
నరసాపురం: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో జనసేన పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ డిమాండ్ చేశారు. నరసాపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకూడదని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ, ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాయన్నారు. బీజేపీతో అంటకాగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజాకర్షక పాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ మరో 30 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్టు చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మునిసిపాలిటీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుని రికార్డు సృష్టిస్తుందని విశ్వరూప్ ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.