
సాక్షి, అమరావతి: టీడీపీకి ఎలాగూ ప్రజలు ఓటేయరని తెలిసే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని ఆ పార్టీ అంటోందని రాష్ట్ర సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని వెంకటరామయ్య(నాని) ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజలు టీడీపీని బహిష్కరించారని ఆయన అన్నారు. ఇప్పటికే టీడీపీకి చెందినవారు నామినేషన్లు వేశారని, ఒకవేళ ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించినా బ్యాలెట్లో టీడీపీ గుర్తు ఉంటుందని చెప్పారు. నిన్నటి వరకు నిమ్మగడ్డను అడ్డంపెట్టుకుని ఆట ఆడారని, ఇప్పుడు ఒక మంచి ఆఫీసర్ ఎస్‌ఈసీగా వచ్చేసరికి ఎన్నికలు వద్దంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
పేర్ని నాని గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. నారా వారి పుత్రరత్నం లోకేశ్ ఎల్ బోర్డ్ పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, ఇంకో 30 ఏళ్లయినా ఎల్ బోర్డ్ అలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై లోకేశ్ మాట్లాడుతుండడాన్ని ఆయన తప్పుపట్టారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజార్టీతో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారని నాని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ తన 20 నెలల పాలనలోనే మేనిఫెస్టోలోని అంశాల్లో 90 శాతానికిపైగా అమలు చేశారన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపు దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment