009లో అనుకూలం... నేడు ప్రతికూలం
జేసీ ప్రభాకర్ రెడ్డి ధోరణి విపరీతం. 2009లో పుట్టపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా కొండసాని సురేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా అప్పటి అధిష్టానం కడపల మోహన్ రెడ్డిని బరిలో దింపింది. కొండసానికి టికెట్ ఇవ్వలేదనే నెపంతో కడపల మోహన్ రెడ్డిని ఓడించడానికి జేసీ బ్రదర్స్ పావులు కదిపారు. అదే సమయంలో టీడీపీ తరఫున పోటీ చేసిన పల్లె రఘునాథ రెడ్డి బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కారు. అప్పుడు పల్లె ఎమ్మెల్యే కావడానికి జేసీ బ్రదర్స్ పరోక్షంగా దోహదపడ్డారు. కానీ తాజాగా పల్లెకు టికెట్ రాకుండా వారు చక్రం తిప్పుతున్నారు. దీంతో పుట్టపర్తిలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ‘ఉజ్వల’ అంశంలో జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన జేసీని అడ్డుకోవడానికి పల్లెతో పాటు ఆయన అనుచరులు తాపత్రయపడ్డారు. దీంతో జేసీ మరింత పట్టుదలగా పల్లెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
చదవండి: (Palle Vs JC: పల్లె అక్రమాలపై జేసీ లొల్లి..)
పొమ్మనలేక పొగ
పుట్టపర్తి టీడీపీ అభ్యర్థిగా పల్లె పనికిరాడని ఆ పార్టీ అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. ఆయనపై కొన్నేళ్లుగా జేసీ గుర్రుగా ఉండడం టీడీపీ అధిష్టానానికి కలిసివచ్చింది. 99.99 శాతం పల్లెకు టికెట్ రాదని జేసీ పదేపదే చెబుతుండడం ఇందుకు నిదర్శనం. పార్టీ అధిష్టానం పొమ్మనలేక పొగ పెడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పల్లె రఘునాథరెడ్డి అక్రమార్జనతో రూ.వందల కోట్లకు పడగలెత్తడం, విద్యా సంస్థల్లో కోట్లాది రూపాయల స్కాలర్‌షిప్‌లు స్వాహా చేయడం, అనంతపురంలో భారీగా ఆస్తులు కూడబెట్టడం, సొసైటీ పేర్లతో కళాశాలలు ఏర్పాటు చేసి అందిన కాడికి ఫీజులు వసూలు చేయడం తదితర అంశాలపై జేసీ సమగ్రంగా వివరాలు సేకరించినట్లు తెలిసింది.
పార్టీ మార్పునకు అనుచరుల ఒత్తిడి
పుట్టపర్తి టీడీపీ వ్యవహారంలో జేసీ జోక్యం చేసుకున్నా పార్టీ అధిష్టానం వారించలేదు. పైగా జేసీ రోజూ ప్రెస్‌మీట్లు పెట్టి పల్లెపై చులకన భావన ప్రదర్శిస్తున్నారు. ఎవరి నియోజకవర్గ పరిధిలో వారు పరిస్థితులు చక్కదిద్దుకోవాలని పార్టీ అధిష్టానం అక్షింతలు వేయకుండా జేసీకి మద్దతివ్వడం పల్లెను బయటికి పంపడంలో భాగమేనన్న అనుమానం టీడీపీ కేడర్‌లోనే వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పార్టీ మారితే గౌరవం అయినా దక్కుతుందని అనుచరులు పల్లెపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్యే, ఒక దఫా మంత్రి, ఒక దఫా ఎమ్మెల్సీ, విప్, చీఫ్ విప్ హోదాలో పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనే కారణంతో టికెట్ రాకపోతే అవమానమని అనుచరులు వాపోతున్నారు. ఏది ఏమైనా జేసీ తన అనుచరుడు సైకం శ్రీనివాస రెడ్డికి టికెట్ ఇప్పించే అంశంలో పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment