
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉండటానికే భయపడుతున్న చంద్రబాబుకి ఐదుశాతం ప్రజలైనా ఓటు ఎందుకు వేయాలని రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రశ్నించారు. వయసు రీత్యా బయటకు రావడం కష్టమైతే చంద్రబాబు రాజకీయాల్లో 2024 నాటికి ఎలా ఉంటారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదుశాతం ఓట్లు తేడా వస్తే అధికారం మారిపోతుందని, వైఎస్సార్ సీపీ మళ్లీ ఇంటికి వెళ్లిపోతుందన్న ప్రతిపక్షనేత చంద్రబాబు మాటలు ఎల్లో మీడియా చానళ్లు, కొన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయని మంత్రి నాని చెప్పారు. అటూఇటూ కావడానికి ఇదేమైనా గ్యాంబ్లింగా అని ప్రశ్నించారు. చంద్రబాబు 39 శాతం ఓట్లలో కూడా మరో 15 నుంచి 20 శాతం అటూ ఇటూ అయ్యాయని భయపడుతూ ఇటువంటి ప్రకటనలు ఇస్తున్నట్లు ఉందన్నారు.
ప్రజల మీద నమ్మకం ఉన్న నాయకుడు ప్రజల్లో ఉంటాడు తప్ప ఇంట్లో తలుపులు వేసుకుని కూర్చోరన్నారు. బాబు వయసు 70 ఏళ్లు దాటింది కాబట్టి ఆయన బయటకు రావడం మంచిది కాదనుకుంటే 2024 నాటికి రాజకీయాల్లో ఎలా ఉంటారని ప్రశ్నించారు. చంద్రబాబులాగా 600 హామీలు ఇచ్చి ఆరు కూడా నెరవేర్చకుండా ఐదేళ్లు కాలం గడిపిన పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 90 శాతం ఎన్నికల హామీలను 18 నెలల్లో నెరవేర్చిన సీఎం జగన్ని ప్రజలు ఎందుకు వదులుకుంటారనే ఆలోచన చంద్రబాబుకు లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు.
సీఎం జగన్ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి రూ.77 వేల కోట్లకుపైగా ఖర్చు చేసిందన్నారు. కుమారుడు లోకేశ్ మీద నమ్మకం లేక చంద్రబాబు పార్టీ బాధ్యతలు అప్పజెప్పకుండా జూమ్ నాయుడుగా కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిస్తే అది బాబు కళ్లకు కనబడలేదన్నారు. పోలీసులు, వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు వేయండని టీడీపీ కార్యకర్తలను ప్రోత్సహించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని, ఆయన అనుభవం అందుకు పనికొస్తుందని మంత్రి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment