జగిత్యాల నియోజకవర్గం
జగిత్యాలలో ఆరుసార్లు విజయం సాదించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి 2018 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. టిఆర్‌ఎస్ తరపున పోటీచేసిన డాక్టర్ ఎమ్.సంజయ్ కుమార్ భారీగా 61125 ఓట్ల ఆదిక్యతతో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికలలో గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించడం మరో విశేషంగా చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలలో సంజయ్ కుమార్ కు 104247 ఓట్లు రాగా, జీవన్ రెడ్డికి కేవలం 43062ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ది ముదిగంటి రవీంద్ర రెడ్డికి కేవలం 4700 ఓట్లు మాత్రమే వచ్చాయి.
సంజయ్ కుమార్ వెలమ సామాజికవర్గానికి చెందిన నేత.1978 వరకు వెలమ సామాజికవర్గం నేతలు ఇక్కడ అదికంగా ఎమ్మెల్యేలుగా గెలుపొందినా, ఆ తర్వాత అంటే నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈసారే వెలమ నేత గెలిచారు.2014లో కరీంనగర్ జిల్లాలో టిఆర్‌ఎస్ ప్రభంజనాన్ని ఎదురొడ్డి గెలిచిన ఏకైక నేత జీవన్ రెడ్డి కావడం విశేషం. ఆయన జగిత్యాల నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్ది సంజయ్ కుమార్ పై 7828 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. 2018లో మాత్రం జీవన్ రెడ్డి ఓడిపోవల్సి వచ్చింది. జీవన్ రెడ్డి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో జగిత్యాలలో టిడిపి, బిజెపి కూటమి తరపున పోటీచేసిన తెలుగుదేశం ఎన్నికల ప్రచార కమిటీ అద్యక్షుడు ఎల్.రమణ 22385 ఓట్లతో ఇక్కడ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 2018లో పోటీచేయలేదు.
జగిత్యాల నియోజకవర్గంలో ఏడుసార్లు రెడ్లు ఏడుసార్లు వెలమ, మూడుసార్లు బిసి వర్గం నేతలు, ద్విసభ్య నియోజకవర్గం గా ఉన్నప్పుడు ఒక ఎస్.సి నేత గెలుపొందారు. జీవన్‌రెడ్డి 1983లో టిడిపి పక్షాన తొలిసారి గెలుపొంది ఎన్.టి.ఆర్.క్యాబినెట్‌లో స్థానం పొందారు. ఆ తరువాత ఆయన నాదెండ్ల భాస్కరరావు పక్షాన చేరారు. అనంతరం కాంగ్రెస్ ఐలో చేరి 1989 నాటికి తిరిగి ఎమ్మెల్యే కాగలిగారు. 1994లో ఓడిపోయినప్పటికి, అప్పుడు గెలిచిన ఎల్.రమణ, 1996లో కరీంనగర్ లోక్‌సభ స్థానానికి ఎన్నికవడంతో జరిగిన ఉప ఎన్నికలో జీవన్‌రెడ్డి విజయం సాధించారు. 1999,2004,2014లలో కూడా నెగ్గారు. వై.ఎస్. క్యాబినెట్‌లో రహదారులు, భవనాల శాఖమంత్రిగా ఉన్నారు. కరీంనగర్ లోక్‌సభ స్థానంలో కేసిఆర్ రెండుసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు దిగిన సందర్భంలో జీవన్‌రెడ్డే ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచారు. ఒకసారి మంత్రి పదవికి రాజీనామా చేసి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేసి, అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ వెంటనే తిరిగి మంత్రి పదవి బాధ్యతలు చేట్టారు.
జగిత్యాలకు రెండు ఉప ఎన్నికలతో సహా 17సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి 10సార్లు, టిడిపి నాలుగుసార్లు, పిడిఎఫ్ ఒకసారి, టిఆర్‌ఎస్ ఒకసారి ఎస్.టి.ఎఫ్. ఒకసారి గెలుపొందాయి. 1967లో కానుగంటి లక్ష్మీనరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు గెలిచారు. 1952లో ఇక్కడ గెలిచిన బుట్టి రాజాం 57లో సుల్తానాబాద్‌లో, 62లో పెద్దపల్లిలో, 67లోను స్తులాపూర్‌లో మొత్తం నాలుగుసార్లు విజయం సాధించారు. 1972లో ఇక్కడ గెలుపొందిన వి.జగపతిరావు, 1989లో కరీంనగర్‌లో ఇండిపెండెంటుగా నెగ్గారు. ఇక్కడ నుంచి గెలిచి మంత్రి పదవి నిర్వహించినవారిలో జీవన్‌రెడ్డితోపాటు, రాజేశంగౌడ్, ఎల్.రమణ కూడా ఉన్నారు. రాజేశంగౌడ్ గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్‌లో పనిచేస్తే, రమణ 1995లో చంద్రబాబు క్యాబినెట్‌లో పనిచేసారు.
జగిత్యాల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment