సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో వెన్నుపోటుకు పర్యాయపదంగా చంద్రబాబు పేరు కనిపిస్తుంది. ఎన్నికల వేళ.. బహుశా చంద్రబాబు దారిలోనే పయనించాలని పవన్ నిర్ణయించుకున్నాడేమో. అందుకే జనసేన తరఫున డబ్బున్న, అగ్రవర్ణాలకే సీట్లు ఇచ్చి ఆ మార్క్‌ను ప్రదర్శించుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన వాళ్లను సైతం పక్కనపడేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ఎన్నికల్లో కూటమి తరఫున 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు జనసేన పోటీ చేస్తోంది. అందులో ఇప్పటిదాకా 18 మంది అభ్యర్థుల్ని పవన్ ప్రకటించారు. ఇందులో కేవలం రెండే స్థానాలను(అనకాపల్లి, నరసాపురం) బీసీలకు కేటాయించారాయన. అందులో.. శెట్టి బలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబా, చేనేత కులాలల ప్రస్తావన లేదు.
ఇక ఓసీలకు ఏకంగా 12 సీట్లు ఇచ్చుకున్నారు. మైనారిటీలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు(నో టికెట్). జనసేనలో ఒకే ఒక్క మహిళకు అవకాశం ఇచ్చి.. వీర మహిళలెవరూ పోటీకి పనికి రారనే సంకేతాలు పంపించినట్లు ఉంది. ఇక.. భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్ల విషయంలో ఆయన అనుసరించిన తీరును జనసేన నేతలే మరీ దుర్మార్గమని వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఆ స్థానాల్లో పక్క పార్టీ నేతలకు పిలిచి మరీ టికెట్లు ఇచ్చారు పవన్ కల్యాణ్ . మొత్తంగా.. ధనసేన చేతిలో జనసేన నేతలుగా దగా పడ్డామనే మాట వినిపిస్తోంది.
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్లు, గత ఎన్నికల్లో దారుణ ఓటమిపాలైనా కూడా పక్కపార్టీల వైపు చూడకుండా పవన్ వెన్నంటే ఉన్నవాళ్లు, పవన్ మీద నమ్మకంతో పార్టీలో చేరిన కొందరు ఉన్నారు. ఆ లిస్ట్‌లో బొలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, ఉషా చరణ్, బొలిశెట్టి సత్యనారాయణ, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్ , రాయపాటి అరుణ, పోతిన మహేష్, ముత్త శశిధర్, రియాజ్, జానీ మాస్టర్, పితాని బాలకృష్ణ లాంటి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. అలాంటి నమ్మకస్తులకు సైతం పవన్ హ్యాండ్ ఇవ్వడాన్ని ఆ నేతల అనుచరులు ఏమాత్రం భరించలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment