
హస్తినలో జనసేనాని పవన్ టూర్ తుస్ మందా.. పొత్తులపై ముందడుగు వేయాలనుకున్న పవన్‌కి ఆశాభంగమే ఎదురైందా.. ఎన్డీఏ సమావేశంలో అసలు రాష్ట్ర రాజకీయాలే చర్చకి రాకపోవడం.. మోదీ, అమిత్ షా లాంటి అగ్రనేతలని కలిసే అవకాశం రాకపోవడంతో పవన్ నిరాశతో తిరుగుముఖం పట్టారా.. ఇపుడు పవన్ దారెటు.
పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనపై ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి నిరాశే ఎదురైంది. బీజేపీతో కలవడానికి వేసిన ఎత్తుగడ ఫలించలేదు. ఇక టీడీపీని బీజేపీకి దగ్గర చేసేందుకు ఎన్డీఏ సమావేశాన్ని ఉపయోగించుకోవాలన్న పవన్ ఆశలు కూడా నెరవేరలేదు.. ఫలితంగా పవన్ ఢిల్లీ టూర్ మొత్తానికి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాని కలవటం.. ఆ కొద్ది రోజులకి ఎన్డీఏ సమావేశం ప్రకటన రావడంపై ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చే సాగింది.
ఒకానొక దశలో ఎన్డీఏ సమావేశానికి బీజేపీ నుంచి టీడీపీకి ఆహ్వానమందిందనే లీకులని తెలుగుదేశం పార్టీ మీడియాకి అందించింది. ఒకట్రెండు పచ్చపత్రికలు అడుగు ముందుకు వేసి ఎన్డీఏ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందిందంటూ ఊదరగొట్టాయి. అసలు టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కానప్పుడు ఎలా పిలుస్తామని టీడీపీకి ఆహ్వానం లేదని ఆ తర్చాత బీజేపీ నేతలు కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టం చేశారు.. దీంతో కంగుతిన్న టీడీపీ నేతలు దత్తపుత్రుడిపై ఆశలు పెట్టుకున్నారు.
ఇక గత దశాబ్దకాలంలో ఏనాడూ ఎన్డీఏ భాగస్వామ్య పక్ష సమావేశానికి పిలవని బీజేపీ తొలిసారి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి ఆహ్వానం పంపారు. ఇంకేం.. తమకి ఆహ్వానం అందకపోయినా తమ దత్తపుత్రుడికి ఆహ్వానం అందిందని టీడీపీ నేతలు సంకలు గుద్దుకున్నారు.. ఎలాగైనా పవన్ ఢిల్లీ టూర్‌లో పొత్తుల ప్రస్తావన వస్తుందని కూడా ఆశలు పెట్టుకున్నారు.. మరో వైపు ఎలాగైనా ఢిల్లీ టూర్‌ని తమపొత్తులకి అనుకూలంగా మార్చుకోవాలని పవన్ భావించారు.. తీరా చూస్తే అంతా తుస్ మంది.
ఎన్డీఎ సమావేశంలో ఏపీ రాజకీయాలపై చర్చకి వస్తాయని భావించిన పవన్ కళ్యాణకి ఆశాభంగమే ఎదురైంది. ఏపీలో వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్లాలని సమావేశంలో చెప్పాలనుకున్న పవన్‌కి ఆ అవకాశమే రాలేదు.. దేశ రాజకీయాలపైనే చర్చ జరగడంతో పవన్ ఆశలపై నీళ్లు జల్లినట్లైంది...ఇక టీడీపీని ఎలాగైనా బీజేపీతో కలపాలని పవన్ ఢిల్లీలో పిల్లి మొగ్గలు వేసినా ఫలితం దక్కలేదు.. ఇక ఎన్డిఏ సమావేశం తర్వాతైనా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా లాంటి అగ్రనేతలతో భేటీ ఉంటుందనుకున్నా అదీ జరగలేదు...కానీ ఈ రోజు ఉదయం ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి మురళీధరన్ ఇంటికి వెళ్లి కలిసే అవకాశం మాత్రమే దక్కింది.
ఇక ఇతర బీజేపీ అగ్రనేతలతోనైనా భేటికి అవకాశం దక్కుతుందేమో అనుకున్నప్పటికీ అదీ నెరవేరలేదు. ఎన్డిఏ భేటీకి ముందు.. తర్వాత కూడా పవన్ మీడియాతో మాట్లాడి తన మనసులో మాట మరోసారి బయటపెట్టారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్తాయని చెప్పడం ద్వారా బీజేపీ నాయకత్వానికి తన ఆలోచనని మరోసారి స్పష్టం చేసినట్లైంది.. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ అజ్ఞానాన్ని బట్టబయలు చేసుకున్నారు. సమావేశంలో దేశ రాజకీయాలు గురించి తప్పితే ఎక్కడా రాష్డ్ర రాజకీయాల గురింవి ప్రస్తావనే రాలేదని స్వయంగా పవన్ కళ్యాణే మీడియాకి తేల్చి చెప్పేశారు.
అదే చంద్రబాబు లాంటి నేత అయితే రెండు, మూడు రోజుల పాటు హైడ్రామానే నడిపించేవారని.. పవన్ కల్యాణ్‌కి రాజకీయ పరిపక్వత లేకే ఈ విధంగా మాట్లాడారని జనసేన నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.. మరో వైపు పవన్ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం పొత్తులపై ఎక్కడా స్పందించలేదు.. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వెళ్తాయన్న పవన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు స్పందించారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం ద్వారా తమ చేతులలో ఏమీ ఉండదని చెప్పకనే చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూరు అనుకున్నదొకటి.. అయ్యిందొకటి.. అన్నట్లుగా జరిగింది.
-వినాయక్, ఛీఫ్ రిపోర్టర్, సాక్షి టివి, విజయవాడ