రికార్డు మెజార్టీతో గెలిపిద్దాం | Peddireddy Ramachandra Reddy Comments On Tirupati By Elections | Sakshi
Sakshi News home page

రికార్డు మెజార్టీతో గెలిపిద్దాం

Published Sun, Apr 4 2021 4:26 AM | Last Updated on Sun, Apr 4 2021 4:26 AM

Peddireddy Ramachandra Reddy Comments On Tirupati By Elections - Sakshi

ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి, పక్కన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి

నాయుడుపేటటౌన్‌: చంద్రబాబు మోసకారి.. దగాకోరని.. 600 హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో శనివారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధ్యక్షతన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌చక్రవర్తి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య తదితర నాయకులతో కలిసి తిరుపతి లోక్‌సభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తికి మద్దతుగా నిర్వహించిన ప్రచార యాత్రలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగాల పేరుతో యువతను, రుణ మాఫీ పేరుతో రైతులు, పొదుపు మహిళలను చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు.

జన్మభూమి కమిటీల పేరిట టీడీపీ కార్యకర్తలను నియమించి అర్హులకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేసిన మోసకారి చంద్రబాబని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చారని కొనియాడారు. మేనిఫెస్టోలోని 95 శాతం హామీలు నెరవేర్చడమే కాకుండా అదనంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చేసుకుని ప్రజా రంజక పాలన అందిస్తున్నట్టు తెలిపారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తిని ఐదు లక్షలకు పైగా మెజారిటీతో గెలిపించి సీఎం వైఎస్‌ జగన్‌కు కానుకగా ఇద్దామని మంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు.  

ఎన్నికల బహిష్కరణ పెద్ద డ్రామా 
చంద్రబాబు పరిషత్‌ ఎన్నికల బహిష్కరణ పెద్ద డ్రామా అని పెద్దిరెడ్డి విమర్శించారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని, పరిషత్‌ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావనే బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారని చెప్పారు. ఎన్నికల బహిష్కరణ అంటూనే వాళ్లకు బలం ఉన్న కొన్ని చోట్ల విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుది మొదటి నుంచి రెండు కళ్ల సిద్ధాంతమేనని దుయ్యబట్టారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ డాక్టర్‌ గురుమూర్తికి దేశ చరిత్రలోనే చెప్పుకునేంత మెజారిటీ అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ గురుమూర్తికి రికార్డు స్థాయిలో మెజారిటీ తీసుకొచ్చేందుకు ప్రజలు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌ చక్రవర్తిలు మాట్లాడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement