సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఎన్నికల అనంతరం హింసపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఈసీ ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసింది. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేయగా, పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెన్షన్ చేసింది.
పల్నాడు, అనంతపురం, తిరుపతి లోని 12 మంది సబ్బార్డినేట్ పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ.. శాఖపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించింది. అల్లర్లకు పాల్పడిన వారిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఈసీ ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించిన ఈసీ.. 25 కంపెనీల పారా మిలటరీ బలగాలను కొనసాగించాలని పేర్కొంది.
అనంతపురం: జేసీ వర్గానికి వత్తాసు పలికి..
తాడిపత్రిలో జేసీ వర్గానికి వత్తాసు పలికిన అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌ను ఈసీ సస్పెండ్ చేసింది. ఎన్నికల పోలింగ్ సమయంలో ఎస్పీ వివాదాస్పదంగా వ్యవహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వందల మంది టీడీపీ కార్యకర్తలతో సంచరిస్తున్నా ఎస్పీ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడి చేసినా కానీ ఎస్పీ అమిత్ బర్దర్ సకాలంలో స్పందించలేదు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసేలా ఎస్పీ ఆదేశాలను చేసిన ఎస్పీ.. ఎన్నికల వేళ రౌడీషీటర్లను కూడా బైండోవర్ చేయలేదు.
తిరుపతి: సర్పంచ్ ఇంటికి టీడీపీ మూకలు నిప్పు.. స్పందించని ఎస్పీ
చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలపై ఈసీ సీరియస్ అయ్యింది. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. చంద్రగిరి మండలం రామిరెడ్డిగారి పల్లి పంచాయితీ కూచి వారి పల్లి లో సర్పంచ్ కోటాల చంద్ర శేఖర్ రెడ్డి ఇంటిపై టీడీపీ మూకలు దాడి చేశారు. సర్పంచ్ ఇంటికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టి.. దాడి చేసినా కానీ సకాలంలో ఎస్పీ స్పందించలేదు.
కాగా, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ ఢిల్లీ వెళ్లి ఈసీకి వివరణ ఇచ్చారు.
పోలింగ్ అనంతరం పల్నాడు, కారంపూడి, చంద్రగిరి, తాడిపత్రిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి హెచ్చరించినా స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ బాధ్యులపై చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment