ఆ ఎంపీ టికెట్‌తో పిచ్చెక్కిపోతున్న పవన్‌ | Pawan Kalyan In Big Confusion To Tangella Uday Srinivas | Sakshi
Sakshi News home page

ఆ ఎంపీ టికెట్‌తో పిచ్చెక్కిపోతున్న పవన్‌

Published Thu, Apr 25 2024 4:42 PM | Last Updated on Thu, Apr 25 2024 4:42 PM

Pawan Kalyan In Big Confusion To Tangella Uday Srinivas - Sakshi

ఇచ్చిన సీటుకూ దేశం పోటు! 


ఉదయ్‌ శ్రీనివాస్‌ను తప్పించేందుకు టీడీపీ వ్యూహం 


ఆయనను మార్చాలని ఎమ్మెల్యే అభ్యర్థుల పట్టు


సానా సతీష్‌ను తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు


అంతా చంద్రబాబు వ్యూహమేనని ప్రచారం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: తలపోటుగా ఉన్నప్పుడు ఓ కప్పు స్ట్రాంగ్‌ టీ తాగితే ఉపశమనం కలుగుతుందంటారు. ఆ టీలో అల్లం వేసుకుంటే మరింత రుచికరంగా, తలపోటుకు తక్షణ పరిష్కారంగా ఉంటుంది. అటువంటి టీ తాగినా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు తలపోటు ఎక్కువైపోతోందే తప్ప తగ్గడం లేదనే చర్చ కాకినాడ జిల్లా జనసేన సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. టీ టైమ్‌ అవుట్‌లెట్‌లతో తనకు అత్యంత సన్నిహితుడైన తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ను ఏరికోరి మరీ కాకినాడ ఎంపీ అభ్యర్థిని చేశారు పవన్‌ కల్యాణ్‌. ఇప్పుడా అభ్యర్థిత్వమే పవన్‌కు పెద్ద తలపోటుగా మారింది. 

ఊరించి ఊరించి.. శ్రీనివాస్‌కు జెల్ల 
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ నుంచి వారాహి యాత్ర వరకూ అన్నీ తానై చూసుకున్న శ్రీనివాస్‌కు పవన్‌ కల్యాణ్‌ తొలుత జనసేన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ప్రమోషన్‌ అన్నట్టు.. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఉదయ్‌ శ్రీనివాస్‌ను బరిలోకి దింపుతామని సంకేతాలు అందించారు. ఈ మేరకు శ్రీనివాస్, ఆ పార్టీ నేతలు ఆ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశారు. నాలుగు రోజులు గడిచేసరికి పవన్‌ కల్యాణ్‌ నాలుక మడత పెట్టేశారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఓసారి.. కాదు కాదు.. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని రోజుకో మాట చెబుతూ పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టేశారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై ఆయన కూడా చాలా కాలం మీమాంసలో పడ్డారు. చివరకు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించి శ్రీనివాస్‌కు జెల్ల కొట్టారు. అయితే, ఆ నొప్పి ఆయనకు తెలియనివ్వకుండా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. పిఠాపురంలో అంతా టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లోనే జరుగుతోందని, తమను కాదని పవన్‌ ఇక్కడ ఏ నిర్ణయమూ తీసుకోలేరని పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ తొలి నుంచీ బాహాటంగానే చెబుతూ వచ్చారు. సరిగ్గా ఉదయ్‌ శ్రీనివాస్‌ విషయంలో అదే జరిగింది. 

వ్యతిరేకిస్తున్న టీడీపీ 
జనసేన నుంచి ఉదయ్‌ శ్రీనివాస్‌ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం టీడీపీ సరికొత్త రాజకీయానికి తెర తీసింది. ఆయనను ఆ స్థానంలో కూడా ఉండే అవకాశం లేకుండా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలు శ్రీనివాస్‌కు పొగ పెడుతున్నారు. కాకినాడ పార్లమెంటరీ స్థానంలో పట్టుమని పది మందితో కూడా పరిచయం లేని శ్రీనివాస్‌ను ఏకంగా ఎంపీ అభ్యర్థిని చేసేయడమేమిటని టీడీపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థులు వాదన తీసుకువస్తున్నారు. 

పారీ్టలోని సీనియర్లతో మాట వరసకైనా సంప్రదించకుండా పవన్‌ తీసుకున్న ఈ నిర్ణయం వారికి రుచించడం లేదు. అలాగని నేరుగా బయట పడకుండా, శ్రీనివాస్‌ను సాగనంపేందుకు చంద్రబాబు వద్ద పావులు కదుపుతున్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పిఠాపురం, కాకినాడ రూరల్‌ నుంచి జనసేన పోటీ చేస్తోంది. అవి మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉదయ్‌ శ్రీనివాస్‌ను మార్చాలని గట్టిగా పట్టు పడుతున్నారు. 

సానా సతీష్‌కు కట్టబెట్టేందుకు.. 
ఉదయ్‌ శ్రీనివాస్‌ స్థానంలో టీడీపీ సానుభూతిపరుడైన సానా సతీష్‌ను తెర మీదకు తీసుకుని వచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన పేరు పరిగణనలోకి తీసుకోవాలని టీడీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకుని వస్తున్నారు. అటు టీడీపీ, ఇటు జనసేనలకు సమదూరం పాటిస్తూ, చారిటబుల్‌ ట్రస్టు పేరుతో కాకినాడ పార్లమెంటరీ స్థానాన్ని ఆశిస్తున్న స్థానికుడైన సతీష్‌ పేరు పరిశీలించాలని టీడీపీ అగ్ర నేతలు ఇటీవల చంద్రబాబును కోరారు. తద్వారా ఎంపీ సీటును కూడా తమ ఖాతాలో వేసుకోవాలన్నది టీడీపీ వ్యూహంగా ఉంది.  

కాకినాడ ఎంపీ సీటు ఆశించి భంగపడిన జ్యోతుల నవీన్‌ కుమార్‌ వర్గీయులు కూడా ఉదయ్‌ శ్రీనివాస్‌తో విభేదిస్తున్నారు. ఒక దశలో నవీన్‌ కుమార్‌ తండ్రి, జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సైతం ‘సూట్‌కేసులతో వచ్చే వారికి సీట్లు ఇచ్చేస్తే.. ఇక్కడ పారీ్టనే నమ్ముకుని కష్టపడి చేస్తున్న నాయకులు ఏమైపోవాలి’ అంటూ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఆ సమయంలోనే పవన్‌ పట్టుబట్టి మరీ ఉదయ్‌ శ్రీనివాస్‌ను ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించారు.

దీనిపై టీడీపీ అభ్యర్థులు కన్నెర్ర చేస్తున్నారు. పార్లమెంటరీ అభ్యర్థిని ప్రకటించే ముందు ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న వారిని సంప్రదించాలనే కనీస సంప్రదాయం కూడా పాటించలేదనే సాకుతో శ్రీనివాస్‌కు చెక్‌ పెట్టేందుకు టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ముక్కూ మొహం తెలియని ఉదయ్‌ శ్రీనివాస్‌ను ఏ ప్రాతిపదికన కాకినాడ ఎంపీ అభ్యరి్థని చేశారని వారు ప్రశి్నస్తున్నారు. తంగెళ్లకు చెక్‌ పెట్టేందుకు చాప కింద నీరులా టీడీపీ నేతలు చేస్తున్న ఈ ప్రయత్నాలు పవన్‌కు తలపోటుగా మారాయి. 

టీడీపీ ఖాతాలో వేసుకునేందుకేనా.. 
అయితే, ఇదంతా చంద్రబాబు వ్యూహమేనని జనసేన నాయకులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో తమ పారీ్టకి కేటాయించిన కాకినాడ ఎంపీ స్థానాన్ని లాక్కునేందుకే ఉదయ్‌ శ్రీనివాస్‌పై వ్యతిరేక ప్రచారం నడుపుతున్నారని మండిపడుతున్నారు. ఏ పారీ్టలోనూ చేరకుండా గోడ మీద.. సామెత చందంగా ఉన్న సతీ‹Ùను ఎందుకు ప్రతిపాదిస్తున్నారని ఇటీవల జరిగిన టీడీపీ, జనసేన పారీ్టల సమన్వయ సమావేశంలో ఉదయ్‌ శ్రీనివాస్‌ వర్గీయులు గట్టిగా ప్రశ్నించారని తెలిసింది. ఇదిలా ఉండగా కాకినాడ ఎంపీ బరిలో నిలిచేందుకు ఉదయ్‌ శ్రీనివాస్‌ చివరి వరకూ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన బుధవారం నామినేషన్‌ వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, చివరి నిమిషం వరకూ కూడా అభ్యర్థులను తనకు నచ్చిన రీతిలో మార్చేసిన చరిత్ర టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఏ తీరానికి చేరుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

ఖర్చులు ఇవ్వడం లేదని.. 
ఉదయ్‌ శ్రీనివాస్‌ను మారి్పంచేందుకు టీడీపీ అభ్యర్థులు గట్టిగా పట్టు పట్టడానికి మరో కారణం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న వారికి అవుతున్న ఖర్చులు కనీసంగా భరించడానికి కూడా ఉదయ్‌ శ్రీనివాస్‌ సహకరించడం లేదని అంటున్నారు. ఇది కూడా ఆయనపై టీడీపీ నేతల వ్యతిరేకతకు కారణమని చెబుతున్నారు. తన వెనుక పవన్‌ ఉన్నారనే ధైర్యంతో.. మితిమీరిన విశ్వాసంతో ఉదయ్‌ శ్రీనివాస్‌ ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని టీడీపీ అభ్యర్థులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement