రాజకీయం గరం గరం | Sakshi
Sakshi News home page

రాజకీయం గరం గరం

Published Tue, Oct 10 2023 4:29 AM

Politics in the state became more heated - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడటంతో రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీతోపాటు బీఎస్పీ ఇప్పటికే ఎన్నికల కోసం సిద్ధమవడం మొదలుపెట్టగా.. ఇకపై పూర్తిస్థాయిలో శక్తియుక్తులను కేంద్రీకరించనున్నాయి. అభ్యర్థుల జాబితాలు, మేనిఫెస్టోల ప్రకటన, ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, స్టార్‌ క్యాంపెయినర్ల ప్రచారం వంటివి ఊపందుకోనున్నాయి. 

అభ్యర్థుల ప్రకటనతో బీఆర్‌ఎస్‌ దూకుడు 
ఈ ఏడాది మార్చి నుంచే ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఎన్నికల సన్నద్ధతను బీఆర్‌ఎస్‌ మొదలుపెట్టింది. అధికారిక కార్యక్రమాల పేరిట సీఎం కేసీఆర్, మంత్రులు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. అంతేగాకుండా 50రోజుల క్రితమే అంటే ఆగస్టు 21న అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే పెద్దపీట వేయడంపై తలెత్తిన అసంతృప్తిని వివిధ నామినేటెడ్‌ పదవులు, ఇతర రూపాల్లో బుజ్జగించారు.

పార్టీ టికెట్‌ దక్కని ఎమ్మెల్యేలు రేఖానాయక్, బాపూరావు రాథోడ్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, తన కుమారుడికి టికెట్‌ ఇవ్వలేదనే కారణంతో ఎంపీ మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్‌ను వీడారు. మరోవైపు గడిచిన పక్షం రోజుల్లోనే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సుమారు 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయడం ఎన్నికల ప్రచార సభలను తలపించింది. ఈ నెల 15న పార్టీ మేనిఫెస్టో ప్రకటన, అభ్యర్థులకు బీఫారాల పంపిణీతోపాటు ఎన్నికల ప్రచార సభలకు కేసీఆర్‌ శ్రీకారం చుడుతున్నారు. 

గ్యారంటీలతో కాంగ్రెస్‌ అడుగులు 
రైతు, యువత డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీ స్కీమ్‌ల ప్రకటన వంటి అంశాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. జాతీయ పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించడం ద్వారా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపి, ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేసింది. తుక్కుగూడ బహిరంగ సభలో పార్టీ అగ్రనేతలతో హామీలు ఇప్పించింది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఎన్నికల మేనిఫెస్టోకు తుదిరూపునిచ్చి మరో పది రోజుల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

అయితే పార్టీ అభ్యర్థుల ఖరారుపై ఇటు హైదరాబాద్, అటు ఢిల్లీలో చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతున్నా.. ఇంకా కొలిక్కి రాలేదు. 2018 ఎన్నికల్లో చివరి నిమిషం దాకా అభ్యర్థుల ప్రకటనలో జాప్యంతో నష్టం జరిగిందని.. ఈసారి వీలైనంత త్వరగా ప్రకటించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. త్వరలో టీపీసీసీ నేతలు బస్సుయాత్ర ప్రారంభించనుండటంతో.. టికెట్‌ రానివారితో ఇబ్బందులు వస్తాయన్న భావన పార్టీలో వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో దసరా పండుగ తర్వాత అభ్యర్థుల జాబితాను విడుదల చేసే యోచనలో కాంగ్రెస్‌ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. మంగళవారం హైదరాబాద్‌లో జరిగే కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల సలహా కమిటీ (పీఏసీ) భేటీలో బస్సుయాత్ర, ఇతర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. 
అగ్రనేతలను రంగంలోకి దింపుతున్న బీజేపీ 

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో బీజేపీ ప్రచారం కోసం అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రుల పర్యటనలు ఖరారయ్యాయి. మంగళవారం ఆదిలాబాద్‌లో బహిరంగ సభతోపాటు హైదరాబాద్‌లో వివిధ రంగాలకు చెందిన వృత్తినిపుణులు, మేధావులతో నిర్వహించే సమావేశంలో అమిత్‌షా పాల్గొంటారు. ఈ నెల 27న కూడా అమిత్‌షా మరోమారు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు.

ఇక ఈ నెల 14న హైదరాబాద్‌ శివార్లలోని శేరిలింగంపల్లితోపాటు మరో నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్, 15న ముషీరాబాద్‌తోపాటు మరోచోట కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి పర్యటిస్తారని బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 16న హుజూరాబాద్, మహేశ్వరం అసెంబ్లీ స్థానాల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటిస్తారని.. 19న మధిరలో కేంద్ర మంత్రి నారాయణస్వామి పర్యటిస్తారని తెలిపారు.

మరోవైపు ఈ నెలాఖరులోగా ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలు నిర్వహించేందుకు బీజేపీ సిద్దమవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోకు ముఖ్య నేతలు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో 38 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

కమ్యూనిస్టులు, ఇతర పార్టీలూ తెరపైకి.. 
కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎం ఇటీవల కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు సిద్ధమయ్యాయి. కానీ చర్చలు కొలిక్కి రాలేదు. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో ఒప్పందం కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెం, మునుగోడులో సీపీఐ.. భద్రాచలం, కొత్తగూడెంలో సీపీఐకి కాంగ్రెస్‌ సీట్లు ఇస్తుందని అంటున్నారు. కానీ అధికారికంగా ఏదీ తేలలేదు.

మరోవైపు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలోని తెలంగాణ జనసమితి కూడా కాంగ్రెస్‌తో కలసి పోటీచేయాలని భావిస్తున్నా.. ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కాంగ్రెస్‌లో వైఎస్‌ షర్మి ల నేతృత్వంలోని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ విలీనం అంశం కూడా మరుగున పడింది. మరోవైపు బహుజన సమాజ్‌ పార్టీ తొలి విడత జాబితాను ప్రకటించింది. జనసేన, టీటీడీపీ వంటి పార్టీలు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సన్నాహలు చేస్తున్నాయి. 

గతం కన్నా వారం ముందు.. 
ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గతసారితో పోలిస్తే వారం రోజులు ముందే జర గనుంది. గత ఎన్నికల్లో డిసెంబర్‌ 7న పోలింగ్‌ నిర్వహించగా.. ఈసారి నవంబర్‌ 30వ తేదీనే జరగనుంది. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్‌ నాటి నుంచి పోలింగ్‌ వరకు 51 రోజులు మాత్రమే గడువు మిగిలింది.

Advertisement
 
Advertisement
 
Advertisement