మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ పీఆర్కే తదితరులు
వెల్దుర్తి (మాచర్ల): పచ్చని పల్నాడులో చిచ్చు పెట్టడానికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చారని మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే), వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహించదని తెలిపారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయాల్సిన అవసరం పిన్నెల్లి కుటుంబానికి లేదని స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రయ్య హత్య బాధాకరమని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
ఈ హత్యపై పోలీసులు పూర్తిగా విచారించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హత్యా రాజకీయాలకు దూరంగా ఉండటంవల్లనే తమ కుటుంబాన్ని వరుసగా ఐదుసార్లు ఇక్కడి ప్రజలు గెలిపించారని చెప్పారు. గత 15 సంవత్సరాల్లో పల్నాడులో హత్యలు జరగలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఎటువంటి గొడవలు లేవని తెలిపారు. ఇన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న పల్నాడుకు ఫ్యాక్షన్ ముద్ర ఉన్న నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డిని తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించటం వల్లే మళ్లీ ఫ్యాక్షన్ మొదలవుతోందని చెప్పారు. గతంలో ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే బ్రహ్మారెడ్డి తల్లి దుర్గాంబ మాచర్ల ఎమ్మెల్యేగా చేసిన సమయంలోనే అనేక ఫ్యాక్షన్ హత్యలు జరిగినట్లు తెలిపారు. బ్రహ్మారెడ్డి 15 హత్యలు చేయించాడన్నారు.
చంద్రయ్య హత్య ఎందుకు జరిగిందో చంద్రబాబు తెలుసుకొని మాట్లాడాలన్నారు. దీనిని రాజకీయ హత్యగా చూపుతున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీతో సంబంధం లేని సంఘటనలను కూడా రాజకీయంగా వాడుకోవాలని టీడీపీ చూస్తోందని విమర్శించారు. ఇలాంటి నీచ రాజకీయాలు చంద్రబాబుకు మామూలేనని, ప్రభుత్వం మీద, సీఎం జగన్ పైన నిత్యం అసత్యాలు ప్రచారం చేయటం పరిపాటిగా మారిందని అన్నారు. పక్క నియోజకవర్గాల నుంచి నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీసుకొచ్చి బెదిరించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఎవరు ఎలాంటి వ్యక్తులో ఎవరి హయాంలో గొడవలు జరుగుతున్నాయో పల్నాడు ప్రజలకు తెలుసునని అన్నారు. గుండ్లపాడు చాలా సున్నితమైన గ్రామమని, గతంలోనూ హత్యలు జరిగాయని, ఇప్పుడు ఏమీ ఎన్నికలు లేని సమయంలో హత్యలెందుకు జరుగుతాయని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రం ముందుకెళ్తుంటే సహించలేని చంద్రబాబు ఈ హత్యను
వైఎస్సార్‌సీపీ మీద రుద్దాలని చూస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment