పొత్తులో మధ్యవర్తిత్వం చేసి నష్టపోయాం
పెద్ద మనసుతో వెళ్లి మనల్ని మనమే చిన్న చేసుకున్నాం
రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ జనసేన కాకపోతే ఇంకెవరు?
నాతో పని చేసేవాళ్లు..కాఫీ ఇచ్చి ఎమ్మెల్యే అయిపోదామని ఆశపడ్డ వాళ్లు
సంక్షేమం ఎక్కువైతే శ్రీలంక పరిస్థితే.. సోషల్ మీడియా వల్ల అవతలివారు చనిపోయే పరిస్థితి రాకూడదు
జనసేన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్
సాక్షి, అమరావతి: టీడీపీ – బీజేపీ పొత్తుకు మధ్యవర్తిత్వం చేస్తే మనమే సీట్లను తగ్గించుకోవాల్సి వచ్చిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో మాట్లాడారు. ఆయన ప్రసంగంలో తన సినిమాల ప్రస్తావనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. జనసేన సీట్లు తగ్గించుకోవాల్సి రావడంపై మాట్లాడుతూ.. పొత్తుల్లో రెండు పార్టీల మధ్య మధ్యవర్తిత్వం చేస్తే ఏం నష్టపోతామో తనకు బాగా అర్థమైందన్నారు. పెద్ద మనసుతో వెళ్తే మనల్ని మనం చిన్న చేసుకున్నామని చెప్పారు.
తన అన్న నాగబాబుకు మాట ఇచ్చిన లోక్‌సభ సీటును సైతం త్యాగం చేయాల్సి వచ్చిందని అన్నారు. సినిమాల్లో తనకు ఎదురు దెబ్బలు లేవని, రాజకీయాల్లో మాత్రం తన ఎదుగుదలే తనకు శాపం అయిందని, పదేళ్లుగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయని చెప్పారు. 2019లో 30 స్థానాలకు పోటీ చేయాలని అనుకున్నామని, అందరి బలవంతంపై అన్ని స్థానాల్లో పోటీ చేశామని చెప్పారు. అప్పుడు కొన్ని స్థానాల్లోనే పోటీ చేసి ఉంటే ఇప్పటికి జనసేన గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీగా ఉండేదన్నారు. అధికారం జనసేనకు కనుచూపు మేరలో ఉందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ మనమేనన్నారు.
పొత్తులో జనసేన అభ్యర్థులను గెలిపించడానికి టీడీపీ, బీజేపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. అప్పులు తెచ్చి సంక్షేమం చేసుకుంటూ పోతే మన రాష్ట్రం కూడా శ్రీలంకలా మారే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా కారణంగా అవతలివారు చనిపోయే పరిస్థితి రాకూడదని, పార్టీ శ్రేణులు ప్రత్యర్థులను ఎందుకు తిడుతున్నామో సందేశాల్లో స్పష్టంగా చెప్పాలని సూచించారు. ఈ ఎన్నికల్లో భీమవరం నుంచి పులవర్తి రామాంజనేయులు, తిరుపతి నుంచి జంగాలపల్లి శ్రీనివాసులు పోటీ చేస్తారని పవన్ చెప్పారు.
పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా
లోక్‌సభకు కూడా పోటీపైపెద్దలతో చర్చించాక నిర్ణయం
తాను ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. అసెంబ్లీ స్థానంతో పాటు లోక్‌సభకు కూడా పోటీ చేసే విషయంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. ‘చాలా మంది ఎమ్మెల్యే, ఎంపీ రెండింటికీ పోటీ చేయాలని సూచిస్తున్నారు. కానీ రెండింటికీ పోటీ చేస్తే క్రాస్ ఓటింగ్‌లు వంటివీ ఉంటాయని గందరగోళంలో ఉన్నా. నాకు మాత్రం ఎమ్మెల్యేగా ఉండాలనే ఉంది’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment