సాక్షి, తాడేపల్లి: ప్రజల ఆస్తులను అమ్మడంలో చంద్రబాబు దిట్ట మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సంపద సృష్టించడం దేవుడెరుగు. సృష్టించిన సంపదను కూడా తెగనమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను దొడ్డిదారిన చంద్రబాబు తన వారికి కట్టబెడుతున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రి పేర్ని నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. సంపద సృష్టిస్తామంటూ మోసపూరిత మాటలు చెప్పారు. సంపద సృష్టించడం దేవుడెరుగు. ఈ ఆర్థిక సంవత్సరంలో 45వేల కోట్లు అప్పులు తెచ్చారు. సృష్టించిన సంపదను కూడా తెగనమ్ముతున్నారు. తమ వారికి సంపదనంతా దోచిపేట్టే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రంలో మూడు పోర్టుల నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. నిర్మాణాలు పూర్తి అయినప్పటికీ ఈరోజుకు కూడా పోర్టులో కార్యకలాపాలు ప్రారంభించలేదు.
మచిలీపట్నం పోర్టు కృష్ణా జిల్లా ప్రజల ఆకాంక్ష. బందరు పోర్టు కోసం నాడు వైఎస్సార్ అన్ని రకాల అనుమతులు తీసుకువచ్చి పనులు ప్రారంభించారు. చంద్రబాబు హయాంలో పోర్టు పనులు ఆగిపోయాయి. వైఎస్ జగన్ హయంలో బందరు పోర్టు 50 శాతం పూర్తి అయ్యింది. చంద్రబాబు ఆరు నెలల్లోనే బందరు పోర్టు కడతామన్నారు.. ఏమైంది?. బందరు పోర్టు కట్టకపోగా 22 గ్రామాలను ఖాళీ చేయించారు. మూలపేట పోర్టు పనులను కూడా ఈ ప్రభుత్వం నిలిపివేసింది. వైఎస్ జగన్ సృష్టించిన సంపదను కూటమి నేతలు దోచుకుంటున్నారు. ఈ మూడు పోర్టుల పనులను నిలిపేసి అమ్మకానికి పెట్టారు.
కరెంట్ ఛార్జీల మోత..
2014-19 మధ్య కాలంలో ఇదే కూటమి ప్రభుత్వం ఉంది. ఆ ఐదేళ్లలో రామాయపట్నం పోర్టు ఊసు కూడా ఎత్తలేదు. వాళ్ల సంపద పెంచుకోవడానికి దుర్మార్గపు పనులు చేస్తున్నారు. తెగనమ్ముకోవడాన్ని సంపద సృష్టించడం అంటారా?. 14 మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టారు. ప్రజల ఆస్తులను అమ్మడంలో చంద్రబాబు దిట్ట. ప్రభుత్వ ఆస్తులను దొడ్డిదారిన చంద్రబాబు తన వారికి కట్టబెడుతున్నాడు. చంద్రబాబు పాపపు పనులను ప్రజల్లో ఎండగడతాం. ఎన్నికల సమయంలో బాబు ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు. కానీ, ఇప్పుడు రూ.6072 కోట్లు ప్రజలపై భారం మోపుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పిందని బాబు అబద్ధాలు చెబుతున్నారు. ఛార్జీలు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి.
ఉచిత ఇసుక పెద్ద మోసం..
ఇసుక గురించి నాడు ఇష్టానుసారం మాట్లాడారు. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. ఉచిత ఇసుక అంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారు. బంగారం ఇచ్చినా ఇసుక దొరకని పరిస్థితికి తీసుకొచ్చారు. టెండర్లను మంత్రులు, ఎమ్మెల్యేలే వేసుకోవాలట. పేరుకు మాత్రం ఉచితం.. అంతా దోపిడీనే. కూటమి సర్కార్ పాలనలో నిత్యవసరాల ధరలు మండిపోతున్నాయి. చంద్రబాబు, లోకేష్, పవన్, పురంధేశ్వరి.. నలుగురు కలిసి జనాన్ని బాదేస్తున్నారు. ధరల నియంత్రణకు బాబు ఏం చర్యలు తీసుకున్నారు. ఇది ఎంత మోసపూరిత ప్రభుత్వమో అర్థం అవుతోంది. ఇంతకంటే దగుల్బాజీ ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? అని కామెంట్స్ చేశారు.
బాలినేనికి కౌంటర్..
ఇదే సమయంలో ఆస్తుల విషయంలో విజయమ్మ జడ్జీగా ఉండాలంటూ బాలినేని వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. జడ్జిగా ఉండేవారు మధ్యస్థంగా ఉండాలి కదా?.
ఒకరివైపు ఉండేవాళ్లు జడ్జి ఎలా అవుతారు?. ఈ పార్టీ వద్దు అని వెళ్లిపోయిన బాలినేని ఇప్పుడు పెద్ద మనిషి అవతారం ఎందుకు ఎత్తారు?. అవసరాల కోసం చేసే రాజకీయాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. బాలినేని రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు జనసేనలో ఉన్నందున ఆ పార్టీలైన్ మాట్లాడుతున్నారు అంటూ కౌంటరిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment